ETV Bharat / offbeat

"హర్మూజ్ జలసంధి" మూసేస్తే ఏం జరుగుతుంది? - ఇరాన్​కు అది సాధ్యమేనా?

ప్రపంచ చమురు వాణిజ్యంలో హర్మూజ్ కీ రోల్ - ఒమన్, యూఏఈకీ అధికారం!

STRAIT OF HORMUZ
STRAIT OF HORMUZ (Getty images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 4, 2026 at 11:32 AM IST

4 Min Read
Choose ETV Bharat

Hormuz Strait : అమెరికా - ఇరాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జలసంధి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ జలమార్గం మూసుకుపోతే ఆసియా దేశాల్లో ఇంధన ధరలు పెరిగిపోయి వస్తు ధరలపై అంతిమ ప్రభావం పడనుంది. అయితే, ఈ జలమార్గం పూర్తిగా మూసేసినట్లు చరిత్రలో లేదు. ఇరానా బెదిరిస్తున్నట్లుగా మూసివేతకు అవకాశాల్లేవని తెలుస్తోంది. అసలు హర్మూజ్ జలసంధి అంటే ఏమిటి? ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరుగుతాయో తెలుసుకుందాం.

ఛలో "చార్​ధామ్" - ఏ ఆలయం ఎప్పుడు తెరుచుకుంటుందో తెలుసా? తేదీలు వచ్చేశాయి!

STRAIT OF HORMUZ
STRAIT OF HORMUZ (Getty images)

ఎక్కడుందంటే!

"హర్మూజ్‌ జల సంధి" ఇరాన్‌ - ఒమన్ మధ్య పర్షియన్‌ గల్ఫ్‌ను గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్, అరేబియన్‌ సముద్రాలను కలిపే (జలసంధి) జలమార్గం. దీని పొడవు 161 కిలోమీటర్లు కాగా, 33 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. మార్గంమధ్యలో షిప్పింగ్‌ లైన్లు రెండువైపులా 3కిలోమీటర్లు మాత్రమే ఉంటాయి. నిత్యం కొన్ని కోట్ల లీటర్ల చమురు రవాణా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ చమురు వాణిజ్యంలో హర్మూజ్ కీలక భూమిక పోషిస్తోంది.

మూసేయడం సాధ్యమేనా?

యుద్ధం నేపథ్యంలో హర్మూజ్‌ జల సంధిని మూసేస్తామని ఇరాన్‌ ప్రకటించడంతో పాటు ఇప్పటికే రెండు నౌకలపై ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌ (ఐఆర్‌జీసీ) దాడులకు పాల్పడిన నేపథ్యంలో ఆసియా దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ మార్గంలో నిత్యం వందలాది చమురు రవాణా నౌకలు ప్రయాణిస్తుండడంతో పాటు 700కు పైగా నౌకలు ఇక్కడికి సమీపంలో ఉన్నాయి. గల్ఫ్‌ దేశాలు ఉత్పత్తి చేసే చమురు భారత్, చైనా దేశాలకు ఈ ప్రాంతం మీదుగానే సరఫరా అవుతుంది. ప్రపంచం వినియోగిస్తున్న దాంట్లో దాదాపు 20 శాతం చమురు హర్మూజ్‌ మీదుగానే రవాణా అవుతుంది. ఇక 25శాతం ఎల్​పీజీ, ఎల్​ఎన్​జీ వంటి ద్రవీకృత సహజ వాయువు ఇక్కడి నుంచి సరఫరా అవుతుంది.

ఎందుకంత ప్రాధాన్యం?

ప్రపంచ చమురు వినియోగంలో 20శాతం (20 మిలియన్‌ బ్యారెళ్లు) హర్మూజ్‌ జలమార్గం ద్వారా సరఫరా అవుతుంది.

2022 నుంచి 2025 వరకు నిత్యం సగటున 17.8 నుంచి 20.8 మిలియన్‌ బ్యారెళ్ల చమురు రవాణా జరిగినట్లు గణాంకాలున్నాయి.

ఆసియా దేశాలు చమురు దిగుమతి చేసుకునే సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్, కువైట్, ఖతార్, యూఏఈల నుంచి ఈ మార్గమే కీలకం. సముద్రం నుంచి వెలికితీసే మొత్తం చమురులో 25శాతం ఈ మార్గం మీదుగానే రవాణా చేస్తున్న నేపథ్యంలో హర్మూజ్‌ మూసివేత ప్రభావం తీవ్రంగానే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచానికి నాలుగో వంతు గ్యాస్ (LNG) సరఫరా చేసే ఖతార్‌ నుంచి ఇదే ప్రధాన మార్గం కావడం ఆందోళన రేకెత్తిస్తోంది.

STRAIT OF HORMUZ
STRAIT OF HORMUZ (Getty images)

ఇరాన్‌ నియంత్రించగలదా?

నిజానికి హర్మూజ్ జల సంధిని ఇరాన్‌ పూర్తి స్థాయిలో నియంత్రించలేదని తెలుస్తోంది. జలసంధి ఉత్తర ప్రాంతంలో (ఇరాన్​కు దక్షిణాన) ప్రయాణించే కొన్ని చోట్ల మాత్రమే నౌకలను నియంత్రించగలదు. జలమార్గం దక్షిణ ప్రాంతంలో ఒమన్, యూఏఈలకు అధికారం ఉండడమే అందుకు కారణం. ఈ కారణంగానే హర్మూజ్‌ నుంచి చమురు రవాణా జరిగితే బాంబు దాడులు చేస్తామని భయపెడుతోందే తప్ప అది అసాధ్యమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే అక్కడ మోహరించిన యూఎస్‌ దళాలు, పశ్చిమ దేశాల నౌకాదళాలు ఇరాన్‌ దాడులు చేస్తే వెంటనే స్పందించే అవకాశం ఉందని, అందుకే హర్మూజ్​ను మూసేస్తామని ఇరాన్‌ హెచ్చరిస్తున్నా అమలు చేసే అవకాశాలు తక్కువని చెప్తున్నారు.

1980 నుంచి 1988 మధ్య జరిగిన ఇరాక్, ఇరాన్‌ వార్ సమయంలోనూ రవాణా నౌకలపైనా దాడులు జరిగాయే తప్ప పూర్తిగా మూసివేయలేదు.

ఒమన్‌ మార్గం సులభం

హర్మూజ్‌ జల సంధిలో సింహ భాగం ఒమన్‌ ఆధీనంలోనే ఉంది. అందుకే దానిని పూర్తిగా మూసివేయడం అసాధ్యమని, ఒమన్, యూఏఈ మీదుగా నౌకాయానం కొనసాగుతుంది.

పైపులైన్ల ద్వారా కొంతే

సౌదీ అరేబియా, యూఏఈ హర్మూజ్‌ జలసంధి మార్గంపై ఆధారపడకుండా పైపులైన్ల ద్వారా చమురు సరఫరా చేస్తున్నాయి. కానీ, అవి రోజుకు 4 మిలియన్ల నుంచి 5 మిలియన్ల బ్యారెళ్లనే సరఫరా చేయగలవు.

ఎల్పీజీ ఇబ్బందులు తప్పవు

ఇండియా 80 నుంచి 85శాతం సహజ వాయువును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇందులో అధిక భాగం గల్ఫ్‌ నుంచే కాగా, ముడి చమురులాగా ఎల్పీజీ వ్యూహాత్మక నిల్వలు లేవు. ఎల్పీజీలాగే ఎల్‌ఎన్‌జీ నిల్వలూ ఉండవు. ఈ రెండింటి సరఫరా, డిమాండు మధ్య తేడా చాలా తక్కువగా ఉంటుంది. హర్మూజ్‌లో రవాణా పూర్తిస్థాయిలో నిలిచిపోయే అవకాశాల్లేనందున ఆందోళన అక్కర్లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

STRAIT OF HORMUZ
STRAIT OF HORMUZ (Getty images)

ధరలపై ప్రభావమెంత?

హర్మూజ్‌ నుంచి రవాణా ఆగిపోతే ఇంధనాల ధరలు ఆకాశాన్నంటే అవకాశాలున్నాయి. రవాణా వ్యయం పెరగడంతో పాటు తీవ్ర జాప్యం జరుగుతుంది.

చమురు రవాణాకు భారీగా అడ్డంకులు ఏర్పడితే ముడి చమురు బ్యారెల్‌ ధర 100 డాలర్లను దాటే అవకాశాలున్నాయి. డిమాండ్​కు తగ్గట్లుగా సరఫరా తగ్గిపోయి కొరత ఏర్పడుతుంది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరిగే ప్రమాదం ఉంది.

హర్మూజ్​ జలమార్గం పూర్తి స్థాయిలో మూసుకుపోతే చమురు ధర 200 డాలర్లకూ చేరవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది.

ఆసియాపైనే అధిక భారం

హర్మూజ్‌ జలమార్గం నుంచి సరఫరా అవుతున్న ఆయిల్​లో 80శాతం ఆసియా దేశాలే కొనుగోలు చేస్తుండగా, చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా అతి పెద్ద వినియోగదారులుగా ఉన్నాయి.

యాదాద్రి, చిలుకూరు బాలాజీ, రామోజీ ఫిలింసిటీ సందర్శన - IRCTC టూర్ ప్యాకేజీ!

ట్రెయిన్ రిజర్వేషన్ టికెట్ వేరొకరికి బదిలీ చేసుకోవచ్చు - ఎలా సాధ్యమంటే!