కేరళలో తెరుచుకున్న మరో ఆలయం - కొట్టియూర్ ఉత్సవాల్లో మహిళలకూ ప్రవేశం!
"దక్షిణ కాశీ"గా పేరొందిన కొట్టియూర్ ఆలయం - 28రోజులు ఉత్సవాలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 4, 2026 at 10:52 AM IST
KOTTIYOOR TEMPLE HISTORY IN TELUGU : దైవభూమిగా పిలుచుకునే కేరళలో పవిత్రమైన అక్కరె కొట్టియూర్ ఆలయం (దక్షిణ కాశీ) శబరిమల మాదిరిగానే సంవత్సరంలో కొద్దిరోజులు మాత్రమే తెరుచుకుంటుంది. ఇక్కడ స్వయంభువై లింగరూపంలో వెలిసిన మహాశివుడిని పూజిస్తుంటారు. పురాణాల్లో పేర్కొన్న దాక్షాయణీ దేవి (పరమ శివుడి భార్య సతీదేవి) హోమగుండంలో దూకి ఆత్మార్పణ చేసుకున్న పవిత్రస్థలం కూడా ఇదేనని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ప్రతి సంవత్సరంలో వైశాఖ మాసంలో ఆలయాన్ని తెరిచి పూజలు చేస్తుంటారు. ఈ సంవత్సరంలో మే 29 నుంచి జూన్ 24 వరకు తెరిచి ఉంచనున్నారు. ఇక్కడ ఒడపూ (వెదురు పువ్వు)ను భక్తులు ప్రసాదంగా తీసుకువెళ్తుంటారు.

తనువు, మనస్సును ఏకం చేసే వాతావరణం
ఎటుచూసినా పచ్చదనం, కనుచూపు మేర ఆకాశాన్నంటే వయనాడ్ కొండలు, దిగువన పాదాలను స్పృశించే నదీ జలాలు, పైనుంచి శరీరాన్ని తడిమే వర్షపు జల్లులు! ఇలాంటి ఆహ్లాదకర వాతావరణంలో ఘల్లు ఘల్లు మంటూ వినసొంపైన కేరళ వాయిద్యాల చప్పుళ్లు తనువు, మనసును ఏకీకృతం చేస్తుంటాయి. గొలుసులతో బంధించిన గజరాజుల ఘీంకారాల నడుమ కొట్టియూర్ ఉత్సవాలను వీక్షించడానికి రెండు కళ్లు చాలవు. నిరాడంబరంగా, అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగే ఈ ఉత్సవాల్లో మహిళలు కూడా పాల్గొనే అవకాశం ఉంది.
యమునా పుష్కరాలకు ఆర్టీసీ బస్సు రెడీ - 11రోజుల్లో 13 క్షేత్రాలు!

వయనాడ్‌లో ఊరేగింపుతో ప్రారంభం
ఉత్సవాల ప్రారంభోత్సవానికి సంకేతంగా వయనాడ్‌లో ఊరేగింపు నిర్వహిస్తారు. ముత్తిరేరి నుంచి ఖడ్గాన్ని తీసుకువచ్చి పూజ కోసం ఇక్కడ ప్రతిష్ఠిస్తారు. ఉత్సవాల తర్వాత ఖడ్గాన్ని తిరిగి యథాస్థానానికి తీసుకువెళ్తారు. శివలింగానికి నెయ్యి, కొబ్బరి నీళ్లు, నదీ జలాలతో అభిషేకం నిర్వహిస్తారు.

ఆలయం ఎక్కడ ఉంది?
పశ్చిమ కనుమల్లోని కన్నూరు జిల్లాలో వయనాడ్ కొండల్లో బావలి నదికి ఇరువైపులా రెండు ఆలయాలు ఉంటాయి. ఇందులో పశ్చిమ వైపు శివాలయం ఏడాది పొడవునా తెరుచుకుని ఉంటుంది. తూర్పుతీరంలోని శివాలయం ఏడాదిలో కేవలం వైశాఖ మాసంలో ఉత్సవాలు నిర్వహించడానికి 28రోజులు మాత్రమే తెరుస్తారు. ఇక్కడ సిమెంటు, చెక్కతో నిర్మించిన శాశ్వత కట్టడాలేమీ కనిపించవు. ఆలయాన్ని మణితర నది నుంచి సేకరించిన తెల్లని రాళ్లతో నిర్మించి పై కప్పు గడ్డితో ఏర్పాటు చేశారు. సమీపంలో పూర్తిగా ప్రకృతి ఒడిలో మట్టి గోడలు, గడ్డి కప్పిన గుడిసెలు మాత్రమే ఉంటాయి.

పౌరాణిక నేపథ్యం
దాక్షాయణీ దేవి (సతీదేవి) పరమశివుడిని పెళ్లి చేసుకోవడాన్ని ఏమాత్రం ఇష్టపడని ఆమె తండ్రి దక్షుడు యజ్ఞం చేపట్టాడట. తన పుట్టింట జరిగే యజ్ఞానికి తమకు ఆహ్వానం లేకపోయినా సతీదేవి వెళ్లిందట. కానీ, దక్షుడు పరమశివుడి గురించి హేళనగా మాట్లాడడం, అవమానించడాన్ని తట్టుకోలేక దాక్షాయణీ దేవి అక్కడే మంటల్లో దూకి ఆత్మార్పణ చేసుకుందట. దీంతో ఆగ్రహించిన పరమశివుడు తన జటాఝూటం(శిరస్సు) నుంచి వీరభద్రుడిని సృష్టించి పంపిస్తాడు. దీంతో వీరభద్రుడు దక్షుడిని సంహరిస్తాడని ఆ స్థలం ఇదేనని పురాణాల ద్వారా తెలుస్తోంది.

'పువ్వు కాని పువ్వు'
కొట్టియూర్ ఉత్సవాల్లో "ఒడపూ"ను ప్రసాదంగా అందిస్తారు. ఉత్సవాల్లో పాల్గొనే భక్తులంతా తిరిగి వెళ్లే సమయంలో ఈ ఒడపూను ప్రసాదంగా స్వీకరించి ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపార దుకాణాల్లో అలంకరించుకుంటారు. ఈ పువ్వులను గడ్డి, వెదురుతో తయారు చేస్తుంటారు. ఇది అడుగు పొడవు వరకు ఉంటుంది. వెదురు కాండాన్ని కోసి, బెరడు తీసివేసి దంచి తయారు చేస్తారు. ఇది సహజసిద్ధంగా పూసిన పువ్వును పోలి ఉండడం విశేషం. ఈ పూల తయారీలో దాదాపు 5వేల మందికి ఉపాధి లభిస్తుంది.

భృగు మహర్షి గడ్డమే ఆ పువ్వు!
ఈ పువ్వు పూర్వ కాలంలో మునుల గడ్డాన్ని పోలి ఉంటుంది. దీని వెనుక చారిత్రక నేపథ్యం ఉంది. యజ్ఞాన్ని భగ్నం చేసే క్రమంలో వీరభద్రుడు భృగు మహర్షిపై దాడి చేసి గడ్డాన్ని పీకి అక్కర కొట్టియూర్‌లోని తిరువంచిరలో పడవేశాడని చెబుతారు. భక్తులు ఓడ పువ్వులను ఆ ముని గడ్డమేనని నమ్మి ప్రసాదంగా తీసుకువెళ్తుంటారు.

ఎలా వెళ్లాలంటే!
కొట్టియూర్ ఆలయాలు కన్నూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. లేదా తలస్సేరి రైల్వే స్టేషన్ నుంచి కూడా వెళ్లొచ్చు. టాక్సీలు, కేరళ ఆర్టీసీ బస్సులు (KSRTC), ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి.
"సర్" వస్తున్నారు! మీ ఓటు జాగ్రత్త" - ఓటరు జాబితాలో ఉంచాలన్నా, తీసేయాలన్నా ఇపుడే!
"మీ సమీపంలో పిడుగు పడే అవకాశం" - పిడుగుపాటును సూచించే రంగులివే!

