సరికొత్తగా "తోటకూర మజ్జిగ చారు" - ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు!
తోటకూరతో అద్దిరిపోయే రెసిపీ - ఈ సరికొత్త రుచికి ఫిదా అయిపోతారు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 10, 2026 at 5:18 PM IST
Amaranth Leaves Buttermilk Stew in Telugu : తోటకూరను వివిధ రకాల వంటల్లో ఉపయోగిస్తారు. అయితే చాలా మంది వీటితో పప్పు, ఫ్రై ఎక్కువగా చేస్తుంటారు. ఇవే కాకుండా మీకోసం మరో సూపర్ రెసిపీ ఎదురు చూస్తోంది. అదే తోటకూర మజ్జిగ చారు. ఈ స్టెప్స్ పాటిస్తూ ఇది చేశారంటే సూపర్‌గా వస్తుంది. ఇక పిల్లలైతే వీటితో రెండు ముద్దలు ఎక్కువగానే లాగిస్తారు! అలాగే రొటీన్‌గా చేసుకునే పులుసు లేదా చారు బోర్ కొట్టిన వారికి ఇది సరికొత్త ఆప్షన్‌గా నిలుస్తుంది. ఒక్కసారి ఈ పద్ధతిలో చేసి తిన్నారంటే మళ్లీమళ్లీ కావాలనిపిస్తుంది. పైగా దీనిని అప్పటికప్పుడు తక్కువ సమయంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేయోచ్చు. మరి ఈ సింపుల్ టేస్టీ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూసేయండి.
'వావ్' అనిపించే "ఉలవల కారం పొడి" - ఇడ్లీ, దోసెలతో పాటు వేడి వేడి అన్నంలోకి అద్దిరిపోతుంది!

కావాల్సిన పదార్థాలు :
- తోటకూర తరుగు - ఒకటిన్నర కప్పు
- పెరుగు - ఒక కప్పు
- మెంతులు - పావు స్పూన్
- ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు
- ఆవాలు - 1 స్పూన్
- శనగపప్పు - 1 స్పూన్
- జీలకర్ర - 1 స్పూన్
- పచ్చిమిర్చి - 2
- అల్లం తరుగు - 1 స్పూన్
- కరివేపాకు - కొంచెం
- పసుపు - పావు స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా కావాల్సిన పరిమాణంలో తోటకూర, అల్లంను శుభ్రంగా కడిగి తరిగి ఉంచాలి. అలాగే రెండు పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకోవైపు గిన్నెలో కప్పు పెరుగు, అరకప్పు నీళ్లు పోసి మజ్జిగలా చేసి పక్కనుంచాలి.
- అదేవిధంగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత పావు స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయాలి.

- ఈ మిశ్రమం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నని పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి వేగనివ్వాలి. అనంతరం శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూర తరుగు వేసి ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకోవాలి.
- అలాగే పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. అనంతరం కడాయిపై మూతపెట్టి మధ్యమధ్యలో కలుపుతూ తోటకూరను మెత్తగా మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ముందుగా తయారు చేసుకున్న మజ్జిగను వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవాలి.

- అంతే నిమిషాల్లోనో టేస్టీటేస్టీ తోటకూర మజ్జిగ చారు రెడీ అయినట్లే!
- ఈ స్టెప్స్ పాటిస్తూ చేస్తే ఇంటిల్లిపాదీ కమ్మగా, కడుపునిండా తినేస్తారు.

- మీరు ఎక్కువ మోతాదులో తోటకూర మజ్జిగ చారు చేసుకోవాలనుకుంటే తోటకూరతో పాటు ఇతర పదార్థాలను అందుకనుగుణంగా పెంచి తీసుకోవాలి.
సంక్రాంతి స్పెషల్ "మినప జంతికలు" - ఆయిల్ తక్కువ, క్రంచీ ఎక్కువ!
అన్నం, కర్రీ చేయాల్సిన అవసరం లేదు - ఇలా చేస్తే లంచ్ బాక్స్ కళకళ!

