జ్యూసీ జ్యూసీ "పాకం పూరీలు" - చూడగానే నోరూరిస్తాయి!
ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపించే పూరీలు - ఇలా చేస్తే 15 రోజుల పాటు నిల్వ!

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 29, 2026 at 10:16 AM IST
Pakam Puri Recipe in Telugu : జ్యూసీ, జ్యూసీగా ఉండే స్వీట్ పదార్థాలు నోరూరిస్తాయి. గులాబ్ జామూన్, సేమియా పాయసం ఎంతో రుచిగా ఉంటాయి. సరిగ్గా ఇలాగే పాకం పూరీలు తయారు చేసుకోవచ్చు. వీటిని చాలా ఇష్టంగా తింటారు! ఓ సారి ఈ విధంగా చేశారంటే జ్యూసీగా, టేస్టీగా వస్తాయి. చాలా తక్కువ పదార్థాలతో ఇన్‌స్టంట్‌గా చేసుకోవచ్చు. కొత్తగా చేసే వారు కూడా అప్పటికప్పుడు చాలా సింపుల్‌గా తయారు చేయొచ్చు. పైకి సాఫ్ట్‌గా, లోపల జ్యూసీగా ఉండే వీటిని ఇంట్లో చేసి పెట్టారంటే తిన్నవారు సూపర్ అనాల్సిందే. అంతేకాక ఇలా చేస్తే 15 రోజుల పాటు నిల్వ ఉంటాయి! ఇక లేట్ చేయకుండా ఈ స్వీట్ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు ఓ లుక్కేయండి.
కరకరలాడే "నువ్వుల చెగోడీలు" - పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు!
కావాల్సిన పదార్థాలు :
- గోధుమపిండి - అర కిలో (500 గ్రాములు)
- నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
- యాలకుల పొడి - 1 టీ స్పూన్
- ఉప్పు - కొంచెం
- పంచదార - ఒక కేజీ
- నూనె - వేయించడానికి సరిపడా
తయారీ విధానం :
- ముందుగా మిక్సింగ్ బౌల్లో అర కిలో గోధుమపిండి, కొంచెం ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలపాలి. ఇందులోనే కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని బాగా మిక్స్ చేయాలి. ఆపైన తడి క్లాత్ వేసి పిండిని 30 నిమిషాల పాటు పక్కనుంచాలి.
- ఇప్పుడు పాకం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయిలో కేజీ పంచదార, 300 ఎంఎల్ నీళ్లు పోసి కరిగించాలి. పంచదార కరిగి తీగ పాకం వచ్చాక ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలపాలి. అనంతరం స్టవ్ ఆఫ్ చేసి మూతపెట్టాలి.
- 30 నిమిషాల తర్వాత గోధుమపిండిని మరోసారి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి.
- ఇప్పుడు చపాతీ పీటపై కొద్దిగా పొడి పిండి చల్లి ఒక్కొ పిండి ఉండను పెట్టి చపాతీ కర్రతో గుండ్రంగా, పల్చగా పూరీ మాదిరిగా చేయాలి.
- అనంతరం కడాయికి సరిపడా ఆయిల్ పోయాలి. నూనె చక్కగా కాగాక రెడీ చేసుకున్న పూరీలను కడాయికి సరిపడా వేయాలి.
- ఆ తర్వాత పూరీలను రెండు వైపులా టర్న్ చేస్తూ కాల్చుకోవాలి. అనంతరం వీటిని పంచదార పాకంలో వేసి ఒక నిమిషం పాటు ఉంచాలి.
- ఒక నిమిషం తర్వాత పంచదార పాకంలోంచి పూరీలను బయటకు తీసి సర్వ్ చేసుకోవాలి.
- అంతే నోరూరించే పాకం పూరీలు మీ ముందుంటాయి!
- ఈ పూరీలను ఎయిర్‌టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 15 రోజుల పాటు నిల్వ ఉంటాయి!
- ఇలా ఇంట్లో చేసి పెడితే పిల్లలైతే ఒకటికి రెండు ఇష్టంగా తింటారు!
సొరకాయ పొట్టుతో "పచ్చడి" - ఎన్నడూ తినని సరికొత్త రుచిని ఆస్వాదిస్తారు!
ఉల్లి, వెల్లుల్లి లేకుండానే "దహీ కిచిడీ" - ఒక్కసారి తింటే టేస్ట్‌కు ఫిదా!

