లిఫ్టు ఎలా ఉపయోగించాలో మీకు తెలుసా? - ఇలా చేస్తే సమయం వృథా కాదు!
లిఫ్టు వినియోగంపై అవగాహన తప్పనిసరి - అత్యవసర పరిస్థితిలో ఇలా చేయండి!

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 29, 2025 at 12:34 PM IST
Lift Usage : అపార్ట్మెంట్లు, ఆఫీసులు, ఆస్పత్రులు ఇలా బహుళ అంతస్తుల భవనాల్లో లిఫ్టులు సర్వసాధారణం. లిఫ్టుల వాడకం కొత్తేమీ కాకున్నా చాలా మందికి వాటిని ఎలా ఉపయోగించాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. కనిపించిన బటన్ నొక్కేసి ఏమీ తెలియనట్లుగా ఉండిపోతారు. "లిఫ్టు గురించి తెలియదా" అని పక్కవాళ్లు ఏమనుకుంటారో! అనే భావనే అందుకు కారణం. లిఫ్టు ఎలా ఉపయోగించాలి? లిఫ్టు మధ్యలో నిలిచిపోతే ఏం చేయాలి? లిఫ్టులో కనిపించే బటన్లు దేనిని సూచిస్తాయో ఇపుడు తెలుసుకుందాం.
సంక్రాంతి సెలవుల తేదీలు వచ్చేశాయ్ - స్కూల్ పిల్లలకు పెద్ద పండగే!

లిఫ్టు ద్వారా కింది అంతస్తులకు వెళ్లాలన్నా, పైకి చేరుకోవాలన్నా వేర్వేరు బటన్లు ఉంటాయి. ఉదాహరణకు 6 అంతస్తులున్న భవనంలో 3వ ఫ్లోర్లో ఉన్న మీరు 6వ ఫ్లోర్‌కి వెళ్లాలనుకున్నారనుకోండి! అపుడు మీరు లిఫ్టు దగ్గరికి వెళ్లి ఈ గుర్తును "^" ప్రెస్ చేయాలి. ఈ గుర్తు పైకి సూచిస్తోంది కాబట్టి మీరు పైకి వెళ్లాలని లిఫ్టును పిలిచినట్లు అర్థం. ఒక వేళ మీరు కిందకు గ్రౌండ్ ఫ్లోర్‌కి వెళ్లాలనుకుంటే "v" బటన్ క్లిక్ చేయాలి.

మీరు ఏ బటన్ క్లిక్ చేసినా మీరున్న దగ్గరి లిఫ్ట్ వస్తుంది కానీ, మీరు పైకి వెళ్లాలో, కిందికి వెళ్లాలో సరైన బటన్ ఎంచుకోవడం వల్ల మీ సమయం, లిఫ్టులో ఉన్నవారి సమయం ఆదా అవుతుంది. ఒక వేళ ఆ లిఫ్టులో అప్పటికే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఎవరైనా 6వ ఫ్లోర్‌కి వెళ్తున్నపుడు 3వ ఫ్లోర్లో ఉన్న మీరు కూడా 6వ ఫ్లోర్‌కి వెళ్లాలనుకుంటే కచ్చితంగా "^" బటన్ ప్రెస్ చేయాలి. అంతేతప్ప కిందికి వెళ్లే "v" బటన్ ప్రెస్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు. లిఫ్టు అక్కడ ఆగకుండానే పైకి వెళ్లిపోతుంది.

లిఫ్ట్‌లో చేయాల్సినవి - చేయకూడనివి
- లిఫ్ట్ వచ్చి తలుపులు పూర్తిగా తెరుచుకునే వరకు ఎదురు చూడాలి. లోపల ఎవరైనా ఉన్నారా లేక బయటకు వస్తున్నారో చూసిన తర్వాతే లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాలి.
- ఒక్కో సారి సాంకేతిక తప్పిదం కారణంగా లిఫ్ట్ రాకుండానే డోర్లు ఓపెన్ అయిపోతాయి. అలాంటపుడు మీరు చూసుకోకుండానే లోపలికి వెళ్తే ప్రమాదమే. ఇలాంటి ఘటనలు తరచూ అక్కడక్కడా చోటుచేసుకుంటున్నాయి.
- ఇక లిఫ్ట్ తలుపులు మూసుకుంటున్నప్పుడు చేతులు, వస్తువులు అడ్డుపెడుతుంటారు. కానీ, అలా చేయడం కూడా ప్రమాదమే. పక్కన ఉన్న బటన్ క్లిక్ చేయడమే మేలైన మార్గం.
- లోపలికి వెళ్లిన తర్వాత మీరు చేరుకోవాలనుకుంటున్న అంతస్తుకు సంబంధించిన బటన్ మాత్రమే క్లిక్ చేయాలి.
- కొన్ని సార్లు లిఫ్టులు క్రాష్ కావడం, లేదంటే అకస్మాత్తుగా పడిపోతుంటాయి కూడా. ఒక వేళ లిఫ్ట్ మధ్యలో నిలిచిపోతే ఆందోళనకు గురికావద్దు. విద్యుత్ సరఫరా నిలిచినపుడు లిఫ్ట్ ఆగిపోవడం సహజమే. కాసేపు ప్రశాంతంగా ఉండాలి. అంతే తప్ప లిఫ్టు తలుపులు బలవంతంగా తెరిచేందుకు ప్రయత్నించి గాయపడొద్దు.
- లోపల కనిపించే అలారం బటన్ లేదా ఇంటర్‌కామ్ (ఫోన్) ఉపయోగించాలి. దాంతో సెక్యూరిటీ టీం అప్రమత్తమై స్పందించి మీకు సాయం అందించేందుకు అవకాశం ఉంటుంది.
- చిన్న పిల్లలు, పెంపుడు జంతువులను లిఫ్ట్‌లో తీసుకెళ్లే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.
నియంత్రణ కోల్పోయిన "స్పేస్ ఎక్స్" - భూమి దిశగా దూసుకొస్తున్న ఉపగ్రహం!
అందరికీ తాగునీరు అందుతోందా? - దేశ వ్యాప్తంగా ఏటా 2లక్షల మరణాలకు కారణాలేంటి?

