తియ్య తియ్యగా నోరూరించే "కొబ్బరి గులాబీలు" - గరిటెకు పిండి అంటుకోకుండా ఈజీగా వస్తాయి!
ఇంటిల్లిపాదీ ఇష్టంగా తినే "కొబ్బరి రోజ్ కుకీస్" - సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోండిలా!

Published : January 9, 2026 at 10:41 AM IST
Kobbari Gulabi Puvvulu Recipe : మరికొద్ది రోజుల్లో సరదాల సంక్రాంతి వచ్చేస్తోంది. ఈ క్రమంలోనే పండక్కి ఐదారు రోజుల ముందు నుంచే తెలుగు లోగిళ్లలో పిండి వంటల హడావుడి మొదలవుతుంది. పండక్కి పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి.. వారికోసం ఈజీగా చేసి పెట్టే ఒక స్వీట్ రెసిపీని తీసుకొచ్చాం. అదే, తియ్య తియ్యని "కొబ్బరి గులాబీలు". ఇవి నార్మల్‌గా చేసుకునే వాటితో పోల్చితే చాలా చాలా రుచికరంగా ఉంటాయి. కరకరలాడుతూ నోరూరించే వీటిని ఇంటిల్లిపాదీ ఒకటికి రెండు భలే ఇష్టంగా తింటారు. అంతేకాదు, ఈ పద్ధతిలో చేశారంటే గులాబీ అచ్చుకు పిండి అంటుకోకుండా చక్కగా వస్తాయి. మరి, లేట్ చేయకుండా ఈ నోరూరించే కొబ్బరి రోజ్ కుకీస్‌ను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- బియ్యప్పిండి - ఒకటిన్నర కప్పులు
- కార్న్‌ఫ్లోర్ - అర కప్పు
- చక్కెర - ఒక కప్పు
- కొబ్బరిపాలు - ఒక కప్పు
- కండెన్స్డ్ మిల్క్ - ఒక టేబుల్‌స్పూన్
- యాలకులపొడి - ఒక చెంచా
- ఉప్పు - చిటికెడు
- వెనిల్లా ఎసెన్స్ - పావు చెంచా
- నల్ల నువ్వులు - అర చెంచా
- నూనె - వేయించడానికి తగినంత
శనగపిండి లేకుండానే కరకరలాడే "జంతికలు" - నూనె తక్కువ, రుచి ఎక్కువ!

తయారీ విధానం :
- ఈ సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ కోసం ముందుగా ఒక గిన్నెలో కొబ్బరి పాలు తీసుకుని అందులో చక్కెర వేసి పూర్తిగా కరగనివ్వాలి.
- అది కరిగేలోపు ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బియ్యప్పిండి, కార్న్‌ఫ్లోర్, కండెన్స్డ్ మిల్క్, యాలకులపొడి, ఉప్పు, నల్ల నువ్వులు, వెనిల్లా ఎసెన్స్ వేసుకుని ఒకసారి పదార్థాలన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
- తర్వాత అందులో చక్కెర కరిగించుకున్న కొబ్బరిపాలను యాడ్ చేసుకుని మరోసారి బియ్యప్పిండి మిశ్రమాన్ని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి.
- ఇక్కడ పిండి మిశ్రమం కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా, పల్చగా కాకుండా దోశపిండిలా జారుగా ఉండేలా చూసుకోవాలి.

- అనంతరం స్టవ్ మీద పెట్టి వేయించేందుకు సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.
- ఆయిల్ వేడయ్యాక అందులో గులాబీ పూలు చేసుకునే గరిటెను(గులాబీ అచ్చు) రెండు మూడు నిమిషాలు ఉంచి బాగా కాలనివ్వాలి.
- ఎందుకంటే గులాబీ అచ్చు బాగా వేడి అయితేనే పిండి మిశ్రమం అనేది దానికి చక్కగా పట్టుకుంటుందని గుర్తుంచుకోవాలి.
- గులాబీ అచ్చు వేడయ్యాక స్టవ్‌ను లో ఫ్లేమ్‌లో ఉంచి దాన్ని ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యప్పిండి-కొబ్బరిపాల మిశ్రమంలో ముంచి ఆ తర్వాత కాగుతున్న నూనెలో పెట్టాలి.
- ఆపై స్లోగా గులాబీ పూల గరిటెను చేతితో నెమ్మదిగా కదుపుతుంటే అచ్చు నుంచి గులాబీ పువ్వు సెపరేట్ అవుతుంది.

- ఒకవేళ అది సెపరేట్ అవ్వకపోతే చిన్న ఫోర్క్ చెంచా లేదా చాకుతో చివర్లు విడదీస్తే ఈజీగా ఊడి నూనెలోకి వచ్చేస్తుంది.
- అనంతరం స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి గులాబీ పువ్వు రెండు వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు గరిటెతో టర్న్ చేస్తూ వేయించాలి. అది మంచిగా వేగాక ప్లేట్లోకి తీసుకోవాలి.
- ఇప్పుడు మరొకటి చేయడానికి గులాబీ అచ్చును మళ్లీ నూనెలో రెండు మూడు నిమిషాలు బాగా వేడి చేయండి.

- అది వేడయ్యాక దాన్ని కలిపిన పిండిలో మూడొంతులు డిప్ చేసి కాగుతున్న నూనెలో ఉంచి పిండి గుత్తి నుంచి ఊడిపోయాక లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించి తీసుకోవాలి. ఇదే ప్రాసెస్‌లో మిగిలిన పిండి మొత్తాన్ని తయారు చేసుకోవాలి.
- ఇక వీటిని చల్లారిన తర్వాత ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలు.
- అంతే, తియ్య తియ్యగా నోరూరించే "కొబ్బరి గులాబీలు" మీ ముందు ఉంటాయి!
- మరి, నచ్చితే మీరూ పండక్కి ఓసారి ఈ నయా గులాబీలను ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ ఫుల్ ఖుష్ అవుతారు.

చిట్కాలు :
- ఈ స్వీట్ రోజ్ కుకీస్ తయారీకి వాడే గరిటె(గులాబీ గుత్తి) ఆన్లైన్, బయట స్టీల్ షాపుల్లో దొరుకుతుంది. అలాగే, ఇది తీసుకునేటప్పుడు సరైన షేప్‌లో ఉండే దాన్ని తీసుకుంటే గులాబీ పువ్వులు మంచి షేప్‌లో వస్తాయి.
- ఈ రెసిపీలో మొక్కజొన్నపిండి వేయడం ద్వారా గులాబీలు క్రిస్పీగా రావడమే కాకుండా గులాబీ అచ్చు నుంచి పువ్వు ఈజీగా ఊడి వస్తుంది.
- గులాబీ పువ్వులు చేసుకునే ప్రతిసారీ గులాబీ అచ్చును వేడి చేసుకుని, పిండిని కలిపి మూడొంతులు డిప్ చేసి కాగుతున్న నూనెలో వేసుకోవాలి.
రాగిపిండితో కరకరలాడే "చెక్కలు" - పండక్కి పావుగంటలోనే తయార్!
నోరూరించే "బెల్లం గవ్వలు, బూందీ లడ్డూ" - పండక్కి ఇవి చేస్తే ఇంటిల్లిపాదీ ఫుల్ ఖుష్!

