సంక్రాంతి స్పెషల్ : జొన్నపిండి "రిబ్బన్ పకోడీ" - తక్కువ నూనెతోనే కరకరలాడిపోద్ది!
- శనగపిండి లేకుండానే అద్దిరిపోయే పకోడీ రెసిపీ - రుచితో పాటు ఆరోగ్యం కూడా!

Published : January 6, 2026 at 4:41 PM IST
Jonnapindi Ribbon Pakoda Recipe : సంక్రాంతి వస్తోందంటే చాలు వారం రోజుల ముందు నుంచే పిండి వంటల హడావుడి స్టార్ట్ అవుతుంది. దాంతో అమ్మలందరూ మురుకులు, చెక్కలు, కారప్పూస, అరిసెలు అంటూ రకరకాల రెసిపీలు ప్రిపేర్ చేయడానికి రెడీ అయిపోతుంటారు. ఇదే క్రమంలో కొంతమంది 'రిబ్బన్ పకోడీ' కూడా తయారు చేస్తుంటారు. దీన్నే 'ఆకు పకోడీ, చెక్క పకోడీ' అని అంటుంటారు.
నార్మల్‌గా దీన్ని శనగపిండి, బియ్యప్పిండితో ఎక్కువగా చేసుకుంటుంటారు. అలాకాకుండా ఈ పండక్కి కాస్త వెరైటీగా జొన్నపిండితో "రిబ్బన్ పకోడీ" ట్రై చేయండి. స్వీట్ షాప్‌లో అమ్మేదానిలా కరకరలాడుతూ భలే రుచికరంగా ఉంటుంది. అలాగే, నూనె కూడా తక్కువగానే పడుతుంది! పైగా ఈ రెసిపీని తక్కువ పదార్థాలతోనే సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చు. మరి, లేట్ చేయకుండా ఈ టేస్టీ అండ్ హెల్దీ జొన్నపిండి రిబ్బన్ పకోడీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- జొన్నపిండి - ఒక కప్పు
- బియ్యప్పిండి - ఒక కప్పు
- ఉప్పు - రుచికి తగినంత
- కారం - టేస్ట్‌కి సరిపడా
- నువ్వులు - ఒక చెంచా
- ఇంగువ - చిటికెడు
- వెన్న - రెండు చెంచాలు
- నూనె - వేయించడానికి సరిపడా
- కరివేపాకు - రెండు రెబ్బలు
నోరూరించే "పెసరపప్పు చెక్కలు" - సంక్రాంతి పండక్కి కరకరలాడించండి!

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక చిన్న గిన్నెలో రెండు చెంచాల పరిమాణంలో వెన్న కరిగించుకుని పక్కనుంచాలి. కరివేపాకును సన్నగా తరిగి పెట్టుకోవాలి
- అలాగే, జొన్నపిండి, బియ్యప్పిండిని వేరు వేరుగా జల్లించుకుని పక్కన ఉంచాలి. వీటితోపాటు పిండి కలుపుకోవడానికి అవసరం మేరకు తగినన్ని గోరువెచ్చని నీటిని సిద్ధం చేసుకుని పక్కనుంచాలి.
- ఇప్పుడు పిండిని సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో జల్లించుకున్న జొన్నపిండి, బియ్యప్పిండి, మీ రుచిని బట్టి తగినంత ఉప్పు, కారం, తెల్ల నువ్వులు, ఇంగువ వేసుకోవాలి.

- అలాగే, కరిగించి పెట్టుకున్న వెన్న, సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకును జత చేసి ఒకసారి గరిటెతో అంతా కలిసేలా కలపాలి.
- ఆ తర్వాత అందులో అవసరం మేరకు తగినన్ని గోరువెచ్చని నీళ్లను కొద్దికొద్దిగా పోసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా కొద్దిగా మెత్తగా కలుపుకోవాలి.
- ఈ రెసిపీలో 'గోరువెచ్చని నీళ్లతో' పిండిని కలిపే ఈ సీక్రెట్ టిప్ రిబ్బన్ పకోడీ క్రిస్పీగా రావడానికి చాలా బాగా యూజ్ అవుతుందని గుర్తుంచుకోవాలి.
- అనంతరం స్టవ్ మీద కడాయి పెట్టి వేయించేందుకు సరిపడా నూనె పోసి హీట్ చేసుకోవాలి.
పల్లీలను ఇలా వేయించి "చట్నీ" చేయండి - టేస్ట్ అదుర్స్, వారం రోజులు నిల్వ!

- ఆయిల్ కాగే లోపు జంతికల గొట్టం తీసుకుని అందులో రిబ్బన్ పకోడీలు వేసే ప్లేట్‌ను అమర్చుకోవాలి. ఆపై మురుకుల గొట్టం లోపల కొద్దిగా నూనె రాయాలి.
- ఆ తర్వాత అందులో ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని సరిపడా నింపుకోవాలి.
- కడాయిలో ఆయిల్ బాగా వేడయ్యాక మంట తగ్గించి మురుకుల గొట్టంతో కాగుతున్న నూనెలో నేరుగా రిబ్బన్ పకోడీల్లా వత్తుకోవాలి.
- జంతికల గొట్టంలోని పిండి ముద్దను మొత్తం వత్తుకున్నాక స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి వెంటనే టర్న్ చేయకుండా రెండు మూడు నిమిషాలు కాలనిచ్చి ఆపై చిల్లుల గరిటెతో మరో వైపునకు తిప్పుతూ కాల్చుకోవాలి.

- నూనెలో నురగలు తగ్గి రెండు వైపులా ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి.
- ఇలానే పిండి మొత్తాన్ని రెడీ చేసుకుని చల్లారాక ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలు.
- అంతే, జొన్నపిండితో కరకరలాడుతూ మంచి రుచికరంగా ఉండే "రిబ్బన్ పకోడీ" రెడీ అవుతుంది!
- మరి, మీకూ నచ్చితే ఈ సంక్రాంతికి ఎప్పటిలా శనగపిండితో కాకుండా వెరైటీగా ఇలా జొన్నపిండితో రిబ్బన్ పకోడీ చేయండి.
- సూపర్ టేస్టీగా ఉండి ఇంటిల్లిపాదీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పైగా రెండు వారాలపాటు నిల్వ కూడా చేసుకోవచ్చు.

చిట్కాలు :
- ఇక్కడ జొన్నపిండి తీసుకున్న కప్పునే బియ్యప్పిండిని కొలవడానికి యూజ్ చేయాలి.
- ఈ రెసిపీ కోసం ముఖ్యంగా పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కాకుండా కొద్దిగా మెత్తగా ఉండేలా చూసుకోవాలి
- నూనె కాగకపోయినా, పిండి జారైనా రిబ్బన్ పకోడీ ఆయిల్‌ను ఎక్కువగా పీల్చుతుందని, మెత్తగా వస్తాయని గుర్తుంచుకోవాలి.
కరకరలాడే "సొరకాయ గారెలు" - నూనె పీల్చవు! - భలే రుచిగా ఉంటాయి!

