సరికొత్తగా " ఉల్లిపాయ పెరుగు పచ్చడి" - పల్లీ కారంతో చేసుకుంటే నెవ్వర్ బిఫోర్ టేస్ట్!
-ఎప్పుడూ చేసే పద్ధతిలో కాకుండా ఈ కాంబినేషన్లో ట్రై చేయండి - సూపర్ టేస్ట్‌తో అద్దిరిపోతుంది!

Published : November 7, 2025 at 12:04 PM IST
Palli Karam Perugu Pachadi: పెరుగు పచ్చడి అంటే చాలా మందికి ఇష్టం. నోటికి ఏమీ తినబుద్ధికానప్పుడు, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, పెరుగు మిగిలినప్పుడు ఇలా రకరకాల సందర్భాల్లో ఈ పచ్చడిని ప్రిపేర్ చేస్తుంటారు. అయితే పెరుగు పచ్చడిని ఎప్పుడూ చేసే పద్ధతిలో కాకుండా పల్లీ కారం కాంబినేషన్లో ట్రై చేయండి. నెవ్వర్ బిఫోర్ టేస్ట్‌ను ఎంజాయ్ చేస్తారు. అతి తక్కువ సమయంలో ఎంతో రుచికరంగా ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా కమ్మని పల్లీ కారంతో ఉల్లిపాయ పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూసేయండి.
కావాల్సిన పదార్థాలు:
పల్లీ కారం కోసం:
- నూనె - 1 టేబుల్‌స్పూన్
- ధనియాలు - 1 టేబుల్‌స్పూన్
- పచ్చిమిర్చి - 5
- పల్లీలు - అర కప్పు
- వెల్లుల్లి రెబ్బలు - 15
- ఉప్పు - రుచికి సరిపడా

పెరుగు పచ్చడి కోసం:
- నూనె - 2 టేబుల్‌స్పూన్లు
- ఆవాలు - అర టీస్పూన్
- కరివేపాకు - 2 రెమ్మలు
- ఉల్లిపాయలు - 2
- కారం - 1 టీస్పూన్
- జీలకర్ర - అర టీస్పూన్
- పసుపు - పావు టీస్పూన్
- ఎండు కొబ్బరి పొడి - 1 టేబుల్‌స్పూన్
- పెరుగు - అరకేజీ
తయారీ విధానం:
- ఈ పచ్చడి కోసం కావాల్సిన పదార్థాలను ముందుగానే రెడీ చేసుకోవాలి. అందుకోసం ఉల్లిపాయలను సన్నగా, పొడుగ్గా కట్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలపై పొట్టు తీసేసి పెట్టుకోవాలి.
- ముందుగా పల్లీ కారం ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె పోసుకోవాలి.
- ఆయిల్ కాగిన తర్వాత ధనియాలు, పచ్చిమిర్చి, పల్లీలు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి లో టూ మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ వేయించాలి.

- పల్లీలు, పచ్చిమిర్చి పర్ఫెక్ట్గా వేగిన తర్వాత ఓ ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే పాన్‌లోకి మరికొంచెం నూనె వేసి హీట్ చేసుకోవాలి.
- నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. అనంతరం ఉల్లిపాయ తరుగు వేసి వేయించుకోవాలి.
- ఈలోపు మిక్సీజార్‌లోకి ముందుగా వేయించిన పల్లీల మిశ్రమం, రుచికి సరిపడా ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి.

- ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత గ్రైండ్ చేసిన పల్లీ పొడి, కారం, పసుపు వేసి ఓసారి కలుపుకోవాలి.
- అనంతరం కొబ్బరి పొడి వేసి మరో రెండు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసి పాన్‌ను పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి పెరుగు, కొద్దిగా ఉప్పు వేసి అస్సలు ఉండలు లేకుండా చాలా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేలా బీట్ చేసుకోవాలి.
- ఆ పెరుగులోకి పల్లీ కారం, ఉల్లిపాయ మిశ్రమం వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. చివరగా కొత్తిమీర తరుగు చల్లి గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పల్లీ కారంతో ఉల్లిపాయ పెరుగు పచ్చడి రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

చిట్కాలు:
- పల్లీలు, పచ్చిమిర్చి వేయించుకునే విధానంలో పల్లీ కారం ఆపై పెరుగు పచ్చడి రుచి డిపెండ్ అయ్యి ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మాడకుండా పర్ఫెక్ట్గా వేయించుకోవాలి.
- ఉల్లిపాయలను మరీ మెత్తగా ఉడికించుకోవాల్సిన పనిలేదు. అన్నంలో కలుపుకుని తినేటప్పుడు కాస్త పంటికి తగులుతుండాలి.
- ఈ పెరుగు పచ్చడి కోసం పెరుగు చిక్కగా ఉండాలి. అలాగే తాజాగా ఉంటే బాగుంటుంది. పచ్చిమిర్చిని మీరు తినే కారానికి సరిపడా యాడ్ చేసుకోవాలి.
పిల్లలూ ఇష్టంగా తినే "దొండకాయ వేపుడు" - సౌత్ ఇండియన్ స్టైల్లో పొడిపొడిగా అద్దిరిపోతుంది!
ఉల్లి, వెల్లుల్లి లేని "బెండకాయ నువ్వుల కారం" - జిగురు ఉండదు - టేస్ట్ వేరే లెవల్!

