అన్నం, చపాతీల్లోకి అద్దిరిపోయే "కోడిగుడ్డు కర్రీ" - ఒక్కసారి తింటే రుచికి ఫిదా అవ్వాల్సిందే!
- కోడిగుడ్డుతో ఎన్నడూ చేయని వెరైటీ రెసిపీ - పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది!

Published : October 16, 2025 at 2:22 PM IST
Variety Egg Curry Recipe : సంపూర్ణమైన పోషకాహారాలలో ఒకటి కోడిగుడ్డు. డాక్టర్లు కూడా రోజుకో గుడ్డు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతారు. ఈ క్రమంలోనే మెజార్టీ పీపుల్ ఇంట్లో ఎగ్స్ ఉన్నాయంటే చాలు ఎగ్ బుర్జీ, ఆమ్లెట్ వేసుకోవడం చేస్తుంటారు. కాస్త టైమ్ ఉంటే "గుడ్డు పులుసు" పెడుతుంటారు. ఎంత ఇష్టమైనప్పటికీ గుడ్డుతో ఎప్పుడు ఒకే రకమైన కూరలు తినాలంటే పిల్లలకే కాదు పెద్దవాళ్లకూ నచ్చదు. అందుకే, మీకోసం రెగ్యులర్‌గా చేసుకునే వాటి కంటే భలే టేస్టీగా ఉండే ఒక వెరైటీ "ఎగ్ కర్రీ" రెసిపీని తీసుకొచ్చాం.
మిరియాల ఫ్లేవర్‌తో స్పైసీ స్పైసీగా, ఎంతో కమ్మగా ఉంటుంది. ఇది అన్నం, చపాతీ, రోటీల్లోకి మంచి కాంబినేషన్‌గా నిలుస్తుంది. ఒక్కసారి ఈ పద్ధతిలో చేసుకుని తిన్నారంటే ఎప్పుడూ ఇలానే చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరి, ఈ న్యూ స్టైల్ బాయిల్డ్ ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- కోడిగుడ్లు - మూడు
- ఉల్లిపాయలు - రెండు (పెద్ద సైజ్‌వి)
- కరివేపాకు - కొద్దిగా
- నూనె - రెండు టేబుల్ స్పూన్లు
- పసుపు - పావుటీ స్పూన్
- ఉప్పు - రుచికి తగినంత
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - అరటేబుల్‌స్పూన్
- కారం - తగినంత
- ధనియాల పొడి - ఒకటీస్పూన్
- జీలకర్ర పొడి - పావుటీస్పూన్
- మిరియాల పొడి - ఒకటీస్పూన్
- పచ్చిమిర్చి - రెండు
- కసూరి మేతి - అరటీస్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
"చికెన్ భర్తా" తిన్నారా ఎప్పుడైనా? - ఈ సండే ఇలా చేశారంటే ఇంటిల్లిపాదీ ఫుల్ ఫిదా!

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి కోడిగుడ్లను ఉడికించుకోవాలి.
- కోడిగుడ్లు ఉడికేలోపు రెసిపీలోకి అవసరమైన ఉల్లిపాయలను వీలైనంత సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- ఎగ్స్ ఉడికిన తర్వాత పైన పొట్టును తొలగించి ఒక్కో గుడ్డును రెండు భాగాలుగా మధ్యలోకి కట్ చేసి ప్లేట్లోకి తీసుకుని పక్కనుంచాలి.
- ఇప్పుడు కర్రీ తయారీకి స్టవ్ మీద పాన్‌లో నూనె వేసి వేడి చేసుకోవాలి.
- ఆయిల్ కాగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ తరుగు, కరివేపాకు, పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకుని మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ రెండు నిమిషాల పాటు వేయించాలి.

- ఆ విధంగా వేయించాక పాన్‌పై మూతపెట్టి లో ఫ్లేమ్‌లో మధ్యమధ్యలో కలుపుతూ ఆనియన్స్‌ను బాగా మగ్గనివ్వాలి.
- ఉల్లిపాయలు మంచిగా మగ్గిన తర్వాత తాజా అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి.
- తర్వాత అందులో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసుకుని స్టవ్‌ను లో-ఫ్లేమ్‌లో ఉంచి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
- అనంతరం గ్రేవీకి సరిపడా తగినన్ని నీళ్లను పోసుకుని మరోసారి బాగా కలపాలి. ఆపై కట్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. తర్వాత కసూరి మేతిని చేతితో నలిపి వేసి మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకోవాలి.
కేటరింగ్ స్టైల్ "చికెన్ ఫ్రై" - ముద్ద ముద్దకో ముక్కతో కుమ్మేస్తారు!

- ఇదే స్టేజ్‌లో ఒకసారి ఉప్పు, కారం చెక్ చేసుకుని సరిపోలేదనిపిస్తే మరికొద్దిగా వేసుకుని మిక్స్ చేసుకోవాలి.
- తర్వాత పాన్‌పై మూత ఉంచి లో ఫ్లేమ్‌లో ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి.
- అది మంచిగా ఉడికి నూనె సెపరేట్ అవుతూ గ్రేవీ కాస్త చిక్కబడ్డాక ఆఖర్లో సన్నని కొత్తిమీర తరుగు వేసుకుని కలిపి దింపేసుకుంటే చాలు. అంతే, సరికొత్త పద్ధతిలో ఘుమఘుమలాడే "బాయిల్డ్ ఎగ్ కర్రీ" రెడీ అవుతుంది!
- ఒకవేళ మీరు ఈ కర్రీని ఎక్కువ క్వాంటిటీలో రెడీ చేసుకోవాలనుకుంటే ఎగ్స్‌తో పాటు ఇతర పదార్థాలను అందుకు అనుగుణంగా డబుల్ చేసి తీసుకుంటే సరిపోతుంది.

సరికొత్త రుచితో "కోడిగుడ్డు పాలకూర ఫ్రై" - ఇంటిల్లిపాదీ ఇష్టంగా తినేస్తారు!

