అన్నం మిగిలిపోయిందా? - ఇలా "కట్లెట్స్" చేయండి! - డీప్ ఫ్రై అవసరం లేదు!
- మిగిలిపోయిన అన్నంతో సూపర్ టేస్టీ 'స్నాక్' - ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుంటూ తింటారు!

Published : November 13, 2025 at 12:01 PM IST
Leftover Rice Snack Recipe : మనలో చాలామందికి అన్నం ఆచితూచి వండటం రాదు. ఒకవేళ సరిగ్గా అంచనా వేసి సరిపోయేలా వండినా ఎవరో ఒకరు అసలే తినకపోవడమో, కొద్దిగానే తినడమో జరుగుతుంటుంది. దాంతో అందరి ఇళ్లలోనూ చాలాసార్లు అన్నం మిగిలిపోతుంది. కూరలు మిగిలితే ఫ్రిడ్జ్‌లో ఉంచి వేడి చేసుకుని తింటుంటాం. కానీ, అన్నం అలా తినలేం. బయటపారేయాలంటే మనసొప్పదు. పైగా, ప్రస్తుతం చలికాలం మధ్యాహ్నం మిగిలిన అన్నం రాత్రికి తినాలంటే చల్లగా ఉండి తినబుద్ధి కాదు.
అందుకే, మీ అందరి కోసం అన్నం మిగిలిపోతే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునేలా ఒక సూపర్ స్నాక్ రెసిపీని తీసుకొచ్చాం. అదే, క్రిస్పీ అండ్ టేస్టీ "రైస్ కట్లెట్స్". సూపర్ టేస్టీగా ఉండే వీటిని పిల్లలైతే ఒకటికి రెండు భలే ఇష్టంగా తింటారు. అలాగే, ఈ కట్లెట్స్ను డీప్ ఫ్రై లేకుండా తక్కువ నూనెతో ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మరి, మిగిలిపోయిన అన్నంతో ఈ సూపర్ టేస్టీ స్నాక్ రెసిపీని ఎలా చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- అన్నం - ఒక కప్పు
- ఉడికించి మెదిపిన బంగాళదుంపముద్ద - అరకప్పు
- సన్నని ఉల్లిపాయ తరుగు - అరకప్పు
- పచ్చిమిర్చి తరుగు - చెంచాన్నర
- సన్నని కొత్తిమీర తరుగు - రెండు చెంచాలు
- పసుపు - తగినంత
- కారం - పావుచెంచా
- జీలకర్రపొడి - అరచెంచా
- గరంమసాలా - పావుచెంచా
- శనగపిండి - మూడు చెంచాలు
- ఉప్పు - టేస్ట్‌కి సరిపడా
- నూనె - మూడు చెంచాలు

చిట్కాలు :
- మిక్సింగ్ బౌల్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని కలిపేటప్పుడు అన్నాన్ని కాస్త మెత్తగా మెదుపుకోవాలి.
- ఇక్కడ మీరు శనగపిండి వద్దనుకుంటే దానికి బదులుగా బియ్యప్పిండి, బ్రెడ్‌పొడి వంటివి వాడుకోవచ్చు.
- పెనం వేడయ్యాక కట్లెట్స్ను లో టూ మీడియం ఫ్లేమ్‌లో కాల్చుకోవాలి. అప్పుడే రైస్ కట్లెట్స్ లోపలి వరకు మంచిగా కాలి క్రిస్పీగా, టేస్టీగా వస్తాయి.
బియ్యం, మజ్జిగతో కరకరలాడే "వడలు" - నూనె తక్కువ, రుచి ఎక్కువ!

తయారీ విధానం :
- ఈ ఇన్స్టంట్ స్నాక్ ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక గిన్నెలో బంగాళదుంపలను తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి.
- అవి ఉడికేలోపు రెసిపీలోకి కావాల్సిన పరిమాణంలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీరలను వీలైనంత సన్నగా కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి.
- ఇప్పుడు మంచిగా ఉడికిన బంగాళదుంపలను పొట్టు తీసుకుని మెత్తని ముద్దలా మాష్ చేసుకోవాలి. బంగాళదుంప ముద్ద అనేది అర కప్పు పరిమాణంలో ఉండేలా చూసుకోవాలి.

బిగినర్స్ కూడా ఈజీగా చేసే "పెసరట్టు" - హోటల్ స్టైల్లో క్రిస్పీగా, సూపర్ టేస్టీగా!
- అనంతరం ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించి మాష్ చేసుకున్న బంగాళదుంపముద్ద, మిగిలిన అన్నం, ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేసుకుని ఒకసారి అన్నింటినీ బాగా కలుపుకోవాలి.
- తర్వాత అందులో జీలకర్రపొడి, రుచికి తగినంత ఉప్పు, కారం, పసుపు, గరంమసాలా, శనగపిండి వేసుకుని మరోసారి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై ఉప్పు చెక్ చేసుకుని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి.
- నెక్ట్స్ చేతికి కాస్త నూనె రాసుకుని కలిపి పెట్టుకున్న అన్నం మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని గుండ్రని కటెలెట్ మాదిరిగా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే పిండి మొత్తాన్ని కట్లెట్స్లా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

- తర్వత స్టవ్ మీద దోశ పాన్ పెట్టుకుని వేడి చేసుకోవాలి. పాన్ వేడయ్యాక కొద్దిగా వేసుకుని రెండు మూడు కట్లెట్స్ ఉంచి మీడియం ఫ్లేమ్‌లో ఎర్రగా కాల్చుకోవాలి.
- అవి వన్‌సైడ్ మంచిగా కాలిన తర్వాత మరో వైపునకు తిప్పేసుకుని అటు వైపు కూడా మంచిగా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే చాలు.
- అంతే, మిగిలిన అన్నంతో సూపర్ టేస్టీ అండ్ క్రిస్పీ "కట్లెట్స్" అప్పటికప్పుడు రెడీ అవుతాయి!
పిల్లలకు నచ్చేలా "పనీర్ కట్లెట్స్" చేయండి - పైన క్రంచీగా, లోపల సాఫ్ట్‌గా !

