ఇంట్లో "పచ్చి కొబ్బరి" ఉందా? - ఈ టిప్స్ పాటిస్తే నెలల పాటు తాజాగా!
-నోములు, వ్రతాలు, గుడికి వెళ్లినప్పుడు కొబ్బరికాయ కొట్టడం సహజం - అయితే అవి మిగిలిపోయినప్పుడు పాడవకుండా ఇలా చేయండి!
How to Store Raw Coconut (Getty Images)

Published : August 28, 2026 at 1:07 PM IST
How to Store Raw Coconut: హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ మాసంలో మహిళలు నోములు, వ్రతాలు చేసుకోవడం, తరచూ గుళ్లకు వెళ్లడం చేస్తుంటారు. ఈ క్రమంలో కొబ్బరికాయలు కొడుతుంటారు. దీంతో ఇంట్లో ఎక్కువ మొత్తంలో పచ్చి కొబ్బరి చిప్పలు మిగిలిపోతుంటాయి. ఇలా మిగిలిన వాటిని ఒకేరోజు వివిధ వంటకాల్లో, స్వీట్ల తయారీలో ఉపయోగించలేం. పోనీ తర్వాత వాడదామని ఫ్రిజ్‌లో పెడితే పాడైపోతాయి. మరి, ఇలా జరగకుండా పచ్చి కొబ్బరి ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
- పచ్చి కొబ్బరిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి దాన్ని అలా గాల్లో వదిలేస్తే వాతావరణంలోని బ్యాక్టీరియా కొబ్బరిపై చేరుతుందని, ఫలితంగా అది రంగు మారడం, ముట్టుకుంటే జిగటగా అనిపించడం, క్రమంగా పాడైపోతుందంటున్నారు. అందుకే కొబ్బరి చిప్పలు ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండేలా చేయాలంటే ఈ చిట్కాలు మేలు చేస్తాయంటున్నారు. అవేంటంటే..
- గాలి లోపలికి ప్రవేశించకుండా కొబ్బరి చిప్పను అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టేయాలంటున్నారు. అంటే చిప్ప లోపలి భాగానికీ ఫాయిల్ అతుక్కునేలా ర్యాప్ చేయాలంటున్నారు. ఆపై గాలి చొరబడని డబ్బాలో లేదంటే జిప్‌లాక్ బ్యాగ్‌లో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టేయాలని సూచిస్తున్నారు. దీనివల్ల పచ్చి కొబ్బరి పాడవకుండా, తేమను కోల్పోకుండా ఉంటుందంటున్నారు.
- నీటిలో నిల్వ చేయడం వల్ల కూడా పచ్చి కొబ్బరిని తాజాగా ఉంచ వచ్చని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం ముందుగా కొబ్బరిని చిప్ప నుంచి వేరు చేసి.. సాధారణ నీటిలో లేదంటే కాస్త ఉప్పు కలిపిన నీటిలో వేసి ఫ్రిజ్‌లో పెట్టేయాలంటున్నారు. అయితే రోజూ ఈ నీటిని మార్చాలంటున్నారు. ఇలా చేయడం వల్ల పచ్చి కొబ్బరి వారం పాటు తాజాగా ఉంటుందంటుని సూచిస్తున్నారు.
- తురిమిన పచ్చి కొబ్బరి ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉండాలంటే ఈ చిట్కా మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. ముందుగా కొబ్బరి తురుమును ఒక ట్రేలో పరిచి రెండు గంటల పాటు ఫ్రీజర్‌లో ఉంచాలంటున్నారు. ఆపై దీన్ని ఫ్రీజర్ సేఫ్ బ్యాగ్‌లోకి మార్చి తిరిగి ఫ్రీజర్‌లో నిల్వ చేయాలంటున్నారు. ఇలా చేసిన కొబ్బరి తురుము కొన్ని నెలల పాటు తాజాగా ఉంటుందంటున్నారు.
- కొబ్బరిని చిప్ప నుంచి వేరు చేసి పెద్ద ముక్కలుగా కట్ చేయాలని, వీటిపై కొద్దిగా ఉప్పు లేదా నూనె రాసి గాలి చొరబడని డబ్బాలో భద్రపరిచినా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయని చెబుతున్నారు.
- కొబ్బరికాయ కొట్టిన వెంటనే ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటారు కొందరు. దీనివల్ల దాని ఉపరితలంపై ఉండే తేమకు అది పాడైపోయే అవకాశం ఉంటుందంటున్నారు. కాబట్టి ముందుగా ముక్కపై ఉన్న తడిని కాటన్ క్లాత్‌తో తుడిచేసి.. ఆపై గాలిచొరబడని డబ్బా లేదంటే జిప్‌లాక్ బ్యాగ్‌లో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టాలంటున్నారు. అప్పుడే అది పాడవకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు.
- కొబ్బరి ముక్కలు జిగటగా మారకుండా ఉండాలంటే.. ఫ్రిజ్‌లో పెట్టే ముందు కొద్దిగా నిమ్మరసం రాయడం వల్ల ఫలితం ఉంటుందంటున్నారు. ఇలా ఫ్రిజ్‌లో పెట్టిన పచ్చి కొబ్బరిని వంటల్లో వాడే ముందు కాసేపు గోరువెచ్చటి నీళ్లలో వేస్తే తిరిగి అది మృదువుగా మారుతుందని, అప్పుడే వంటకు రుచి వస్తుందని చెబుతున్నారు. అలాగే నిల్వ చేసిన కొబ్బరిని తిరిగి వాడే ముందు బూజు పట్టడం, రంగు మారడం, దుర్వాసన రావడం.. వంటి సంకేతాలు కనిపిస్తే మాత్రం దానిని వాడకపోవడమే మంచిదంటున్నారు.

