మహా శివరాత్రి స్పెషల్ : నోరూరించే "చిలగడదుంప హల్వా" - నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది!
చిలగడదుంపతో పిల్లలు పెద్దలూ ఇష్టంగా తినే స్వీట్ రెసిపీ - సింపుల్‌గా ఇలా ఇంట్లో చేసేయండి!

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 15, 2026 at 10:13 AM IST
Chilakada Dumpa Halwa in Telugu : మనిషిలోని శక్తిని ఉప్పొంగించి ఆధ్యాత్మిక శిఖరానికి చేర్చే పర్వదినమే మహా శివరాత్రి. ఈరోజున పరమేశ్వరుడిని స్మరిస్తూ ఉపవాసం, జాగారం చేస్తుంటారు. అంతేకాక మరెన్నో ఆధ్యాత్మిక, జీవన సందేశాలున్న సుదినం. ఈ సందర్భంగా సాయంత్రం ఉపవాసం విడిచే క్రమంలో పండ్లు, ప్రసాదాలు, చిలగడదుంపలను తింటారు. చిలగడుదుంపలను కొంతమంది పచ్చిగా తింటే, మరికొందరు ఉడకబెట్టి తింటారు.
అందుకే ఇవాళ మీకోసం ఓ సరికొత్త స్వీట్ రెసిపీని తీసుకొచ్చాం. ఎప్పుడూ ఓకేలా కాకుండా ఓసారి చిలగడదుంపలను ఉపయోగిస్తూ ఇలా హల్వా చేసి పెట్టారంటే తిన్నవారు వావ్ అనాల్సిందే. నిమిషాల్లోనే దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ పదార్థాలతో అప్పటికప్పుడు తయారవుంది. అంతేకాక ఇది ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేయమని అడుగుతారు! బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఈ విధంగా చేసి సర్ప్రైజ్ ఇవ్వండి. మరి సింపుల్, టేస్టీ చిలగడదుంప హల్వాను ఎలా ప్రిపేర్ చేయాలి? ఇందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.
"పాలకూర పచ్చి బఠానీ కర్రీ" - ఇదొక్కటి చాలు పూరీ, రైస్‌లో పర్ఫెక్ట్గా ఉంటుంది!

కావాల్సిన పదార్థాలు :
- చిలగడదుంపలు - 6
- బెల్లం - ముప్పావు కప్పు
- యాలకుల పొడి - అర స్పూన్
- నెయ్యి - పావు కప్పు
- జీడిపప్పు - 20

తయారీ విధానం :
- ముందుగా ఆరు చిలగడదుంపలను శుభ్రంగా కడగాలి. అనంతరం స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ ప్లేట్స్ మీద చిలగడదుంపలను ఉంచి ఆవిరి మీద ఉడికించాలి.
- చిలగడదుంపలు ఉడికిన తర్వాత పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని మిక్సీజార్‌లో వేసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేయాలి.

- అలాగే స్టవ్ ఆన్ చేసి పాన్‌లో ఒక టేబుల్ స్పూన్లో నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత 20 జీడిపప్పు పలుకులు వేసి ఫ్రై చేయాలి. అనంతరం వీటిని ఓ ప్లేట్లో వేయాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్‌లో ముప్పావు కప్పు బెల్లం, పావు కప్పు నీళ్లు పోయాలి. బెల్లం కరిగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న చిలగడదుంపల పేస్ట్ వేయాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి కొద్దికొద్దిగా నెయ్యి వేస్తూ ఉడికించాలి.

- ఈ మిశ్రమం ఉడికిన తర్వాత అర స్పూన్ యాలకుల పొడి, ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు వేసి మిక్స్ చేయాలి. అనంతరం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- అంతే టేస్టీటేస్టీ చిలగడదుంపల హల్వా సిద్ధంగా ఉంటుంది!

- ఈ హల్వాను ఎయిర్‌టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మూడు రోజుల వరకు నిల్వ ఉంటుంది!
- మీరు ఈ హల్వాను ఎక్కువ మోతాదులో చేసుకోవాలనుకుంటే చిలగడదుంపలు, బెల్లంతో పాటు ఇతర పదార్థాలను అందుకనుగుణంగా పెంచి తీసుకోవాలి.
- మరి మీకు ఈ రెసిపీ నచ్చితే ఓసారి ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి!
శివరాత్రికి "చిలగడ దుంప బొబ్బట్లు" - నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి!
నోరూరించే "వెల్లుల్లి మిరియాల రసం" - కమ్మగా గొంతులోకి దింగుతుంటే ఆహా అనాల్సిందే!

