ETV Bharat / offbeat

సోషల్ మీడియాలో 'హోమ్ టూర్' వీడియోలు పెడుతున్నారా? - ఆ తర్వాత ఆలోచించుకోవాల్సిందే!

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 'హోమ్ టూర్' - ఈ విషయాలు తెలుసుకోకపోతే మొదటికే మోసమంటున్న నిపుణులు!

Home Tour Video Creating
హోమ్ టూర్ (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 28, 2026 at 10:04 AM IST

4 Min Read
Choose ETV Bharat

Home Tour Video Creating : 'హోమ్ టూర్' ప్రముఖుల నుంచి గృహిణుల వరకు ఫాలో అవుతున్న సోషల్ మీడియా ట్రెండ్. ఇంటి ముందు గేటు, హాలు, బెడ్​రూమ్, విలువైన వస్తువులు దాచే అల్మారాలు, నివాస పరిసరాలు అన్నీ చిత్రీకరించి యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసేస్తున్నారు. వాటికి నెటిజన్ల నుంచి వచ్చే కామెంట్లు, లైకులు చూసి తెగ సంబరపడిపోతున్నారు. అయితే ఇంటి గుట్టు బయటకు వచ్చేస్తే జరిగే ప్రమాదాల గురించి విస్మరిస్తున్నారు. మీరూ అలానే ఇంటిని చిత్రీకరించి సోషల్ మీడియాలో పెడుతున్నారా? అలాంటి టైమ్​లో​ ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు నిపుణులు. లేదంటే కేవలం ఆర్థికంగానే కాకుండా శారీరక భద్రత్రకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇంతకీ, హోమ్​టూర్​ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిర్లక్ష్యంగా ఉంటే ఎదురయ్యే నష్టాలేంటి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుతం హోమ్​టూర్ ట్రెండ్ బాగా ప్రాచుర్యంలో ఉంది. కొందరు అడ్రస్ ఈజీగా గుర్తించడానికి ఇల్లు, ఆఫీస్, వ్యాపార ప్రదేశం, లోపలి చిత్రాలను గూగుల్ మ్యాప్స్​లో అప్​లోడ్ చేస్తున్నారు. అయితే, ఇలా చేయడం కొన్ని అనర్థాలకు దారితీస్తోందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా నేరస్థులు కాలు కదపకుండా రెక్కీ చేయడానికి మీరు రూపొందించే ఈ వీడియోలు అస్త్రాలుగా ఉపయోగపడుతున్నాయని సూచిస్తున్నారు.

స్ట్రీట్ వ్యూ ద్వారా అన్ని ప్రాంతాల్లోని పట్టణాలు, వీధులు తెరపై కనిపిస్తుంటాయి. వీటితో పాటు కాలనీల్లోని ఇళ్లు, అపార్టుమెంట్ల ఇంటి గోడల ఎత్తు, ఎన్ని గేట్లు ఉన్నాయి, ప్రవేశ మార్గం, మెట్లు వంటివన్నీ కనిపిస్తుంటాయి. అక్కడి పరిస్థితుల ఆధారంగా ధనవంతులు, సాధారణ ఇళ్లేవో ఒక అంచనాకు వచ్చి చేతివాటం ప్రదర్శిస్తుంటారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల దొంగల ముఠాలు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

అధునాతన పోలీసింగ్ విధానాలు, పెరుగుతున్న సీసీ కెమెరాల వినియోగంతో దొంగల ముఠాలు రూటు మారుస్తున్నాయి. నేరం జరిగినప్పుడు పోలీసులు నిందితుల్ని పట్టుకోవడానికి రివర్స్ ఇంజినీరింగ్ చేస్తుంటారు. అంటే నేరం జరగడానికి ముందు ఎక్కడి నుంచి వచ్చారో కనిపెట్టి వారి నివాస స్థలాలు, సాయం చేసిన వ్యక్తులను కనిపెడతారు. ఇలా పట్టుబడకుండా ఉండేందుకు దొంగల ముఠాలు హోమ్​టూర్, గూగుల్ మ్యాప్స్ స్ట్రీట్ వ్యూలను రెక్కీ కోసం వాడుతున్నారు.

ముఖ్యంగా గూగుల్ మ్యాప్స్ ద్వారా ప్రత్యక్ష ఆనవాళ్లు కొంతమేర తగ్గించేందుకు వివిధ ప్రాంతాలపై ఒక అంచనాకు వస్తున్నట్లు దర్యాప్తులో బయటపడుతోంది. అందుకే ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత వివరాలు, చిత్రాలు ఎక్కువగా పోస్టు చేయడం ప్రమాదకరమని, కచ్చితంగా నియంత్రణ పాటించాలని సూచిస్తున్నారు.

పైసా ఖర్చు పెట్టకున్నా మీరే హీరో! - 'లౌడ్ బడ్జెటింగ్ ట్రెండ్' గురించి తెలుసా?

స్ట్రీట్ వ్యూలో ఇల్లు కనపడొద్దంటే ఏం చేయాలి?

  • గూగుల్ మ్యాప్స్ తన యూజర్ల గోప్యత, భద్రత కోసం ఇళ్ల చిత్రాలు మ్యాప్​లో ఇతరులకు కనిపించకుండా బ్లర్ (మసక)గా మార్చొచ్చు.
  • అందుకోసం ముందుగా కంప్యూటర్​లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి మీ ఇంటి అడ్రస్​ను సెర్చ్ బార్​లో టైప్ చేయాలి.
  • స్ట్రీట్ వ్యూ మోడ్​లోకి వెళ్లి స్క్రీన్​పై మీ ఇల్లు స్పష్టంగా కనిపించేలా సెట్ చేసుకోవాలి
  • అప్పుడు స్క్రీన్ కింద రైట్ సైడ్ కార్నర్​లో రిపోర్ట్ ఏ ప్రాబ్లమ్ ఆప్షన్​ను క్లిక్ చేస్తే, ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది.
  • అందులో రిక్వెస్ట్ బ్లరింగ్ విభాగంలో మై హోమ్ ఆప్షన్​ను ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ ఈమెయిల్ ఐడీ, క్యాప్చా వివరాలు ఎంటర్ చేయాలి.
  • అప్పుడు గూగుల్ బృందం మీ అభ్యర్థనను పరిశీలించి స్ట్రీట్ వ్యూలో మీ ఇంటిని శాశ్వతంగా బ్లర్ చేస్తుందంటున్నారు నిపుణులు.

హోమ్​టూర్​లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి :

  • మీరు హోమ్​టూర్ తరహా వీడియోలు చేయాలనుకుంటే మాత్రం ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
  • ముఖ్యంగా మీరు నివాసం ఉండే కాలనీ, ఇంటి నంబరు, కిటికీలు, వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లు, సీసీ కెమెరాలు, స్మార్ట్ లాక్​లు వంటివి వీడియోల్లో కనిపించకుండా చూసుకోవాలి.
  • రికార్డింగ్ స్టార్ట్ చేయడానికి ముందే నగలు, విలాస వస్తువులు, తాళాలు భద్రపరిచే ప్రదేశాలు దాచాలి.
  • ఏ టైమ్​లో పోస్టు చేస్తున్నారో అర్థమయ్యేలా జీపీఎస్ లొకేషన్ ట్యాగ్, తేదీ, సమయం వివరాలు ఉండకుండా చూసుకోవాలంటున్నారు.

కొన్ని ఘటనలను పరిశీలిస్తే :

హైదరాబాద్ శివారులోని ఆలయాలే లక్ష్యంగా దొంగతనాలు చేస్తున్న ఓ ముఠాను గత సంవత్సరం రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా దొంగతనాల శైలి చూసి పోలీసులే షాక్ అయ్యారు. దొంగతనాలకు ముందు గూగుల్ మ్యాప్స్​లో టెంపుల్స్​ను వెతికి వాటికి సంబంధించిన ఫొటోలను పరిశీలిస్తారు. విలువైన వెండి, బంగారు ఆభరణాలతో ఉండే విగ్రహాలున్న ఆలయాలను ఎంపిక చేసి దొంగతనం చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.

మధ్యప్రదేశ్​కు చెందిన మహిళా యూట్యూబర్ హోమ్ టూర్ వీడియో చేశారు. ఇంటి ప్రధాన ద్వారం, ఎన్ని గదులుంటాయి? ఎవరెవరు ఉంటారో, ఎన్ని సీసీ కెమెరాలుంటాయో చూపించడంతో పాటు తన బంగారు, వెండి ఆభరణాలను ఓ టేబుల్​పై పెట్టి ప్రదర్శన ఇవ్వడం వైరల్ అయ్యాయి. ఈ వీడియో చూసిన దొంగలు అర్ధరాత్రి వేళ ఇంట్లోకి చొరబడి యూట్యూబర్ కుటుంబాన్ని బంధించి మొత్తం ఆభరణాలను ఎత్తుకెళ్లారు. అందుకే, హోమ్​టూర్ వీడియోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.

'రూ.5 ట్రాక్టర్ నోటు' మీ దగ్గర ఉందా? - ఆన్​లైన్ మార్కెట్​లో లక్షలు పలుకుతుందా?

పెళ్లి చూపుల్లోనే ఈ విషయాలు మాట్లాడుకుంటే బెటర్ - 'ప్రీనప్' అగ్రిమెంట్ తెలుసా?