ఘుమఘుమలాడే "మెంతికూర పచ్చడి" - కమ్మగా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది!
మెంతి ఆకు చట్నీ - సింపుల్‌గా ఇలా ట్రై చేయండి!

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 14, 2026 at 4:48 PM IST
Menthi Aaku Chutney : మెంతి ఆకు బంగాళాదుంప, టమోటాలతో కలిపి కర్రీ చేస్తుంటారు. కానీ, ఎపుడైనా మెంతి ఆకు చట్నీ రుచి చూశారా? మెంతి ఆకుతో చేసే చట్నీ దోసెల్లోకి, రైస్‌లోకి అద్దిరిపోతుంది. పల్లీ చట్నీ, టమోటా చట్నీకి బదులు మెంతి ఆకు చట్నీ ఓ సారి ట్రై చేసి చూడండి. ఇక్కడ ఇచ్చిన పదార్థాలు, ఇదే పద్ధతిలో ఓ సారి ట్రై చేసి చూడండి. ఎంతో రుచిగా ఉంటుంది.
శివరాత్రికి "చిలగడ దుంప బొబ్బట్లు" - నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి!

కావల్సిన పదార్థాలు :
- మెంతి ఆకు - 3 కట్టలు
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
- మినప్పప్పు - 1 టేబుల్ స్పూన్
- జీలకర్ర - 1 స్పూన్
- కొత్తిమీర - చిన్న కట్ట
- ఎండు మిర్చి - 15
- ఉల్లిపాయ - 1
- పచ్చి కొబ్బరి - 2 టేబుల్ స్పూన్లు
- కరివేపాకు - 1 రెమ్మ
- ఉప్పు - రుచికి సరిపడా
- చింతపండు - కొద్దిగా

పోపు కోసం :
- నూనె - 1 స్పూన్
- వెల్లుల్లి - 8
- కరివేపాకు - 1 రెమ్మ
- ఆవాలు - అర స్పూన్
- జీలకర్ర - అర స్పూన్
- పచ్చిపప్పు - అర స్పూన్
- ఎండుమిర్చి - 2
- ఇంగువ - చిటికెడు

తయారీ విధానం :
- ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఆ తర్వాత శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి. దోరగా వేగే వరకు వేయించి ఆ తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర మాడిపోకుండా సన్నటి మంటపై వేయించాక ముందుగా ఓ చిన్న కట్ట కొత్తిమీర వేసుకోవాలి. ఆ తర్వాత ఎండు మిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి. ఎండు మిర్చి రంగు మారే వరకు దోరగా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి. అదే కడాయిలో కొద్దిగా నూనె వేసుకుని ఓ ఉల్లిపాయను కట్ చేసుకుని వేసుకోవాలి.

- ఆ తర్వాత 3 కట్టల మెంతి ఆకు శుభ్రం చేసుకుని వేసుకోవాలి. వేగే వరకు సన్నటి మంటపై మూతపెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసుకుని దోరగా వేగే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి మాడిపోకుండా వేయించాక కరివేపాకు వేసుకుని స్టవ్ కట్టేసి దించుకోవాలి. ఇపుడు మిక్సీలోకి వేయించిన ఎండుమిర్చి, కొత్తిమీర తోపాటు రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా చింతపండు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి.

- ఆ తర్వాత వేయించిన ఉల్లిపాయ మెంతి ఆకు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. అంతే! మెంతి ఆకు చట్నీ రెడీ. చివరగా పోపు కలుపుకుంటే చాలు! చట్నీ ఘుమఘుమలాడుతుంది. ఇపుడు కడాయిలోకి కొద్దిగా నూనె వేసుకుని వెల్లుల్లితో పాటు కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు వేసుకుని వేయించాలి. చివరగా 2 ఎండుమిర్చి, ఇంగువ వేసుకుని కలిపితే చాలు!
"పాలకూర పచ్చి బఠానీ కర్రీ" - ఇదొక్కటి చాలు పూరీ, రైస్‌లో పర్ఫెక్ట్గా ఉంటుంది!
నోరూరించే "వెల్లుల్లి మిరియాల రసం" - కమ్మగా గొంతులోకి దింగుతుంటే ఆహా అనాల్సిందే!

