తియ్యగా, కారంగా "బనానా బన్స్" - బెలూన్ల మాదిరి పొంగుతాయి - టేస్ట్ గురించి మాటల్లేవ్!
- పండిన అరటిపండ్లతో సూపర్ టేస్టీ రెసిపీ - అప్పటికప్పుడు చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు!

Published : January 7, 2026 at 12:36 PM IST
Mangalore Buns Recipe: తక్కువ ఖర్చులో, సీజన్‌తో సంబంధం లేకుండా లభించే పండ్లు అంటే అరటిపండ్లు మాత్రమే. వీటిని పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ చాలా అంటే చాలా ఇష్టంగా తింటుంటారు. నేరుగా తినడం ఇష్టం లేని వారు మిల్క్‌షేక్ చేసుకుని తాగుతుంటారు. అయితే, అరటిపండ్లతో స్మూతీలు మాత్రమే కాకుండా కమ్మని బన్స్ కూడా చేసుకోవచ్చు. ఇవి కర్నాటక స్పెషల్ అని చెప్పొచ్చు. తయారు చేసుకోవడం చాలా సులువు. ఈవెనింగ్ స్నాక్‌గా, ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వీటిని అప్పటికప్పుడు తయారు చేసి ఇవ్వొచ్చు. మరి, లేట్ చేయకుండా తియ్యగా, ఉప్పగా ఉండే బనానా బన్స్ ఎలా చేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:
- పండిన అరటి పండ్లు - 3
- బేకింగ్ సోడా - పావు టీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- పంచదార - 1 టీస్పూన్
- గోధుమపిండి - రెండు కప్పులు
- జీలకర్ర - 1 టీస్పూన్
- నూనె - 1 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం :
- పండిన అరటి తొక్కలు తీసేసి పండ్లను మిక్సింగ్ బౌల్లోకి వేసి వీలైనంత మెత్తగా మెదుపుకోవాలి.
- అందులోకి ఉప్పు, పంచదార, బేకింగ్ సోడా వేసి పలుకులు లేకుండా క్రీమ్ మాదిరి కలుపుకోవాలి.
- అరటిపండు గుజ్జులోకి గోధుమపిండి, జీలకర్ర, నూనె వేసి అంతా కలిసేలా సాఫ్ట్ చపాతీ ముద్ద మాదిరి కలుపుకోవాలి.

- ఇలా కలుపుకున్న పిండిపై లైట్‌గా ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి సుమారు మూడు లేదా నాలుగు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి.
- పిండి నానిన తర్వాత మూత తీసి మరొక్కసారి కలిపి నిమ్మకాయ సైజ్‌లో ఉండలుగా చేసుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్‌ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.
- ఈలోపు చపాతీ పీట మీద లైట్‌గా నూనె అప్లై చేసి ఓ ఉండను కర్రతో రోల్ చేసుకోవాలి. అయితే వీటిని మరీ పల్చగా కాకుండా కాస్త మందంగానే రోల్ చేసుకోవాలి.

- ఇలా ప్రిపేర్ చేసుకున్న పూరీని కాగుతున్న నూనెలో వేసి హై-ఫ్లేమ్‌లోనే కాలనివ్వాలి.
- పూరీ పొంగుతున్నప్పుడు గరిటెతో లైట్‌గా ప్రెస్ చేసుకుంటూ కాల్చాలి. పూరీ ఓవైపు కాలినాక రెండో వైపు తిప్పి కాల్చాలి. ఇలా రెండు వైపులా పొంగి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారినాక తీసి ప్లేట్లోకి వేసుకోవాలి.
- ఇలా ఒక్కొక్క ఉండను పూరీ సైజ్‌లో రోల్ చేసుకుని నూనెలో వేసి కాల్చుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న వాటిని వేడివేడిగా ఏదైనా చట్నీతో కలిపి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బనానా బన్స్ రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

చిట్కాలు :
- ఈ రెసిపీ కోసం మరీ పచ్చివి, మరీ పండినవి కాకుండా మీడియం సైజ్‌లో పండినవి తీసుకోండి. ఒకవేళ మీకు పండిన అరటిపండ్లు అయినా ప్రాబ్లమ్ లేదనుకుంటే వాటిని యూజ్ చేసుకున్నా సరిపోతుంది.
- అరటి పండ్లను బాగా మెత్తగా చేసుకోవాలి. ఎలాంటి పలుకులూ లేకుండా చూసుకోవాలి. అయితే మెత్తగా రావాలని మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే సరిగ్గా రావు. చేతితో మెదిపితేనే బన్స్ మరింత సాఫ్ట్‌గా వస్తాయి.
- గోధుమపిండిని పైన చెప్పిన కొలత ప్రకారం కాకుండా అరటి పండు గుజ్జులోని తేమను బట్టి పెంచి లేదా తగ్గించి తీసుకోవచ్చు.
- వీటిని కాల్చుకునేటప్పుడు నూనె బాగా కాగి ఉండాలి. అలాగే వీటిని హై-ఫ్లేమ్‌లో ఉంచి రెండు వైపులా కాల్చుకోవాలి.
- పూరీలు ఏమాత్రం పల్చగా చేసినా, నూనె సరిగ్గా కాగకపోయినా పర్ఫెక్ట్గా పొంగవు. పైగా ఆయిల్ పీల్చుకుంటాయి.
బ్రేక్‌ఫాస్ట్‌లోకి అద్దిరిపోయే "సేమియా పులిహోర" - పావుగంటలోనే రెడీ! - టేస్ట్ సూపర్!
సంక్రాంతి స్పెషల్ : జొన్నపిండి "రిబ్బన్ పకోడీ" - తక్కువ నూనెతోనే కరకరలాడిపోద్ది!

