ఇంట్లో కూరగాయలు లేకపోతే "ఉల్లిగడ్డ కారం" - వేడి వేడి అన్నంలోకి అదుర్స్!
- తక్కువ పదార్థాలతో ఎక్కువ రుచినిచ్చే రెసిపీ - ఇంటిల్లిపాదీకి చాలా బాగా నచ్చేస్తుంది!

Published : January 6, 2026 at 2:16 PM IST
How to Make Tasty Ulligadda Karam : నార్మల్‌గా అందరి ఇళ్లలోనూ కూరగాయలేమి లేకపోయినా, ఉల్లిగడ్డలు మాత్రం దాదాపుగా స్టాక్ ఉంటాయి. రోజూ చేసుకునే కూరల్లో రుచి, చిక్కదనం కోసం ఒకటో రెండో ఉల్లిపాయలు వేస్తుంటారు. ముఖ్యంగా కొన్నిరకాల కర్రీలు, సాంబారు వంటి వాటిల్లో ఆనియన్ వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. అయితే, ఉల్లిని ఎప్పుడూ సైడ్ క్యారెక్టర్‌గానే కాకుండా ఓసారి మెయిన్ లీడ్‌గా తీసుకుంటూ ఇలా "ఉల్లిగడ్డ కారం" చేయండి.
వేడి వేడి అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉండి తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది. ఈ సీజన్లో నోటికి ఏమీ రుచించనప్పుడు కూడా 'ఉల్లి కారం' మంచి ఛాయిస్. ఈ రెసిపీ చాలా తక్కువ పదార్థాలతోనే అప్పటికప్పుడు ఈజీగా తయారవుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి, నోరూరించే ఈ ఉల్లిగడ్డ కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- పెద్ద సైజ్ ఉల్లిపాయలు - రెండు
- నూనె - ఒకట్రెండు టీస్పూన్లు
- జీలకర్ర - ఒక టీస్పూన్
- కారం - రుచికి తగినంత
- ఉప్పు - టేస్ట్‌కి సరిపడా
- వెల్లుల్లి రెబ్బలు - పది
- చింతపండు - చిన్న నిమ్మకాయ సైజంత
- సన్నని కొత్తిమీర తరుగు - కొద్దిగా
సింపుల్‌గా అయిపోయే "చిక్కుడుకాయ వేపుడు" - పోషకాలు పోకుండా రుచి అద్దిరిపోతుంది!

తయారీ విధానం :
- ఈ సింపుల్ అండ్ టేస్టీ ఉల్లిగడ్డ కారం ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక చిన్న గిన్నెలో చింతపండు తీసుకుని శుభ్రంగా కడగాలి. తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసి కాసేపు నాననివ్వాలి.
- అది నానేలోపు రెసిపీలోకి అవసరమైన ఉల్లిపాయలను మరీ చిన్నగా కాకుండా కాస్త పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి.
- అనంతరం స్టవ్ మీద పాన్ పెట్టి నూనె పోసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కాస్త రంగు మారి, మెత్తబడే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఆపై వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కనుంచాలి.

- ఇప్పుడు రోలును శుభ్రంగా కడిగి క్లాత్‌తో తుడిచి ముందుగా అందులో వేయించుకున్న ఉల్లిగడ్డ ముక్కలను వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి.
- ఉల్లిపాయలను ఆ విధంగా దంచుకున్నాక అందులో జీలకర్ర, మీరు తినే రుచిని బట్టి తగినంత కారం, ఉప్పు, నానబెట్టుకున్న చింతపండుని వేసి అన్నీ కలిసేలా కలియరుబ్బుకోవాలి.
- ఆ తర్వాత పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని మిశ్రమం మొత్తాన్ని మరికాసేపు దంచుకోవాలి.
- ఇక చివరగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగును వేసి మిశ్రమాన్ని మరీ మెత్తగా కాకుండా కాస్త కచ్చాపచ్చాగానే ఉండేలా రుబ్బుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
- అయితే, దీన్ని ఇలాగే నేరుగా వేడి వేడి అన్నంలో వేసుకుని తిన్నా చాలా రుచికరంగా ఉంటుంది. లేదంటే తాలింపు పెట్టుకుని తిన్నా టేస్ట్ అద్దిరిపోతుంది.

తాలింపు కోసం :
- నూనె - తగినంత
- వెల్లుల్లి రెబ్బలు - 8 నుంచి 10
- కరివేపాకు - కొద్దిగా
- పసుపు - చిటికెడు

- ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి నూనె వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పసుపు వేసి మంచిగా వేయించుకోవాలి.
- తాలింపు మంచిగా వేగిందనుకున్నాక అందులో ముందుగా రుబ్బిపెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకుని కాసేపు కలుపుతూ వేయించుకుని దింపుకుంటే చాలు.
- అంతే, సూపర్ టేస్టీగా ఉండే "ఉల్లిగడ్డ కారం లేదా తొక్కు" అప్పటికప్పుడు నిమిషాల్లోనే తయారవుతుంది!
- ఇక్కడ రోలు అందుబాటులో లేనివారు మిక్సీలో ఇదే ప్రాసెస్ ఫాలో అవుతూ ఈ రుచికరమైన ఉల్లిగడ్డ కారాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ, ఉల్లికారం రోట్లో ప్రిపేర్ చేసుకున్నంత రుచి మిక్సీలో తయారు చేసుకనే దానికి రాదనే విషయాన్ని మీరు గమనించాలి!
ఐదు నిమిషాల్లోనే సూపర్ "టిఫెన్" - ఇంటిల్లిపాదీకి చాలా బాగా నచ్చుతుంది!
పల్లెటూరి పద్ధతిలో "కాల్చిన దోసకాయ పచ్చడి" - వేడి వేడి అన్నంలో నెయ్యితో తింటే అద్భుతమే!

