టీ టైమ్ స్నాక్‌గా కేరళ స్టైల్ "ఉల్లి వడలు" - 10 నిమిషాల్లో చేసుకోవచ్చు - టేస్ట్ అదుర్స్!
- ఇంటిల్లిపాదీ మెచ్చే సూపర్ స్నాక్ రెసిపీ - పిల్లల నుంచి పెద్దల దాకా ఎంతో ఇష్టంగా లాగిస్తారు!

Published : February 26, 2026 at 12:53 PM IST
Kerala Style Ulli Vada: స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకైనా, ఆఫీసులకు వెళ్లొచ్చినా పెద్దలకైనా ఈవెనింగ్ టైమ్‌లో స్నాక్స్ కచ్చితంగా ఉండాల్సిందే. ఈ క్రమంలోనే కొద్దిమంది ఏవేవో వెరైటీలు చేస్తే.. మరికొద్దిమంది మాత్రం వాటిని తయారు చేసే ఓపిక లేక బయట నుంచి బజ్జీలు, పకోడీలు వంటివి కొని తింటుంటారు. అయితే ఇప్పుడా ఆ అవసరం లేకుండా చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే స్నాక్ రెసిపీ ఒకటి ఉంది. అదే ఉల్లి వడలు. తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో తక్కువ సమయంలో ప్రిపేర్ చేసుకునే వీటిని పిల్లలు పెద్దలు ఇష్టంగా లాగిస్తారు. మరి లేట్ చేయకుండా కేరళ స్టైల్ ఉల్లి వడలు ఎలా చేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:
- ఉల్లిపాయలు - 4
- పచ్చిమిర్చి - 4
- అల్లం ముక్క - చిన్నది
- కరివేపాకు - 3 రెమ్మలు
- ఉప్పు - రుచికి సరిపడా
- మైదా పిండి - 1 కప్పు
- కారం - 1 టేబుల్‌స్పూన్
- సోంపు - 1 టేబుల్‌స్పూన్

తయారీ విధానం:
- ముందుగా ఉల్లిపాయల చివర్లు కట్ చేసి పొట్టు తీసేసి శుభ్రంగా కడగాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నీళ్లు లేకుండా చేసి సన్నగా, పొడుగ్గా కట్ చేసుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
- పచ్చిమిర్చి, కరివేపాకును కూడా సన్నగా తరగాలి. అల్లం ముక్కపై పొట్టు తీసేసి సన్నగా తురుముకోవాలి.
- ఉల్లిపాయలు తీసుకున్న బౌల్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ అంటే ఆనియన్స్‌లో నుంచి నీరు ఊరేలా మిక్స్ చేసుకోవాలి.
- ఇలా ఆనియన్స్‌ను కలుపుకున్నాక మూత పెట్టి కొద్దిసేపు పక్కన ఉంచాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్‌ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.
- 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఉల్లిపాయల్లో నీరు ఊరుతుంది. అప్పుడు అందులోకి మైదా పిండిని కొద్దికొద్దిగా వేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి.
- ఉల్లిపాయ మిశ్రమంలోకి మైదా పిండి సరిపోయింది అనుకున్న తర్వాత అల్లం తరుగు, పచ్చిమిర్చి, సోంపు, కరివేపాకు, కారం వేసి మరోసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.

- ఇప్పుడు కలుపుకున్న పిండిలో నుంచి కొద్దిగా తీసుకుని రౌండ్‌గా చేసుకుని వడల షేప్‌లో వత్తుకుని కాగుతున్న నూనెలో వేసుకోవాలి.
- ఈ విధంగా పిండిని కొద్దిగా తీసుకుని వడలుగా వత్తుకుని కడాయికి సరిపడా వేసుకోవాలి.
- అనంతరం మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వడలను రెండు వైపులా నిధానంగా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
- వడలు పర్ఫెక్ట్గా కాలినాక తీసి ప్లేట్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా చేసుకుని ఆయిల్లో వేసి కాల్చుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కేరళ స్టైల్ ఉల్లి వడలు రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

చిలగడదుంపలతో "ఫ్రూట్ కస్టర్డ్" - కస్టర్డ్ పౌడర్ అవసరం లేదు - చాలా టేస్టీ!
బండి మీద అమ్మే రుచితో కరకరలాడే "పకోడీ" - పిండి కలపడంలోనే అసలు సీక్రెట్!

