ఆఫీసుకు వెళ్లే హడావుడిలో ఈ తప్పులు చేస్తున్నారా ? - సమస్యలు తప్పవట!
-షూస్, హెల్మెట్, కారు వాడే విషయంలో పలు జాగ్రత్తలు తప్పనిసరి అని నిపుణుల సూచన - లేదంటే ఈ సమస్యలు ఎదురయ్యే అవకాశం అని హెచ్చరిక!

Published : September 1, 2026 at 3:41 PM IST
Mistakes to Avoid in Daily Life: ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు పని హడావుడిలో పడి ఎన్నో విషయాలను నిర్లక్ష్యం చేస్తుంటారు. ప్రతి రోజూ ఇల్లు, వంటపాత్రలను క్లీన్ చేస్తుంటారు కానీ.. వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించే షూస్, బైక్ హెల్మెట్, కారు వంటి వస్తువుల శుభ్రతను మాత్రం పట్టించుకోరు. అయితే, ఈ చిన్న నిర్లక్ష్యం ఆయా వస్తువులపై కేవలం దుమ్ము పేరుకుపోవడానికే కాకుండా ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అందుకే రోజూ వాడే వస్తువులను విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
హెల్మెట్: పని మీద బయటికి వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించడం పరిపాటి. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత బైక్‌ను రోడ్డు వారిగానో, ఆరు బయటో నిలిపి హెల్మెట్ తగిలిస్తారు. మళ్లీ వెళ్లాలనుకున్నప్పుడు దాని తీసి తలమీద పెడుతుంటారు. ఈ గ్యాప్‌లో అందులో ఏ పురుగో దూరితే చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే హెల్మెట్ లోపల, చెవుల వద్ద చిన్నపాటి ఖాళీలు ఉంటాయని, అందులో ఏదైనా పురుగు చేరి తలకు 'పెట్టుకోగానే చెవిలోకి వెళ్లిందంటే చాలా ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు. వాహనం నడిపే సమయంలో అది బయటకు వస్తే ఆందోళనకు లోనవుతామని, ఆ సమయంలో పట్టు కోల్పోయే అవకాశం ఉందంటున్నారు. అందుకే హెల్మెట్ తలకు తగిలించుకునే ముందు.. లోపల ఏమైనా ఉన్నాయేమో చూసుకోవడం ఎంతో ముఖ్యమంటున్నారు.
షూస్: ఆఫీసు, కాలేజీలు, స్కూళ్ల నుంచి రాగానే షూస్ విడిచి పక్కన పడేస్తుంటారు చాలా మంది. ఇక మరుసటి రోజు పొద్దున్నే హడావుడిగా ఆఫీసుకు బయల్దేలే క్రమంలో పక్కన పెట్టి షూస్ బయటకు లాగి.. అందులో కాలు పెట్టేస్తారు. ఫోను మాట్లాడుతూనో, ఆఫీసుకి టైమ్ అవుతుందనే ఆత్రుత వల్లనో షూ లోపల ఏముందో చూడాలనే ఆలోచన కూడా రాదు. అయితే షూస్‌లోకి తేలు, కాళ్లజెర్రి, పాము తదితర విషకీటకాలు చేరే ప్రమాదం ఉందని, కాలు ఒత్తిడి తగలగానే కాటేయొచ్చని.. ఒక్కోసారి ప్రాణాలు పోయే అవకాశం ఉందంటున్నారు. అందుకే ఎంత హడావుడి ఉన్న షూస్ వేసుకునేముందు వాటిని లోపల ఏముందో చెక్ చేయడంతో పాటు లోపలి నుంచి క్లీన్ చేసుకోవడం మంచిదంటున్నారు.
కారు క్లీన్: ప్రస్తుత రోజుల్లో కారు ప్రతి ఒక్కరి ఇంట్లో భాగమైంది. పని మీద బయటికి వెళ్లాలంటే అందరూ వీటినే వాడతారు. ఇక కారు తీసుకుని బయటకు వెళ్లే ముందు కారు ముందుభాగంలోని అద్దాలు మాత్రమే క్లీన్ చేస్తారు. కానీ తాగి వదిలేసిన వాటర్ బాటిల్స్, ఖాళీ కూల్‌డ్రింక్ డబ్బాలను పెద్దగా పట్టించుకోరు. కానీ ఇవి కూడా ప్రమాదమే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే కారు ప్రయాణించే సమయంలో అవి నిదానంగా డ్రైవర్ కాళ్ల వద్దకు వచ్చి బ్రేక్, యాక్సిలేటర్, క్లచ్‌కు అడ్డుపడొచ్చని, ఈ సమయంలో హఠాత్తుగా బ్రేక్ నొక్కితే పడదంటున్నారు. తేరుకునే లోపే ఎదురున్న వాహనాన్ని ఢీకొట్టే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. అందుకే కారును యూజ్ చేసే ముందు శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.
కారు లాక్: పని మీద బయటికి వెళ్లి తిరిగి ఇంటికొచ్చాక కార్ పార్క్ చేస్తారు, కానీ లాక్ వేయడం మర్చిపోతుంటారు చాలా మంది. ఏముందిలే అని నిర్లక్ష్యం వహిస్తుంటారు. కానీ ఈ విషయంలో అజాగ్రత్త పనికిరాదని నిపుణులు చెబుతున్నారు. కార్ నిలిపిన తర్వాత ఒక్క నిమిషం ఆగి డోర్లు లాక్ వేయడం మర్చిపోవద్దంటున్నారు. ఈ నిర్లక్ష్యం ప్రాణాలమీదకు వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే కారు లాక్ వేయకపోవడం వల్ల పిల్లలు సరదాగా అందులోకి ఎక్కుతుంటారని, ఫలితంగా ఆటోమెటిక్‌గా లాక్ పడి ఊపిరాడదంటున్నారు. కాబట్టి కారు పార్కు చేసినప్పుడు కచ్చితంగా లాక్ వేయాలని సూచిస్తున్నారు. అలాగే కారు నడిపే సమయంలోనూ లోపల పిల్లలుంటే.. చైల్డ్ లాక్ ఆన్ చేయడం మరచిపోవద్దంటున్నారు. ఎందుకంటే పిల్లలు తెలిసి తెలియక హఠాత్తుగా డోర్ తెరిస్తే వారితోపాటు పక్కన ప్రయాణించే వాహనాలకూ ప్రమాదమే అని హెచ్చరిస్తున్నారు.
వర్షాకాలంలో కారు డ్రైవింగ్ చేస్తున్నారా? - ఈ "యాక్సెసరీస్" తప్పనిసరంటున్న నిపుణులు!
మంచుకొండల్లో ప్రయాణం ఆహ్లాదమే! - కానీ ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే ట్రిప్ "హ్యాపీ"!

