"పాల ప్యాకెట్" కొంటున్నారా? - క్వాలిటీ విషయంలో ఈ టిప్స్ మీ కోసమే!
వెలుగుచూస్తున్న కల్తీ పాల ఘటనలు - స్వచ్ఛత కోసం ఇవి పరిశీలించండి!

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 4, 2026 at 3:58 PM IST
|Updated : March 4, 2026 at 4:44 PM IST
How to identify quality milk : పట్టణాలు, నగరాల్లో తెల్లవారకముందే ఇంటి గేటు దగ్గర ఏర్పాటు చేసుకున్న బుట్టల్లో పాల ప్యాకెట్ రెడీగా ఉంటుంది. చాలా మందికి ఉదయం టీ, కాఫీ తాగనితే రోజు ప్రారంభం కాదు. వీటికి తోడు పెరుగు, మజ్జిగ కావాలన్నా ఇంట్లో పాల వినియోగం తప్పనిసరి. అయితే, డిమాండ్‌కు తగ్గట్లుగా ఉత్పత్తి, సరఫరా లేకపోవడంతో పాల వ్యాపారులు కల్తీ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. రసాయనాలు, ఇతర పదార్థాలు వినియోగించి కృత్రిమ పాలతో ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. గతంలో నీళ్లు కలపడం వరకే పరిమితమైన కల్తీ ఇపుడు పశువులు లేకుండానే తయారు చేసే స్థాయికి ఎదగడం ఆందోళన కలిగిస్తోంది.
"హర్మూజ్ జలసంధి" మూసేస్తే ఏం జరుగుతుంది? - ఇరాన్‌కు అది సాధ్యమేనా?
రోజూ గ్లాసు పాలు తాగితే ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు సలహా ఇస్తుంటారు. కానీ, ఇపుడు అవే పాలతో అనారోగ్యం కొనితెచ్చుకుంటున్న దుస్థితి నెలకొంది. ఏవి స్వచ్ఛమైనవి? ఏవి కల్తీ?! తెలియక జనం అభద్రతకు లోనవుతున్నారు.
పాల ప్యాకెట్ కొనితెచ్చుకునే సమయంలో కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్యాకెట్‌పై ముద్రించే సమాచారం వాటి స్వచ్ఛతను సూచిస్తుందని పేర్కొంటున్నారు. తద్వారా డబ్బు ఆదా కావడంతో పాటు ఆరోగ్యం కూడా కాపాడుకోవచ్చని చెప్తున్నారు. అవేంటో తెలుసుకుందామా!
- గడువు తేదీ : పాల ప్యాకెట్లను కొనేటప్పుడు కచ్చితంగా తేదీని గమనించాలి. తయారీ, గడువు తేదీలను పరిశీలించాలి. గడువు తేదీకి కనీసం ఒక్క రోజు ముందుగా అయినా మీరు కొనుక్కోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో గడువుమీరిన పాల ప్యాకెట్లను కొనుగోలు చేయొద్దు. అవి మేలు చేయకపోగా, విష తుల్యమై ఆరోగ్యం దెబ్బతింటుంది.
- పాల ప్యాకెట్లపై ఫుల్ క్రీమ్, టోన్డ్ లేదా డబుల్ టోన్డ్ అని రాసి ఉంటుంది. అందులో మీకు కావలసిన పాల రకాన్ని ఎంచుకోవాలి. పిల్లలకు, పెరుగు తోడు పెట్టడానికి అయితే ఫుల్ క్రీమ్ పాలు తీసుకోవడం ఉత్తమం. ఈ రకం పాలల్లో కొవ్వు పదార్థాలు అధికంగా ఉంటాయి. గుండె జబ్బులున్న వారు ఈ పాలకు దూరంగా ఉండాలని వైద్యులు చెప్తుంటారు.
- రోజువారీ టీ, కాఫీ కోసం తక్కువ కొవ్వు కలిగిన టోన్డ్ పాలు మేలు. ప్రాసెస్ చేయడం ద్వారా పాలల్లో కొవ్వు పదార్థాలను వేరు చేస్తారు.
- బరువు తగ్గాలనే వారు, గుండె జబ్బులు ఉన్నవారికి డబుల్ టోన్డ్ పాలు మంచివి. వీటిలో కొవ్వు పదార్థాలు ఉండవు.
- పాల ప్యాకెట్ పై FSSAI లోగో, లైసెన్స్ నంబర్ ఉన్న బ్రాండ్లు మాత్రమే ఎంచుకోవాలి. ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ఆహార పదార్థాలకు మాత్రమే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) లోగో ముద్రించే అవకాశం ఉంది.
- పాల ప్యాకెట్ ఎట్టి పరిస్థితుల్లోనూ తడిగా లేదా జిగటగా ఉండకూడదని గుర్తుంచుకోండి.
- సీల్, లీకేజ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లీకేజీ ఉంటే కల్తీ చేశారని తెలుసుకోవాలి. సీల్ దగ్గర పాల చుక్కలు కనిపిస్తే ప్యాకెట్‌లోకి గాలి చేరిందని అర్థం. దీంతో పాలు విరిగిపోతాయి.
- పాల ప్యాకెట్లను 4లేదా అంతకంటే తక్కువ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఆరు బయట పెట్టి అమ్ముతుంటారు. అలాంటి పాలు త్వరగా చెడిపోతాయి. ఫ్రీజర్‌లో నిల్వ చేయని ప్యాకెట్లు, సూర్యరశ్మికి గురై వైడెక్కిన ప్యాకెట్లలోని పాలు త్వరగా పాడైపోతాయి.
- పాల ప్యాకెట్ ఉబ్బినట్లు కనిపిస్తే పక్కన పెట్టండి. అలాంటి పాలు ఆరోగ్యానికి హానికరం.
- స్వచ్ఛత గుర్తు (హోలోగ్రామ్ లేదా QR కోడ్): అనేక ప్రధాన బ్రాండ్లు ఇప్పుడు కల్తీని నిరోధించడానికి ప్యాకెట్లపై QR కోడ్ లేదా ప్రత్యేక హోలోగ్రామ్ ముద్రిస్తున్నాయి. పాల స్వచ్ఛత, తయారీ, నిల్వ సమాచారం కోసం స్కాన్ చేసి తెలుసుకోవచ్చు.
విద్యార్థులకు "ఇస్రో" బంపర్ ఆఫర్ - ప్రత్యేక శిక్షణతో పాటు ప్రయాణం, భోజనం, వసతి ఉచితం!
ఛలో "చార్ధామ్" - ఏ ఆలయం ఎప్పుడు తెరుచుకుంటుందో తెలుసా? తేదీలు వచ్చేశాయి!

