"మార్కెట్లోకి కల్తీ పన్నీర్" - స్వచ్ఛతను గుర్తించే సింపుల్ చిట్కాలు ఇవే!
యథేచ్ఛగా సింథటిక్ పన్నీర్ విక్రయాలు - ఎలా గుర్తించాలో తెలుసా?

By ETV Bharat Andhra Pradesh Team
Published : April 29, 2026 at 2:46 PM IST
Paneer Quality Test : పన్నీర్ టిక్కా, పన్నీర్ మసాలా, పన్నీర్ కబాబ్! ఇలాంటి వంటకాల పేర్లు వింటేనే కొంతమందికి నోరూరిపోతుంది. అంత రుచికరమైన వంటకాల్లో కల్తీ పన్నీర్ ఉపయోగిస్తున్నారని తెలుసా? కల్తీ పన్నీర్ మార్కెట్‌ను ముంచెత్తుతోంది. అధికారులు జరుపుతున్న సోదాల్లో భారీ ఎత్తున కల్తీ పన్నీర్ నిల్వలు వెలుగు చూస్తున్నాయి. రసాయనాలు, యూరియా, డిటర్జంట్ కలిపి తయారు చేస్తున్న సింథటిక్ పన్నీర్ తక్కువ ధరకే లభిస్తుండడంతో హోటళ్లు, రెస్టారెంట్ల యాజమానులు ఆకర్షితులవుతున్నారు. మీరెప్పుడైనా హోటళ్లకు వెళ్లినపుడు, లేదా పన్నీర్ కొని తెచ్చుకున్నపుడు అది నాణ్యమైనదా లేక కల్తీనా? అనే విషయాన్ని ఇలా ధ్రువీకరించుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన చిట్కాలు పాటించడం ద్వారా కల్తీ పన్నీర్ ఈజీగా గుర్తించవచ్చు.
ఇరాన్ టు ఇండియా - "ఫలూదా" జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే?
ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహిస్తున్న దాడుల్లో కల్తీ పన్నీర్ తయారీ వెలుగులోకి వచ్చింది. పాలకు బదులుగా యూరియా, డిటర్జెంట్లు, సల్ఫ్యూరిక్ యాసిడ్ తదితర రసాయనాలు ఉపయోగించి పన్నీర్ తయారు చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి కృత్రిమ సింథటిక్ పన్నీర్ మార్కెట్లో యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. చూడడానికి తాజాగా, తెల్లని రంగులో ఆకర్షణీయంగా కనిపించడం గమనార్హం. ఆరోగ్యానికి ఎంతో నష్టం కలిగించే ఈ కల్తీని ఎలా గుర్తించాలో తెలుసా!
వాసనే లేకపోతే!
నాణ్యమైన పన్నీర్ స్వచ్ఛమైన పాల వాసన వెదజల్లుతుంది. ముక్కు దగ్గర పెట్టుకుంటే మంచి వాసన ఇస్తుంది. కానీ, కల్తీ పన్నీర్ పుల్లటి వాసన వస్తుంది. లేదా ఎలాంటి వాసన లేకపోయినా సరే కల్తీ అని తెలుసుకోవాలి.
రబ్బరులా సాగితే!
పాలతో తయారు చేసే పన్నీర్ మృదువుగా ఉంటుంది. వేళ్లతో నొక్కి చూస్తే ముక్కలైపోతుంది. కానీ, కల్తీ పన్నీర్ రబ్బరులా సాగుతుంది. నొక్కినపుడు గుంతలు పడకుండా తిరిగి యథాస్థానానికి వస్తుందంటే కల్తీ జరిగినట్టే. ముక్క విరగకుండా గట్టిగా ఉంటుంది.
నీళ్లలో మరిగిస్తే!
కల్తీ పన్నీర్‌ను తేలికగా గుర్తించే కచ్చితమైన పద్ధతి ఇది. కొద్దిగా పన్నీర్ నీళ్లలో మరిగించి చల్లార్చాలి. ఆ తర్వాత అందులో అయోడిన్ టింక్చర్ చుక్కలు వేస్తే చాలు! ఆ పన్నీర్ ముక్క రంగు మారితే కల్తీది అన్నట్లే. నీలం లేదా నలుపు రంగులోకి మారితే బరువు పెంచడానికి గంజి కలిపారని అర్థం. అసలైన పన్నీర్ రంగులో ఎలాంటి మార్పు ఉండదని తెలుసా?
వాసన తేడా కొడితే!
చిన్న పన్నీర్ ముక్కను ముందుగా పెనం మీద వేడి చేయాలి. నాణ్యమైన పన్నీర్ వేడి తగలగానే మెత్తబడి పాల వాసన వెదజల్లుతుంది. కానీ, కల్తీ పన్నీర్ సువాసనకు బదులుగా దర్వాసన వస్తుంది. వేడి చేస్తే రబ్బరులా సాగిపోతుంది. నురగ, నూనె లాంటి పదార్థాలు విడదల చేస్తుంది.
రంగు మారితే!
పాలతో తయారయ్యే స్వచ్ఛమైన పన్నీర్ లేత తెలుపు లేదా మీగడ రంగులో ఉంటుంది. కానీ, సింథటిక్ పన్నీర్ తెల్లని పాలలా కనిపిస్తుంది. తెల్లగా కనిపించడానికి బ్లీచింగ్ ఏంజెట్లు కలుపుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. కల్తీ పన్నీర్ రంగు ఆకర్షణీయంగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు.
ఆకారంలో మార్పు కనిపిస్తే!
స్వచ్ఛమైన పన్నీర్ గుర్తించాలంటే ముందుగా ఓ ముక్క తీసుకుని గోరువెచ్చని నీళ్లలో వేసి చూడాలి. నీరు పాలలా తెల్లగా మారినా, పన్నీర్ ముక్క కరిగిపోతున్నా అందులో సింథటిక్ పాలు లేదా పౌడర్ కలిపినట్లు అనుమానించాలి. అసలైన పన్నీర్ నీటిలో ఉన్నా కరగదు, తన ఆకారాన్ని కోల్పోదు.
సమ్మర్లో బయటకి వెళ్తున్నారా? - ఈ వస్తువులతో చల్లదనం మీ వెంటే!
మండుటెండల్లో మజానిచ్చే "లెమన్ పంచ్" - ఒక్కో సిప్ తాగుతుంటే ఆ కిక్కే వేరు!

