కమ్మని "కీరదోసకాయ పచ్చడి" - ఇలా చేస్తే నోటికి పుల్లగా, కారంగా!
కీరదోసకాయతో సింపుల్‌గా చేసుకునే చట్నీ - కూరలు పక్కన పెట్టి అన్నం మొత్తం పచ్చడితోనే తినేస్తారు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 1, 2026 at 1:53 PM IST
Keera Dosakaya Pachadi : కీరదోసకాయను చాలా మంది పచ్చిగా లేదా సలాడ్ రూపంలో ఎక్కువగా తింటారు. అయితే ఎప్పుడూ ఓకేలా తిన్నా ఏం బాగుంటుంది? అందుకే ఇవాళ మీకోసం ఓ పచ్చడి రెసిపీని పరిచయం చేస్తున్నాం. అదే కీరదోసకాయ పచ్చడి. ఈ పద్ధతిలో చేశారంటే నోటికి పుల్లపుల్లగా, కారంకారంగా ఉంటూ ఎంతో రుచినిస్తుంది. మరి ఈ చట్నీ ఎలా చేయాలో ఇప్పుడు ఓ లుక్కేయండి.
రంజాన్ స్పెషల్ "చికెన్ జహాపనా" - ఎన్నడూ తినని టేస్ట్‌ని ఎంజాయ్ చేస్తారు!

కావాల్సిన పదార్థాలు :
- కీరదోసకాయలు - 6
- నువ్వులు - 4 టేబుల్ స్పూన్లు
- ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
- టమోటాలు - 4
- ఎండుమిర్చి - 28
- జీలకర్ర - 3 టీ స్పూన్లు
- చింతపండు - 30 గ్రాములు
- ఉల్లిపాయలు - 2
- నూనె - 8 టేబుల్ స్పూన్లు
- ఆవాలు - 1 టీ స్పూన్
- మినపప్పు - 1 టీ స్పూన్
- శనగపప్పు - 1 టీ స్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 10
- కరివేపాకు - కొంచెం
- ఇంగువ - 2 చిటికెడ్లు
- ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా ఆరు కీరదోసకాయలను శుభ్రంగా కడిగి పొట్టు తీసి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే రెండు ఉల్లిపాయలు, నాలుగు టమోటాలను తరిగి ఉంచాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయాలి. నూనె వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు, నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వులు, రెండు టీ స్పూన్ల జీలకర్ర, 20 ఎండుమిర్చి వేసి వేయించాలి. ఈ మిశ్రమం వేగాక ఓ ప్లేట్లోకి తీసుకోవాలి.

- ఇదే పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న కీరదోసకాయ, టమోటా ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఫ్రై చేయాలి.
- ఈ మిశ్రమం మగ్గిన తర్వాత 30 గ్రాముల చింతపండు, కొద్దిగా నీళ్లు యాడ్ చేసి కలుపుతూ వేయించాలి. ఇవి చక్కగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

- అనంతరం మిక్సీజార్‌లో వేయించిన జీలకర్రఎండుమిర్చి మిశ్రమం, పది వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. ఇందులోనే ఉడికించిన కీరదోసకాయటమోటా ముక్కలు యాడ్ చేసి గ్రైండ్ చేయాలి. ఆపైన తరిగి ఉంచిన ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్సీ పట్టాలి.
- ఆ తర్వాత తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. నూనె వేడయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ శనగపప్పు, ఒక టీ స్పూన్ మినపప్పు వేసి వేయించాలి.
- ఇందులోనే పది వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, ఎనిమిది ఎండుమిర్చి, రెండు చిటికెడ్ల ఇంగువ యాడ్ చేసి వేగనివ్వాలి. ఆ తర్వాత తాలింపును గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో వేసి కలపాలి.

- ఇక అంతే కమ్మని కీరదోసకాయ పచ్చడి తయారైనట్లే!
- ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి పుల్లపుల్లగా, కారంకారంగా ఉంటూ నోటికి కొత్త రుచినిస్తుంది.
రాగిపిండితో నోరూరించే "కట్లెట్స్" - పిల్లలకు ఇలా చేసి సర్ప్రైజ్ ఇవ్వండి!
ఆంధ్రా స్టైల్ "పాలకూర పప్పు" - వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే అమృతమే!

