పిల్లలు ఇష్టపడే కరకరలాడే "కచోరీలు" - సూపర్ టేస్ట్! - రెండు వారాలు నిల్వ!
ఈవెనింగ్ టైమ్‌కు అద్దిరిపోయే స్నాక్ - తక్కువ పదార్థాలతో సింపుల్‌గా రెడీ!

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 28, 2026 at 5:27 PM IST
Tasty Dry Kachori Recipe : ప్రస్తుతం పిల్లలకు వేసవి సెలవులు ఉన్నాయి. దాంతో ఇంటి వద్ద ఉండే చిన్నారులు తినడానికి చిరుతిళ్లు అడుగుతుంటారు. అప్పుడు రోజూ పునుగులు, పకోడీలు, మిర్చీ బజ్జీ వంటివి చేసి పెట్టాలంటే కుదరకపోవచ్చు. తగినంత సమయం ఉండకపోవచ్చు. అదే, పిండి వంటలైతే ఒక్కసారి చేసి ఉంచితే రెండు మూడు వారాల పాటు నిల్వ ఉంటాయి. ఇప్పుడు మీకోసం అలాంటిదే ఒక స్పెషల్ స్నాక్ రెసిపీని తీసుకొచ్చాం. అదే, కరకరలాడే టేస్టీ "డ్రై కచోరీలు". పెసరపప్పు స్టఫింగ్తో ఇవి భలే రుచికరంగా ఉంటాయి. అలాగే, వీటిని ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్! పిల్లలైతే ఒకటికి రెండు ఇష్టంగా తింటారు. మరి, లేట్ చేయకుండా ఈ వెరైటీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- నాలుగు టేబుల్‌స్పూన్లు - రవ్వ
- నాలుగు కప్పులు - మైదా
- మూడు స్పూన్లు - నెయ్యి
- టేస్ట్‌కు సరిపడా - ఉప్పు
- ఒక టీస్పూన్ - వాము
- వేయించడానికి తగినంత - ఆయిల్
స్టఫింగ్ కోసం :
- ఒక కప్పు - పెసరపప్పు
- రెండు స్పూన్లు - సోంపు
- రెండు చెంచాలు - కారం
- రెండు స్పూన్లు - ధనియాలు
- ఒక స్పూన్ - జీలకర్ర
- అర స్పూన్ - వాము
- ఒక స్పూన్ - ఆమ్చూర్ పౌడర్
- ఒక స్పూన్ - గరంమసాలా
- కొద్దిగా - ఇంగువ
పైనాపిల్‌తో పసందైన "చట్నీ" - అన్నం, టిఫెన్స్లోకి సూపర్ ఆప్షన్!

తయారీ విధానం :
- ఈ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ కోసం ముందుగా స్టఫింగ్‌ను సిద్ధం చేసుకోవాలి.
- ఇందుకోసం ఒక గిన్నెలో పెసరపప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. ఆపై అందులో తగినన్ని నీళ్లు పోసి నాలుగు గంటలు నానబెట్టాలి.
- పెసరపప్పు మంచిగా నానిందనుకున్నాక వాటర్ వడకట్టి దాన్ని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని పక్కనుంచాలి.
- అనంతరం స్టవ్ మీద ఒక కడాయిలో కొద్దిగా నూనె వేసి సోంపు, జీలకర్ర, ధనియాలను దోరగా వేయించుకోవాలి.
- అవి వేగిన తర్వాత అందులోనే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు, ఇంగువ వేసి సన్నని సెగ మీద గరిటెతో కలియతిప్పుతూ కాసేపు వేయించాలి.

- ఆ మిశ్రమం మొత్తం వేగాక కారం, రుచికి తగినంత ఉప్పు, ఆమ్చూర్ పౌడర్, గరంమసాలా వేసుకుని అంతా కలిసేలా మిక్స్ చేస్తూ పొడిపొడిలాడే వరకూ వేయించి దింపేసుకుంటే చాలు. అంతే, స్టఫింగ్ రెడీ అవుతుంది!
- ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె లేదా బేషన్ తీసుకుని అందులో జల్లించిన మైదాపిండి, రవ్వ, వాము, నెయ్యి, కాస్త ఉప్పు వేసి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
- ఆ తర్వాత అందులో తగినన్ని నీళ్లను కొద్దికొద్దిగా యాడ్ చేసుకుంటూ మెత్తని పిండి ముద్దలా కలిపి 20 నిమిషాల పాటు పక్కనుంచాలి.
- ఇరవై నిమిషాల అనంతరం ఆ పిండి మిశ్రమంలో నుంచి కొద్దికొద్దిగా తీసుకుంటూ పూరీ సైజు రొట్టెలు చేయాలి.

- అనంతరం ఒక్కో పూరీని తీసుకుంటూ దాని మధ్యలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెసరపప్పు స్టఫింగ్‌ను తగినంత ఉంచి అంచులు మూసేసి కచోరీల్లా రెడీ చేసుకోవాలి.
- అలా అన్నింటిని రెడీ చేసుకుని ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
- నెక్ట్స్ స్టవ్ మీద కడాయిలో వేయించడానికి తగినంత నూనె వేసి వేడి చేసుకోవాలి.
- ఆయిల్ కాగిన తర్వాత స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ముందుగా ప్రిపేర్ చేసుకున్న కచోరీలను తగినన్ని వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి.

- కచోరీలు రెండు వైపులా మంచిగా వేగాయనుకున్నాక టిష్యూ పేపర్ పరచిన ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి.
- ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని సీసాలో స్టోర్ చేసుకోండి. ఇవి కరకరలాడుతూ రెండు వారాల పాటు నిల్వ ఉంటాయి!
- అంతే, తక్కువ టైమ్‌లోనే కరకరలాడే టేస్టీ "డ్రై కచోరీలు" మీ ముందు ఉంటాయి!
- మరి, నచ్చితే మీరూ రెగ్యులర్ స్నాక్స్‌కు బదులుగా ఈ కచోరీలు ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు!
సరికొత్త రుచితో "పల్లీ చట్నీ" - ఇంట్లోనే బెంగళూరు స్టైల్ పక్కా!
జొన్నలు, సజ్జలతో "రొట్టెలు" కామన్ - ఇలా మునక్కాయలతో ట్రై చేయండి! - టేస్ట్ సూపర్!

