మైదా లేకుండానే కరకరలాడే "పునుగులు" - చల్లని వేళ తక్కువ పదార్థాలతో అప్పటికప్పుడు రెడీ!
- కూల్ వెదర్లో హాట్ హాట్‌గా నోరూరించే 'పునుగులు' - గోధుమపిండితో నిమిషాల్లోనే చేసుకోండిలా!

Published : October 29, 2025 at 2:15 PM IST
Crispy Punugulu Recipe : మనలో చాలా మంది ఇంట్లో ఇడ్లీ లేదా దోశ పిండి మిగిలితే అందులో కొన్ని సన్నని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు కలిపి పునుగుల్లా వేసుకుంటుంటారు. కానీ, అవేవీ లేకుండానూ అప్పటికప్పుడు చేసుకునే పునుగుల రెసిపీ ఒకటి ఉంది. అదే, కరకరలాడే "గోధుమపిండి పునుగులు".
చల్లని వేళ వీటి తయారీకి ఎలాంటి పప్పులూ నానబెట్టి, రుబ్బే పనిలేకుండా తక్కువ టైమ్‌లో సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా చేసి పెట్టారంటే పిల్లలైతే "వన్ మోర్ ప్లేట్ ప్లీజ్" అని అడగడం పక్కా! అలాగే, ఈ ఇన్స్టంట్ పునుగుల తయారీకి అవసరమైన ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువే. నూనె కూడా తక్కువగానే పీల్చుకుంటాయి! మరి, ఇంకెందుకు ఆలస్యం ముసురు పట్టిన వేళ గరంగరంగా ఏమైనా తినాలనిపిస్తే ఈ పునుగుల తయారీపై ఓ లుక్కేయండి.

కావాల్సిన పదార్థాలు :
- ఒక కప్పు - గోధుమపిండి
- పావు కప్పు - బియ్యప్పిండి
- ఒక కప్పు - పుల్లటి పెరుగు
- అర కప్పు - సన్నని ఉల్లిపాయముక్కలు
- పావు కప్పు - సన్నని కొత్తిమీర తరుగు
- నాలుగైదు - పచ్చిమిర్చి
- ఒక చెంచా - సన్నని అల్లం తరుగు
- అరచెంచా - జీలకర్ర
- రుచికి తగినంత - ఉప్పు
- పావుచెంచా - వంటసోడా
- వేయించడానికి సరిపడా - నూనె
కరకరలాడే "బ్రెడ్ వడలు" - ఇన్‌స్టంట్‌గా చేసుకోవచ్చు - టేస్ట్ కిర్రాక్ అంతే!
తయారీ విధానం :
- కరకరలాడే ఈ గోధుమపిండి పునుగుల కోసం ముందుగా రెసిపీలోకి కావాల్సిన పరిమాణంలో వీలైనంత సన్నగా ఉల్లిపాయలను తరుక్కుని పక్కన పెట్టుకోవాలి.
- అలాగే, సన్నని కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం తరుగును ముందుగానే రెడీ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి.
- ఇప్పుడు ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో గోధుమపిండి, బియ్యప్పిండి, ముందుగా కట్ రెడీ చేసి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ ముక్కలు, సన్నని పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం తరుగు వేసుకోవాలి.
- అలాగే, జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, వంటసోడా, పుల్లటి పెరుగు వేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి.
- ఆ తర్వాత అవసరం మేరకు తగినన్ని నీళ్లను కొద్దికొద్దిగా యాడ్ చేస్తూ పిండిని మరీ పలుచగా, గట్టిగా కాకుండా పునుగులకు కావాల్సిన కన్సిస్టెన్సీలో పిండిని కలపాలి.
- పిండిని ఆ విధంగా కలిపాక మూడ్నాలుగు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా పునుగులు గుల్లగా, మంచి టేస్టీగా వస్తాయి.
- ఆపై గిన్నెపై మూతపెట్టి పిండిని రెండు నుంచి మూడు గంటల పాటు నాననివ్వాలి. అనంతరం పిండిని మరోసారి బాగా కలిపి పక్కనుంచాలి.
యమ్మీ యమ్మీగా టేస్టీ "మసాలా బ్రెడ్ టోస్ట్" - బ్రేక్‌ఫాస్ట్, స్నాక్‌గా సూపర్ ఛాయిస్!
- ఇప్పుడు పునుగుల తయారీకి స్టవ్ మీద కడాయిలో నూనె వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మంటను తగ్గించి ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ కాగుతున్న నూనెలో చిట్టి చిట్టి పునుగుల్లా వేసుకోవాలి.
- కడాయిలో వేయించడానికి సరిపడా వేసుకున్నాక వెంటనే టర్న్ చేయకుండా కొద్దిసేపు వేగనివ్వాలి.
- ఆ తర్వాత చిల్లుల గరిటెతో అటు ఇటు తిప్పుతూ మీడియం ఫ్లేమ్‌లో అన్ని వైపులా ఎర్రగా వేయించుకోవాలి.
- అలా వేయించుకున్నాక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకొని అరనిమిషం పాటు ఉంచి ఆపై వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు.
- అంతే, గోధుమపిండితో కరకరలాడే "పునుగులు" అప్పటికప్పుడు రెడీ అవుతాయి!
- ఇక వీటిని చల్లని వేళ టమాటా చట్నీతో తింటుంటే ఆ టేస్ట్ నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టర్ అనేలా ఉంటుంది!
ఈ టిప్స్‌తో పర్ఫెక్ట్ టేస్ట్ :

- ఈ రెసిపీ కోసం గోధుమపిండి తీసుకున్న కప్పునే పెరుగు, ఇతర పదార్థాలను కొలిచి తీసుకోవడానికి వాడుకోవాలి.
- అలాగే, వంటసోడాను చూసి వేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ అది ఎక్కువైతే పునుగులు ఆయిల్‌ను ఎక్కువగా పీల్చేస్తాయని గుర్తుంచుకోవాలి.
- ఒకవేళ మీరు ఎక్కువ మొత్తంలో పునుగులు చేసుకోవాలనుకుంటే ఇదే కొలతలతో ఇంగ్రీడియంట్స్‌ను అందుకు అనుగుణంగా పెంచి తీసుకుంటే సరిపోతుంది.
- నూనె హీట్ అయ్యాక మాత్రమే పునుగులను వేసుకోవాలి. లేదంటే, ఆయిల్‌ని ఎక్కువగా పీల్చుకుంటాయని గమనించాలి.
బ్రేక్‌ఫాస్ట్‌లోకి "మరమరాల చీలాలు" - పిల్లలైతే వద్దనకుండా తినేస్తారు!



