నోరూరించే "మీల్ మేకర్ పచ్చడి" - చికెన్ చట్నీని మించిన టేస్ట్!
- మీల్ మేకర్స్‌తో రెగ్యులర్ వంటలు కాదు, ఇలా "పచ్చడి" ట్రై చేయండి! - రుచికి ఫిదా అవ్వాల్సిందే!

Published : March 1, 2026 at 5:31 PM IST
Meal Maker Pachadi Recipe in Telugu : మంచి ప్రొటీన్ రిచ్ ఆహారాలలో ఒకటి "మీల్ మేకర్స్". వీటిని పిల్లలతో పాటు కొంతమంది పెద్దవాళ్లూ అంతగా తినడానికి ఇష్టపడరు. అలాంటి వారందరూ ఇష్టంగా తినే ఒక అద్భుతమైన రెసిపీ ఉంది. అదే, సూపర్ టేస్టీ "మీల్ మేకర్ పచ్చడి". ఇది చికెన్ పచ్చడిని మించిన రుచితో భలే కమ్మగా ఉంటుంది. ఇంట్లోవాళ్లు ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ చేసి పెట్టమని అడుగుతారు. అంతేకాదు, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పచ్చడి బాగా ట్రెండ్ అవుతుంది కూడా. అలాగే, దీని కోసం ఎక్కువ శ్రమించాల్సిన పని లేదు. బిగినర్స్ కూడా అప్పటికప్పుడు సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి, నోరూరించే ఈ మీల్ మేకర్ పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- మీల్ మేకర్స్ - రెండు కప్పులు
- నూనె - తగినంత
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - రెండు టేబుల్‌స్పూన్లు
- ఉప్పు - రుచికి తగినంత
- కారం - రెండు చెంచాలు
- పసుపు - కొద్దిగా
- నిమ్మకాయ - ఒకటి
మీరు తాగే "పాలు" కల్తీవి కావొచ్చు! - FSSAI టిప్స్‌తో క్షణాల్లో గుర్తించండిలా!

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద గిన్నెలో నాలుగైదు గ్లాసుల నీళ్లు తీసుకుని వేడి చేసుకోవాలి.
- వాటర్ కొద్దిగా వేడయ్యాక ఒక టీస్పూన్ ఉప్పు, అర చెంచా పసుపు వేసి కలపాలి.
- ఆ తర్వాత అందులో మీల్ మేకర్స్‌ను వేసి స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషాల పాటు నాననివ్వాలి.
- మీల్ మేకర్స్ నానేలోపు పచ్చడిలోకి ఒక ప్రత్యేకమైన మసాలా పొడిని రెడీ చేసుకోవాలి.

మసాలా పొడి కోసం :
- మూడు టీస్పూన్లు - ధనియాలు
- ఏడెనిమిది - లవంగాలు
- నాలుగు - యాలకులు
- చిన్నముక్క - దాల్చినచెక్క
- రెండు టీస్పూన్లు - జీలకర్ర
- రెండు టీస్పూన్లు - ఆవాలు
- మిరియాలు - ఒక టీస్పూన్

- ఇందుకోసం స్టవ్ మీద పాన్‌లో ధనియాలు, లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు, జీలకర్ర, ఆవాలు, మిరియాలు వేసి సన్నని సెగ మీద దోరగా వేయించుకోవాలి.
- అవన్నీ దోరగా వేగిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకుని చల్లారాక పొడిలా గ్రైండ్ చేసుకుని పక్కనుంచాలి.
- ఇప్పుడు పది నిమిషాల పాటు నానబెట్టుకున్న మీల్ మేకర్స్‌ను కొన్ని కొన్ని చేతిలోకి తీసుకుంటూ అందులోని అదనపు వాటర్‌ను గట్టిగా పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
- అనంతరం స్టవ్ మీద అదే పాన్‌లో నాలుగు టేబుల్స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి.

- ఆయిల్ కాగిన తర్వాత వాటర్ పిండి పెట్టుకున్న మీల్ మేకర్స్‌ను వేసి లైట్ కలర్ మారేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. మీల్ మేకర్స్ మంచిగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
- తర్వాత మళ్లీ అదే పాన్‌లో ఆరు టేబుల్స్పూన్ల నూనె వేసి హీట్ చేసుకోవాలి.
- ఆయిల్ కొద్దిగా వేడయ్యాక అల్లంవెల్లుల్లి పేస్ట్‌ను వేసి కాస్త కలర్ మారేంత వరకు వేయించాలి.
- ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని క్రిస్పీగా మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి.

- ఆపై రుచికి తగినంత ఉప్పు, కారం, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి, కొద్దిగా పసుపును వేసి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
- అనంతరం ముందుగా వేయించి పెట్టుకున్న మీల్ మేకర్స్‌ను వేసి మసాలా మిశ్రమం వాటికి పట్టేలా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.
- ఆ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత చివరగా అందులో నిమ్మరసాన్ని పిండి కలిపి సర్వ్ చేసుకుంటే చాలు.
- అంతే, ఎన్నడూ తినని రుచిలో అద్భుతంగా ఉండే "మీల్ మేకర్ పచ్చడి" అప్పటికప్పుడు సింపుల్‌గా రెడీ అవుతుంది!

- ఇది నార్మల్‌గా బయట ఉంచితే ఐదారు రోజుల పాటు నిల్వ ఉంటుంది.
- అయితే, ఈ పచ్చడిని మూడ్నాలుగు నెలల నిల్వ చేసుకోవాలనుకునేవారు ఆయిల్‌ను పెంచి తీసుకోవాలి!
- ఒకవేళ మీరు తక్కువ క్వాంటిటీలో కావాలనుకుంటే మీల్ మేకర్స్‌తో పాటు ఇతర పదార్థాలను తగ్గించి తీసుకుంటే చాలు.
- మరి, నచ్చితే మీరూ రెగ్యులర్ పచ్చళ్లకు బదులుగా ఓసారి వెరైటీగా ఈ మీల్ మేకర్ పచ్చడి ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ వావ్ సూపర్ అంటూ కమ్మగా తినేస్తారు.
సండే స్పెషల్: పుల్లగా, కారంగా "గోంగూర రొయ్యల కూర" - టేస్ట్ అద్దిరిపోతుంది!
వెడ్డింగ్ స్టైల్ "బెండకాయ ఫ్రై" - కరకరలాడుతూ సూపర్‌గా ఉంటుంది!

