పంజా విసిరిన "ప్రాజెక్ట్ చీతా" - అరుదైన మైలురాయి సాధించిన ఇండియా!
- వన్య మృగాల పెరుగుదలలో అతి పెద్ద విజయం - పులులు, సింహాలు, చీతాలు, చిరుతలు, మంచు చిరుతలున్న ఏకైక దేశంగా భారత్ రికార్డు

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 6, 2026 at 10:38 AM IST
|Updated : July 6, 2026 at 3:19 PM IST
Project Cheeta : పులులు, సింహాలు, చిరుతలు, మంచు చిరుతలకు తోడు చీతాలు సైతం పెరుగుతున్న ఏకైక దేశంగా ఇండియా అరుదైన ఘనత సాధించింది. వాటి ఉనికి మాత్రమే కాదు! గతంలో పోలిస్తే వాటి సంఖ్యలో పెరుగుదల సరికొత్త మార్పును సూచిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కొన్ని దేశాలు మాత్రమే అందుకోగల ఒక మైలురాయిని భారతదేశం సాధించిందని చెప్తున్నారు. నిరంతర పరిరక్షణ ప్రయత్నాల ద్వారా ఇది సాధ్యమైందని భావిస్తున్నారు.
తాజా అధికారిక అంచనాల ప్రకారం, భారతదేశంలో పులుల సంఖ్య 3,682, చిరుతల సంఖ్య 13,874, ఆసియా సింహాల సంఖ్య 891కి చేరినట్లు అంచనా, మంచు చిరుతల సంఖ్య 718గా ఉంది. దేశంలో అంతరించిపోయినట్లు ప్రకటించిన చీతాల సంఖ్య "ప్రాజెక్ట్ చీతా" ఫలితంగా మంచి ఫలితాలు సాధించింది. ప్రస్తుతం వాటి సంఖ్య 57గా తేల్చారు.
హిమాలయాల్లో దర్శనమిచ్చిన "కాస్పియన్ కోబ్రా" - ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము!

ఏడు దశాబ్దాల తర్వాత చీతాల పునరాగమనం
చీతాల పునరాగమనం భారీ విజయం అని చెప్పుకోవచ్చు. 1952లో భారతదేశంలో ఈ జాతి అంతరించిపోయినట్లు ప్రకటించారు. దీంతో దేశీయ చిరుత జనాభాను కోల్పోయిన ఏకైక దేశంగా భారతదేశం నిలిచింది. 2022లో 'ప్రాజెక్ట్ చీతా' ఫలితంగా పునర్వైభవం సాధ్యమైంది. నమీబియా నుంచి ఎనిమిది చీతాలు, ఆ తర్వాత దక్షిణాఫ్రికా నుంచి అదనపు చిరుతలను తరలించారు. వాటి సంతానం ఫలితంగా 2026 నాటికి మొత్తం జనాభా 57కి చేరింది. గడ్డిభూముల పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడమే ప్రాజెక్ట్ చీతా లక్ష్యం.

పులుల సంఖ్యలో 161శాతం పెరుగుదల
దేశంలో పులుల పునరుద్ధరణ ప్రపంచంలోని ఓ సరికొత్త చరిత్ర లిఖిస్తోంది. 2006 నాటికి వాటి జనాభా 1,411కి పడిపోవడంతో 'ప్రాజెక్ట్ టైగర్', జాతీయ పులుల సంరక్షణ అథారిటీ (NTCA) ద్వారా సంరక్షణ చర్యలు చేపట్టారు. మెరుగైన ఆవాసాల పరిరక్షణ, వేట నిరోధక గస్తీ, కెమెరా-ట్రాప్ పర్యవేక్షణ, శాస్త్రీయ జనాభా అంచనా, పులుల ప్రధాన ఆవాసాల నుంచి ప్రజలను ఖాళీ చేయించడం వంటి చర్యలు పురోభివృద్ధికి తోడ్పడ్డాయి. ఈ నేపథ్యంలో 2022 నాటికి, పులుల జనాభా 3,682కి పెరిగింది. ఇది దాదాపు 161శాతం పెరుగుదలను నమోదు చేయగా ప్రపంచంలోని వన్యపులుల్లో దాదాపు 70శాతం భారతదేశంలోనే ఉండడం విశేషం.

సింహాలు, చిరుతలు, మంచు చిరుతపులులు సంఖ్య గణనీయంగా
ఒకప్పుడు గుజరాత్‌లోని గిర్ పర్వత శ్రేణిలోని ఒక చిన్న ప్రాంతానికే పరిమితమైన ఆసియా సింహం అద్భుతంగా కోలుకుంది. ఆవాసాల రక్షణ, పశువైద్య సంరక్షణతో పాటు సామాజిక భాగస్వామ్యంతో మనుగడ సాగిస్తున్నాయి. 2000లో 327గా ఉన్న వాటి జనాభా 2025 నాటికి 891కి చేరినట్లు అంచనా.
అడవుల సంరక్షణ, పులి సంరక్షణ కేంద్రాలకు బలమైన రక్షణ కల్పించడం వల్ల చిరుతపులులూ ప్రయోజనం పొందాయి. 2014లో చిరుతల సంఖ్య 7,910 కాగా, 2022 నాటికి 13,874కు పెరిగాయి. మెరుగైన ఆవాసాల నిర్వహణ, ఆహారం లభ్యత పెరగడం వల్ల ఈ పెరుగుదల సాధ్యమైందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా దేశవ్యాప్త శాస్త్రీయ అంచనా ప్రకారం 2024 నాటికి హిమాలయ ప్రాంతమంతటా 718 మంచు చిరుతలు ఉన్నట్లు తేలింది. సంరక్షణ కార్యక్రమాలు స్థానిక సమాజాలతో కలిసి పనిచేయడం, వేటాడే జంతువులు, కంచెలు ఏర్పాటు చేయడం వల్ల ఇది సాధ్యమైంది.

ఈ విజయం వెనుక కారణాలు ఏమిటి?
చట్టపరమైన రక్షణ, దీర్ఘకాలిక ప్రభుత్వ నిధులు, శాస్త్రీయ పర్యవేక్షణకు తోడు సమాజ భాగస్వామ్యం వంటి అంశాల కలయికే వన్య మృగాల వృద్ధిలో సాధిస్తున్న విజయానికి కారణమని వన్యప్రాణి నిపుణులు పేర్కొంటున్నారు. ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ లయన్, ప్రాజెక్ట్ స్నో లెపర్డ్, ప్రాజెక్ట్ చీతా వంటి ప్రత్యేక కార్యక్రమాలకు కెమెరా ట్రాప్‌లు, జీపీఎస్ పర్యవేక్షణ, డ్రోన్లు, ఎం-స్ట్రైప్స్ పెట్రోలింగ్ వ్యవస్థ వంటి సాంకేతిక పరిజ్ఞానం తోడయ్యింది.
పరిహార పథకాలు, పర్యావరణ అభివృద్ధి కార్యక్రమాలు, ఆవాసాల పునరుద్ధరణ ద్వారా సంరక్షణలో స్థానిక సమాజాలను కూడా ఎక్కువగా భాగస్వాములను చేస్తున్నారు. ఇది ప్రజలకు, వన్యప్రాణులకు మధ్య సంఘర్షణలను తగ్గించడంలో సహాయపడుతుంది.
అడవుల నరికివేత, వాతావరణంలో మార్పులు, అటవీ శివార్లలో మనుషుల అలికిడి వంటివి వన్య మృగాల పెరుగుదలకు ఆంటంకాలుగా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ పులి జాతుల సంఖ్యను ఏకకాలంలో పెంచడంలో భారతదేశం సాధించిన సామర్థ్యం. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ముఖ్యమైన వన్యప్రాణుల పరిరక్షణ విజయాలలో ఇదొక మైలురాయి. అడవులు, వన్యమృగాల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు, శాస్త్రీయ నిర్వహణతో దశాబ్దాల జీవవైవిధ్య నష్టాన్ని సమర్థంగా ఎదుర్కొంటున్న తీరు ఆహ్వానించదగ్గ పరిణామం.
మాన్సూన్ మున్నార్ టూర్ - తేయాకు తోటల్లో విహరించేలా IRCTC టూర్ ప్యాకేజీ!
"గాంధీజీ" శాలువాలో దాగిన రహస్యం - రూ.500 నోట్లలో ఈ సీక్రెట్ మీరు గమనించారా?

