హైదరాబాదీ స్టైల్ "పనీర్ కర్రీ" - నిమిషాల్లోనే రెడీ - టేస్ట్ అమోఘం!
నోరూరించేలా పనీర్ కర్రీ - రోటీ, పుల్కా, రైస్, చపాతీల్లోకి కమ్మగా అద్దిరిపోతుంది!

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 11, 2026 at 2:35 PM IST
Hyderabadi Paneer Masala Curry : చాలా మందికి పనీర్‌తో చేసే వంటలంటే ఎంతో ఇష్టం. వీటితో వివిధ రకాల రెసిపీలు చేస్తుంటారు. మరి మీరెప్పుడైనా హైదరాబాదీ స్టైల్లో పనీర్ కర్రీ చేశారా? లేదంటే మాత్రం ఓసారి ఈ విధంగా చేసి చూడండి. ఇది చిక్కటి గ్రేవీతో సూపర్‌గా వస్తుంది. అంతేకాక చపాతీ, పరోటా, రోటీ, నాన్, అన్నం, పులావ్, బిర్యానీ ఇలా దేనిలోకైనా సూపర్ కాంబినేషన్‌గా నిలుస్తుంది.
రాయలసీమ స్పెషల్ "వెల్లుల్లి కారం పచ్చడి" - అన్నం, టిఫిన్స్‌లోకి పర్ఫెక్ట్!

కావాల్సిన పదార్థాలు :
- పనీర్ - 200 గ్రాములు
- వెల్లుల్లి రెబ్బలు - 8
- పచ్చిమిర్చి - 4
- పుదీనా - కొద్దిగా
- కొత్తిమీర - కొంచెం
- జీడిపప్పు - 8
- ఉల్లిపాయలు - 2
- ఆయిల్ - 3 టేబుల్ స్పూన్లు
- బిర్యానీ ఆకు - 1
- జాపత్రి - 1
- లవంగాలు - 3
- దాల్చినచెక్క - 1
- యాలకులు - 2
- పెరుగు - అర కప్పు
- పసుపు - అర టీ స్పూన్
- కారం - 2 టీ స్పూన్లు
- ధనియాల పొడి - ఒకటిన్నర టీ స్పూన్
- జీలకర్ర పొడి - అర టీ స్పూన్
- మిరియాల పొడి - 1 టీ స్పూన్
- ఉప్పు - 1 టీ స్పూన్
- ఫ్రెష్‌క్రీమ్ - 3 టేబుల్ స్పూన్లు
- కసూరిమెంతి - 1 టీ స్పూన్
- గరం మసాలా - 1 టీ స్పూన్
- కొత్తిమీర - కొద్దిగా
- శనగపిండి - 1 టీ స్పూన్

తయారీ విధానం :
- ముందుగా 200 గ్రాముల పనీర్‌ను తీసుకొని మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకో గిన్నెలో నీళ్లు, ఉప్పు వేసి కలపాలి. ఇందులో పనీర్ ముక్కలు వేసి ఉంచాలి. అలాగే రెండు ఉల్లిపాయలను సన్నగా తరిగి ఉంచాలి.
- ఇంకోవైపు మిక్సీజార్‌లో కొద్దిగా అల్లం ముక్కలు, 8 వెల్లుల్లి రెబ్బలు, నాలుగు పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర, 8 జీడిపప్పు, కొన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేయాలి.

- అలాగే మిక్సింగ్ బౌల్లో అర కప్పు పెరుగు, అర టీ స్పూన్ పసుపు, రెండు టీ స్పూన్ల కారం, ఒకటిన్నర టీ స్పూన్ ధనియాల పొడి వేయాలి. ఇందులోనే అర టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ మిరియాల పొడి, ఒక టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసి బాగా కలిపి పక్కనుంచాలి.
- మరోవైపు గిన్నెలో ఒక టీ స్పూన్ శనగపిండి, సరిపడా నీళ్లు పోసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- అదేవిధంగా స్టవ్ ఆన్ చేసి పాన్‌లో మూడు టేబుల్ స్పూన్ల నూనె పోయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఒక జాపత్రి, మూడు లవంగాలు, ఒక దాల్చినచెక్క, రెండు యాలకులు వేసి వేయించాలి. ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న పుదీనాకొత్తిమీర పేస్ట్ వేసి మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఆయిల్ సేపరెట్ అయ్యేంత వరకు వేగనివ్వాలి.

- ఇందులోనే కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమం వేసి మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి కలుపుతూ ఆయిల్ సేపరెట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. అలాగే ఒక కప్పు నీళ్లు, శనగపిండి నీళ్లు యాడ్ చేసి మిక్స్ చేయాలి. ఆ తర్వాత మూతపెట్టి మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఉడికించాలి.
- ఈ మిశ్రమం ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పనీర్ ముక్కలు, మూడు టేబుల్ స్పూన్ల ఫ్రెష్‌క్రీమ్, ఒక టీ స్పూన్ కసూరిమెంతి, ఒక టీ స్పూన్ గరంమసాలా వేసి కలిపి మూతపెట్టాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించి చివరన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

- ఇక అంతే ఘుమఘుమలాడే హైదరాబాదీ స్టైల్ పనీర్ కర్రీ రెడీ అయినట్లే!
- ఈ కర్రీ పుల్కా, రోటీ, చపాతీ, నాన్, జీరా రైస్‌లోకి అద్దిరిపోతుంది!
కర్ణాటక స్పెషల్ "మసాలా చిత్రాన్నం" - ఈ పండగ వేళ ఇలా ట్రై చేయండి!
సంక్రాంతి స్పెషల్ "మినప జంతికలు" - ఆయిల్ తక్కువ, క్రంచీ ఎక్కువ!

