కొత్త పద్ధతిలో నోరూరించే "టమాటా గుడ్డు పులుసు" - బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు!
వేడి వేడి అన్నంలోకి అద్దిరిపోయే 'ఎగ్ పులుసు' - తక్కువ పదార్థాలతో అప్పటికప్పుడు రెడీ!

Published : January 7, 2026 at 8:02 PM IST
Tomato Egg Pulusu Recipe in Telugu : ఇంట్లో కూరగాయలేమి లేనప్పుడు ఫ్రిడ్జ్‌లో కోడిగుడ్లు ఉన్నాయంటే చాలు వాటితో ఎగ్ బుర్జీ, ఆమ్లెట్, కర్రీ వంటివి చేసుకుంటుంటాం. అదే, ఎగ్ పులుసు విషయానికొస్తే టైమ్ టేకింగ్ ప్రాసెస్‌గా భావిస్తుంటాం. కానీ, మీకు తెలుసా? కేవలం పావుగంటలోనే సూపర్ టేస్టీగా చేసుకునే ఒక మంచి రెసిపీ ఉంది. అదే, నోరూరించే "టమాటా గుడ్డు పులుసు". బ్యాచిలర్స్‌తో పాటు ఎవరైనా ఈ కర్రీని క్విక్ అండ్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి అద్భుతంగా ఉండి తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది. మరి, లేట్ చేయకుండా ఘుమఘుమలాడే ఈ నయా స్టైల్ కోడిగుడ్డు పులుసును ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- కోడిగుడ్లు - ఎనిమిది
- టమాటాలు - ఎనిమిది(పండినవి)
- పచ్చిమిర్చి - ఆరేడు
- ఉల్లిపాయలు - రెండు
- నూనె - ఆరు టేబుల్ స్పూన్లు
- ఆవాలు - రెండు టీస్పూన్లు
- జీలకర్ర - కొద్దిగా
- పసుపు - అర టీస్పూన్
- ఉప్పు - రుచికి తగినంత
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు టేబుల్ స్పూన్లు
- కారం - మూడు చెంచాలు(రుచికి తగినంత)
- ధనియాల పొడి - రెండు టేబుల్ స్పూన్లు
- మిరియాల పొడి - రెండు టీస్పూన్లు
- కొత్తిమీర తరుగు - నాలుగు టేబుల్‌స్పూన్లు
అమ్మమ్మల పద్ధతిలో "గోంగూర పులుసు" - చింతపండు లేకుండానే పుల్ల పుల్లగా అదుర్స్!

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా ఉల్లిపాయ, టమాటాలను శుభ్రంగా కడిగి సన్నగా తరుక్కుని రెడీగా ఉంచుకోవాలి. అలాగే, పచ్చిమిర్చిని నిలువుగా చీలికల్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నూనె కొద్దిగా హీట్ అయ్యాక ఆవాలు వేసి చిటపటలాడించాలి.
- ఆ తర్వాత అందులో జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త సాఫ్ట్‌గా మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
- అలా వేయించుకున్నాక పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి కలిపి ఉల్లిపాయలు పూర్తిగా మెత్తబడే వరకు మరికాసేపు మగ్గనివ్వాలి. ఇలా చేయడం ద్వారా కూరలో గ్రేవీ ఎక్కువగా వస్తుందని గుర్తుంచుకోవాలి.

- ఆవిధంగా మగ్గించుకున్నాక అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసుకుని టమాటా ముక్కలు గుజ్జుగా అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి.
- ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, ఒక ఉల్లిపాయకు నాలుగు గుడ్లు, నాలుగు టమాటాలు తీసుకుని కోడిగుడ్డు పులుసు ప్రిపేర్ చేసుకున్నట్లయితే మంచి రుచికరంగా వస్తుంది. ఈ కొలతలతో మీరు ఈ కర్రీ క్వాంటిటీని ఎంతైనా పెంచి చేసుకోవచ్చు.
- టమాటాలు సాఫ్ట్‌గా మగ్గి గుజ్జుగా అయ్యాక అందులో ధనియాల పొడి, రుచికి తగినంత కారం వేసి ఒకసారి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.

- ఆ తర్వాత స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి టమాటా ముక్కల్లో నుంచి నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి.
- అనంతరం అందులో ఒక లీటర్ వాటర్ పోసి బాగా కలుపుకోవాలి. ఆపై కరివేపాకు వేసి కలిపి స్టవ్‌ను హై ఫ్లేమ్‌లో ఉంచి పులుసును బాగా మరగనివ్వాలి.
- ఆ మిశ్రమం బాగా మరిగి తెర్ల కాగుతున్నప్పుడు అందులో కోడిగుడ్లను పగులగొట్టి ఒకే దగ్గర కాకుండా పాన్ మొత్తం వేసుకోవాలి.
- ఇలా మరిగే గ్రేవీలో గుడ్లను పగులగొట్టి వేసుకోవడం ద్వారా ఎలాంటి వాసన రాదు, ఎగ్ లోపలి దాకా చక్కగా ఉడికి రుచి కూడా బాగుంటుంది.
- ఆపై స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌కి టర్న్ చేసి ఏడెనిమిది నిమిషాల పాటు గరిటెతో కదపకుండా ఉడకనివ్వాలి.

- ఇక గుడ్డు మిశ్రమం మంచిగా ఉడికి జ్యూసీగా మారిందనుకున్నాక చివరగా దింపే ముందు మిరియాల పొడి, సన్నని కొత్తిమీర తరుగు వేసుకుని నెమ్మదిగా ఒకసారి మొత్తం కలిసేలా కలిపి దింపేసుకుంటే చాలు.
- అంతే, ఘుమఘుమలాడే "టమాటా గుడ్డు పులుసు" అప్పటికప్పుడు రెడీ అవుతుంది!
- మరి, నచ్చితే మీరూ రెగ్యులర్ రెసిపీలకు బదులుగా ఓసారి ఇలా 'గుడ్డు పులుసు' ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ వావ్ సూపర్ అంటూ లొట్టలేసుకుంటూ తింటారు.
కాల్చిన వంకాయతో కమ్మని "పెరుగు పచ్చడి" - సూపర్ టేస్టీగా ఉంటుంది - అన్నం, దోసెల్లోకి అదుర్స్!
బ్రేక్‌ఫాస్ట్‌లోకి అద్దిరిపోయే "సేమియా పులిహోర" - పావుగంటలోనే రెడీ! - టేస్ట్ సూపర్!

