నోరూరించే "చికెన్ తహారీ" - టేస్ట్ కా బాప్! - ఈజీగా చేసుకోండిలా
- బిర్యానీకి తీసిపోని సూపర్ రెసిపీ - ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా లాగిస్తారు

Published : February 8, 2026 at 2:20 PM IST
Chicken Tahari : చికెన్ తో చేసే రెసిపీలు కొన్ని వందల రకాలు ఉన్నాయి. అందులో కొన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరికొన్నింటికి కాస్త కష్టపడాల్సి ఉంటుంది. ఇంకొన్ని రెసిపీలు ఇంట్లో సాధ్యంకానివి కూడా ఉంటాయి. జనాలు ఇలా ఫీలయ్యే వాటిలో "చికెన్ తహారీ" ఒకటి. ఇది రెస్టారెంట్లోనే బాగుంటుందని, అక్కడే చేయడం సాధ్యమవుతుందని అనుకుంటారు మెజారిటీ జనం. కానీ, ఈ సూపర్ రెసిపీని ఇంట్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చెపుతున్న విధంగా పక్కా కొలతల ప్రకారం తయారు చేశారంటే అదరహో అన్నట్టుగా ఉంటుందీ రెసిపీ. ఇంటిల్లిపాదికీ ఎంతో బాగా నచ్చేస్తుంది! మరి, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి? ఇందుకోసం కావాల్సిన పదార్థాలేంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.
కావలసిన పదార్థాలు :
- అర కేజీ చికెన్
- 2 కప్పుల బాస్మతి బియ్యం
- 1 కప్పు ఉల్లి తరుగు
- 4 పచ్చిమిర్చి
- రుచికి తగినంత ఉప్పు
- 2 టేబుల్ స్పూన్ల నెయ్యి
- 2 టేబుల్ స్పూన్ల అల్లం-వెల్లుల్లి పేస్టు
- 3 టేబుల్ స్పూన్ల ఆయిల్
- 2 బిర్యానీ ఆకులు
- 4 లవంగాలు
- 3 యాలకులు
- అంగుళం పొడవు దాల్చినచెక్క
- 1 స్పూన్ జీలకర్ర
- 1 స్పూన్ కారం
- 1 స్పూన్ గరం మసాలా
- అర స్పూన్ షాజీరా
- 2 స్పూన్ల ధనియాల పొడి
- 2 స్పూన్ల నిమ్మరసం
- అర కప్పు టమాటా ముక్కలు
- అర కప్పు పుదీనా
- అర కప్పు కొత్తిమీర
- అర కప్పు పెరుగు
కమ్మని "చికెన్ పులిహోర" - పుల్లగా, కారంగా అద్దిరిపోతుంది - తయారీ ఈజీ!
తయారీ విధానం :
- ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బియ్యం వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. కనీసం అరగంట సేపు బియ్యం నానబెట్టుకోవాలి
- ఆ తర్వాత స్టౌ మీద కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకులు, యాలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర, లవంగాలు, షాజీరా వేసి కాసేపు ఫ్రై చేయాలి
- ఈ సమయంలో మంచి సువాసన వస్తూ ఉంటుంది. అప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని, లైట్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి
- ఇప్పుడు అందులో అల్లం పేస్టు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, తరిగిన పుదీనా, సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి
- ఆ తర్వాత మూత తీసి ఓసారి కలుపుకొని ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. మొత్తం కలుపుకొని మూత పెట్టుకోవాలి.
- కాసేపు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి ఓసారి మిక్స్ చేసుకొని కారం, ఉప్పు, ధనియాల పొడి, పెరుగు, గరం మసాలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి
- అన్నీ కలిసేలా చక్కగా కలుపుకొని మూత పెట్టి సుమారు 8 నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలి
- ఆ తర్వాత నానబెట్టిన బియ్యం వేసుకొని, అందులో 4 కప్పుల వేడి నీళ్లు పోసుకోవాలి. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని, కొత్తిమీర యాడ్ చేసుకొని, కుక్కర్ మూత పెట్టేయాలి
- స్టౌ సిమ్లోనే పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అనంతరం స్టౌ ఆపేసి, ఆవిరంతా పోయే వరకు అలా వదిలేయాలి
- ఆవిరి మొత్తం వెళ్లిపోయిన తర్వాత మూత తీసి, అందులో నిమ్మరసం, నెయ్యి కూడా వేసి మొత్తం ఓసారి మిక్స్ చేసుకోవాలి.
- అంతే, ఎంతో రుచికరంగా ఉండే "చికెన్ తహారీ" రెడీ అయిపోతుంది. దీన్ని పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి
కుక్కర్లో స్పైసీ స్పైసీగా అద్దిరిపోయే "చికెన్ కర్రీ" - సండే ఇలా వండితే ఇంటిల్లిపాదీ ఫిదా!

