విద్యార్థులకు "ఇస్రో" బంపర్ ఆఫర్ - ప్రత్యేక శిక్షణతో పాటు ప్రయాణం, భోజనం, వసతి ఉచితం!
'ఇస్రో యువికా 26' దరఖాస్తులకు ఆహ్వానం - తొమ్మిదో తరగతి విద్యార్థులకు అవకాశం

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 4, 2026 at 12:52 PM IST
Yuvika 2026 Online Applications : అంతరిక్షం అంటే ఏమిటి? అక్కడికి శాటిలైట్లను ఎలా పంపిస్తారు? ఆకాశంలోకి దూసుకెళ్లే రాకెట్లను భూమి పైనుంచి ఎలా నియంత్రిస్తారు? ఇలాంటి అనేక సందేహాలు విద్యార్థుల్లో ఆసక్తి రేకెత్తిస్తుంటాయి. జీఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ అంటే ఏమిటి? వాటి మధ్య తేడాలు ఎలా ఉంటాయి? అనే విషయాలు తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యార్థి దశలోనే అంతరిక్ష పరిజ్ఞానంపై అవగాహన కల్పించడం ద్వారా భావి శాస్త్రవేత్తలను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇస్రో యంగ్ సైంటిస్ట్ యువ విజ్ఞానిక (యువికా- 2026)అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తద్వారా ఎంపికైన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించనుంది.
"హర్మూజ్ జలసంధి" మూసేస్తే ఏం జరుగుతుంది? - ఇరాన్‌కు అది సాధ్యమేనా?
"యువిక్ 2026" యంగ్ సైంటిస్ట్ ప్రత్యేక శిక్షణకు ఎలా హాజరు కావాలి? దరఖాస్తు విధానం, ఇస్రో ప్రాధామ్యాలు ఏమిటో తెలుసుకుందాం.
శిక్షణ కేంద్రాలివే :
- తెలంగాణ - హైదరాబాద్
- ఆంధ్రప్రేదేశ్ - సూళ్లూరుపేట
- కేరళ - తిరువనంతపురం
- గుజరాత్ - అహ్మదాబాద్
- మేఘాలయా - షిల్లాంగ్
- ఉత్తరాఖండ్ - దెహ్రాదూన్
- కర్ణాటక - బెంగళూరు
దరఖాస్తు చేయడం ఇలా
- ఇస్రో ప్రత్యేక శిక్షణకు 2025-26 విద్యా సంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఎవరైనా సరే దరఖాస్తు చేయవచ్చు కానీ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
- దరఖాస్తు కోసం ఇస్రో అధికారిక వెబ్సైట్ https://jigyasa.iirs.gov.in/yuvika క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలి. ముందుగా ఆన్లైన్ క్విజ్‌లో పాల్గొంటే వచ్చిన స్కోరు ఆధారంగా 10 శాతం వెయిటేజీ ఉంటుంది. ఆ తర్వాత 8వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా 50 శాతం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ కలిగి ఉంటే మరో 5 శాతం, ఇప్పటికే వైజ్ఞానిక ప్రదర్శనల్లో పాల్గొన్న వారికి 10 శాతం, గ్రామీణ విద్యార్థులకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది. దరఖాస్తులో వివరాలు, వెయిటేజీ ఆధారంగా ఏప్రిల్ 13న తొలి జాబితా, 20న రెండో జాబితా విడుదల చేస్తారు.
- ఆసక్తి కలిగిన విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 31 కాగా, ఎంపికైన విద్యార్థులు తమకు కేటాయించిన శిక్షణా కేంద్రాల్లో మే 11 నుంచి 22 వరకు నిర్వహించే 'యువికా'లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ మేరకు భోజన, వసతి, రవాణా ఖర్చులను ఇస్రో భరిస్తుంది.
- అంతరిక్ష విజ్ఞానం, రాకెట్ల నిర్మాణం, ఉపగ్రహాల నమూనా, శాస్త్రవేత్తలతో ముఖాముఖి, రిమోట్ సెన్సింగ్ డీప్ స్పెస్‌ప్రోబ్స్, రోవర్లు, ల్యాండర్లు, గ్రహాల మినరాలజీ, మ్యాపింగ్ లాంటి అంశాలపై ప్రాథమిక అవగాహన కల్పించనుంది.
- 9వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం ఉండగా, ఎంపికైన విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లో ఒకరికి ప్రవేశం కల్పించనున్నారు.
ఛలో "చార్ధామ్" - ఏ ఆలయం ఎప్పుడు తెరుచుకుంటుందో తెలుసా? తేదీలు వచ్చేశాయి!
యాదాద్రి, చిలుకూరు బాలాజీ, రామోజీ ఫిలింసిటీ సందర్శన - IRCTC టూర్ ప్యాకేజీ!

