"టీ" వివిధ రంగులు, రుచుల్లో ఎందుకుంటుందో తెలుసా? - దాని వెనుక ఉన్న రహస్యాలివే!
రంగురంగుల "టీ" వెనుక దాగి ఉన్న రహస్యాలు - పరిశోధనల్లో అందుకు గల కారణాలు వెల్లడి!

Published : May 5, 2026 at 10:14 AM IST
Interesting Facts about Tea : మనలో మెజార్టీ జనాలకు మార్నింగ్ లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. ఇక టీ ప్రేమికులైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక కప్పు వేడి ఛాయ్ లేని రోజును వారు అస్సలు ఊహించుకోలేరు! ఇక కొందరికైతే టీ తాగకపోతే ఆ రోజు ఏమీ తోచదు. అయితే, అందరూ ఇష్టంగా తాగే ఛాయ్‌లో నార్మల్ టీ నుంచి బ్లాక్ టీ వరకు రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి. ఈ క్రమంలోనే చాలా మందికి ఒక్కో చోట ఒక్కో రుచి, నాణ్యత, ఫ్లేవర్, రంగుతో టీని ఎలా తయారు చేస్తారనే సందేహం వస్తుంటుంది. మీలో తలెత్తే ఆ సందేహాలకు దక్షిణ కొరియాకు చెందిన మెటాబోలోమిక్స్ నిపుణులు యంగ్-షిక్ హాంగ్ బృందం కొన్ని పరిశోధనలు చేసి కారణాలను గుర్తించింది. మరి, వివిధ రంగులు, ఫ్లేవర్లలో తయారయ్యే "టీ" వెనుక దాగి ఉన్న శాస్త్రీయ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన పానీయం 'ఛాయ్/టీ'. ఇది ఒక్కో చోట ఒక్కో రుచి, నాణ్యత, ఫ్లేవర్, రంగుతో దొరుకుతుంది. అయితే, మనందరం వహ్వా అన్నా.. వారెవ్వా అన్నా అంటూ తాగే ఆ టీ రుచి, నాణ్యత, ఫ్లేవర్ పెద్ద చరిత్రే దాగి ఉంది. దక్షిణ కొరియాకు చెందిన మెటాబోలోమిక్స్ నిపుణులు యంగ్-షిక్ హాంగ్ బృందం చేసిన పరిశోధనల్లో టీకు ఉన్న వివిధ రంగులు, రుచులు అనేవి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటాయని తేలింది.
దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు టీని వాతావరణం నుంచి ప్రాసెసింగ్ దాకా వివిధ కారకాలు ఎలా ప్రభావింత చేస్తాయో పూర్తిగా అర్థం చేసుకోవడానికి మెటాబోలోమిక్స్ వైపు దృష్టిసారించారు. ఆ రంగంలో నిపుణుడు యంగ్-షిక్ హాంగ్, అతని సహచరులు చైనా, జపాన్, దక్షిణ కొరియా నుంచి 281 వరకు గ్రీన్ టీ నమూనాలు సేకరించారు. అనంతరం వాటిల్లో ఉన్న మెటబొలైట్లను కొలిచారు. అప్పుడు ప్రతి దేశం నుంచి వచ్చిన టీల ప్రొఫైల్‌లు భిన్నంగా ఉన్నాయని కనుగొంది ఈ బృందం.
చైనీస్ టీ కంటే కొరియన్ టీలో కెఫిన్, చక్కెరలు అధికంగా ఉన్నాయని గుర్తించారు. కొరియన్ నమూనాల్లో టీ రుచికి ప్రధానమైన అమైనో ఆమ్లంగా భావించే థియోనైన్ తక్కువగా ఉంది. తూర్పు హిమాలయాల్లో సముద్ర మట్టానికి 7 వేల అడుగుల ఎత్తు వరకు పండించే సున్నితమైన డార్జిలింగ్ వంటి తేయాకుల్లో చేదు పెద్దగా లేకుండా పూల, పండ్ల సువాసనలు ఉంటాయని కనుగొన్నారు.
టీలో చేదుగా ఉండే కాటెచిన్లు యాంటీ ఆక్సిడెంట్లు అని మనందరికీ ఇప్పటికే తెలుసు. ఇకపోతే థియోనైన్ ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుందని చెబుతారు. థియోనైన్, కెఫీన్, కాటెచిన్ సమ్మళనాలు మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి దోహదపడతాయని దక్షిణ కొరియాకు చెందిన మెటాబోలోమిక్స్ నిపుణుడు యంగ్-షిక్ హాంగ్ అంటున్నారు.
టీ రంగులు, రుచుల వెనుక దాగి ఉన్న కారణాలివే!
ప్రపంచంలోని ప్రముఖ బ్రాండ్ల టీ పొడులు ఎక్కువగా "కమీలియా సెనెన్సిస్" అనే ఒక జాతి తేయాకు మొక్క నుంచి తయారవుతాయి. ఈ పొడులతో నలుపు, పసుపు, తెలుపు ఇలా పలు రంగుల్లో, ఫ్లేవర్లలో టీని తయారు చేయడానికి కొన్ని శాస్త్రీయ కారణాలున్నాయంటున్నారు పరిశోధకులు. వాటిల్లో కొన్నింటి గురించి మనం ఇప్పుడు చూద్దాం.
- ప్రతి తేయాకు మొక్కలోని అణు స్వరూపం అది పెరిగే నేల, ఆకులను ఎండబెట్టే తీరు, వేడిచేసే విధానంపై ఆధారపడి ఉంటుందంటున్నారు పరిశోధకులు. ముఖ్యంగా కమీలియా సెనెన్సిస్ ఆకుల్లో కూడా విభిన్న రకాల అణువులు ఉంటాయి. అవి పానీయం సువాసన, రుచి, స్వభావాన్ని నిర్ణయించడంలో కీలకంగా ఉంటాయిని చెబుతున్నారు.
- తేయాకు పంటను ఎండబెట్టడం, మొక్కల్ని నీడలో పెంచడం, కొత్త మొగ్గలు, పాత ఆకుల్ని కోయడం ఇలా వివిధ దశల్లో పంట నాణ్యతను, ప్రమాణాలను ఫాలో అవుతూ తేయాకును పెంచుతారు రైతులు. అలాగే, ప్రాసెసింగ్‌లో మరిన్ని పద్ధతుల్ని అవలంబిస్తారు. చుట్టడం, రుబ్బడం లేదా సూక్ష్మజీవులతో ఆకులను పులియబెట్టడం వరకు రకరకాల కారకాలు తేయాకు మరింత టేస్టీగా తయారయ్యేలా చేస్తాయని కనుగొన్నారు.
- టీ టేస్ట్‌ను ఎండ, నీడ కూడా ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు మాచా తేయాకును కోతకు ముందు కొన్ని వారాల పాటు నీడలో ఉంచిన ఆకుల నుంచి ఉత్పత్తి చేస్తారు. దీనివల్ల చేదు కేటెచిన్ల స్థాయి తక్కువగా ఉండి, క్లోరోఫిల్, థియానైన్ ఎక్కువగా ఉంటాయి. థియోనైన్, గ్లూటామిక్ ఆమ్లం వంటివి టీ రుచిపై ప్రభావాన్ని చూపుతాయంటున్నారు పరిశోధకులు.
- ఇకపోతే మనందరం బయట టీ షాపుల్లో తాగే గ్రీన్ టీ, ఘాటైన బ్లాక్ టీ లేదా ఇతర రకాలు కూడా తేయాకు నుంచే రెడీ అవుతాయి. ఇందులో మొదటి దశ వచ్చేసి టీ ఆకుల్ని ఎండబెట్టడం లేదా వాడిపోయేలా చేయడం. ఈ స్టేజ్‌లో క్లోరోఫిల్‌ను తగ్గించడం, కెఫీన్‌ను పెంచడం ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ఈ ప్రక్రియే సువాసన గల అణువులు ఉత్పత్తికీ దారి తీస్తుందని చెబుతున్నారు.
- తేయాకులోని అణువులు ఆక్సిజన్‌తో చర్య జరపకుండా ఆకుల్ని వేగంగా వేడి చేయడం ద్వారా గ్రీన్ టీని తయారు చేస్తారు. దీనికి విరుద్ధంగా ఆకులను చుట్టడం లేదా నలపడం ద్వారా బ్లాక్ టీ తయారవుతుందని దక్షిణ కొరియా పరిశోధకుల బృందం చేసిన పరిశోధల్లో వెల్లడైంది.
NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం.
కల్తీ రాగులతో డేంజర్లో ఆరోగ్యం - స్వచ్ఛమైనవి గుర్తించడానికి FSSAI టిప్స్!
వెల్లుల్లి రెబ్బల పొట్టు తీసేందుకు అవస్థలు పడుతున్నారా? - ఈ టిప్స్ పాటిస్తే చిటికెలో పూర్తి!

