డోర్‌మ్యాట్‌లు ఎలా సెలెక్ట్ చేస్తున్నారు? - ఎలా క్లీన్ చేస్తున్నారు? - ఈ విషయాలు తెలుసుకోండి!
-డోర్‌మ్యాట్‌లు శుభ్రంగా లేకపోతే శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు - ఈ క్రమంలోనే వాటిని ఎలా క్లీన్ చేయాలో వివరిస్తున్న నిపుణులు!

Published : July 3, 2026 at 5:06 PM IST
How to Clean Doormats: చాలా మంది ఇంటిని తరచూ క్లీన్ చేస్తుంటారు. కానీ కాళ్ల ద్వారా వచ్చే దుమ్ము, ధూళీ, తేమ వంటి వాటిని ఇంటిలోపలికి చేరకుండా అడ్డుకునే డోర్‌మ్యాట్స్ విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటారు. ఏదో పైపైన దులిపి ఉతకకుండానే మళ్లీ వాడుతుంటారు. అయితే, డోర్ మ్యాట్స్ని శుభ్రం చేయకుండా ఎక్కువ రోజులు అలాగే వాడడం వల్ల వాటిపై దుమ్ము-ధూళి చేరి మురికిగా కనిపిస్తుంటాయని.. పైగా అలాంటి వాటి వల్ల శ్వాసకోశ, చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. కాబట్టి, తరచుగా ఇంటిని శుభ్రం చేసుకోవడం మాత్రమే కాకుండా డోర్ మ్యాట్స్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే డోర్‌మ్యాట్స్ ఎంచుకునే విషయంలో, క్లీనింగ్ విషయంలో ఈ జాగ్రత్తలు మేలు చేస్తాయంటున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
డోర్ మ్యాట్స్‌ను ఎలా సెలెక్ట్ చేయాలి: కాళ్ల కింద వేసేవే కదా అని చాలా మంది డోర్‌మ్యాట్స్‌ను ఎంచుకోవడంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే డోర్‌మ్యాట్‌లు అందంగా ఉండాలని.. సౌకర్యాన్నీ ఇవ్వాలంటున్నారు నిపుణులు. అలాంటి వాటినే ఎంచుకోవాలంటున్నారు. ముఖ్యంగా ప్రధాన ద్వారం దగ్గర రబ్బర్, కాయిర్, నైలాన్‌తో చేసినవి ఎంచుకుంటే మురికి, దుమ్ము, నీళ్లు బాగా పీల్చుకుంటాయంటున్నారు. పైగా ఇవి వర్షంలో తడవవని చెబుతున్నారు. ఇక లోపలి తలుపు దగ్గర కాటన్, మైక్రోఫైబర్ వంటి రకాల్ని ఎంచుకుంటే మెత్తగా ఉంటాయని. ఇంటికీ అందాన్నిస్తాయంటున్నారు.
ఇక మ్యాట్‌లను వంట గది ముందే కాకుండా ఫ్లోర్ మీద కూడా వేయాలంటున్నారు. పైగా నీళ్లు, ఆహార వ్యర్థాలు చిమ్మినా జారకుండా సులువుగా శుభ్రం చేసుకునేలా అవి ఉండాలంటున్నారు. ఇందుకోసం రబ్బర్ బ్యాకింగ్ ఉన్న మైక్రోఫైబర్ రకాలు, పీవీసీ షీట్స్ మేలంటున్నారు. ఇక, బాత్రూమ్ దగ్గర తప్పనిసరిగా మెమరీ ఫోమ్, మైక్రోఫైబర్‌వి సరైన ఎంపిక అంటున్నారు.
ఎలా క్లీన్ చేసుకోవాలి:
- తేమ వల్ల కార్పెట్ ఫైబర్లలోకి దుమ్ము సులువుగా చేరుతుందని.. కాబట్టి వారానికి రెండు సార్లు వ్యాక్యూమ్ క్లీనర్ ఉపయోగించడం మంచిదంటున్నారు.
- డోర్‌మ్యాట్‌లు, చిన్న కార్పెట్లను వీలైనప్పుడల్లా ఎండలో వేయడం వల్ల తేమ, దుర్వాసన తొలగిపోతాయంటున్నారు. లేదంటే కాస్త బేకింగ్ సోడా చల్లి అరగంట తర్వాత వ్యాక్యూమ్ చేస్తే సరిపోతుందని అంటున్నారు.
- వేడి నీటితో ఇలా చేయండి: డోర్ మ్యాట్స్ క్లీనింగ్ విషయంలో ఈ పద్ధతి చాలా బాగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఒక వెడల్పాటి బకెట్లో తగినన్ని వేడి నీటిని తీసుకుని అందులో మ్యాట్స్ వేసి అవి మునిగేలా అరగంటపాటు నాననివ్వాలని చెబుతున్నారు. అనంతరం మరో బకెట్లో నార్మల్ వాటర్ తీసుకొని నానబెట్టుకున్న వాటిని బాగా శుభ్రం చేసుకోవాలంటున్నారు. ఇలా చేయడం ద్వారా వాటిలో ఉండే దుమ్ము, ధూళి సగం మేర తొలగిపోతాయని చెబుతున్నారు. తక్కువ దుమ్ము ఉన్నవైతే ఒక్కసారికే శుభ్రంగా క్లీన్ అవుతాయని.. మురికి ఎక్కువగా ఉన్నట్లయితే నానబెట్టిన తర్వాత ఉతికితే మురికి వదిలి కొత్తవాటిలా మెరుస్తాయంటున్నారు.
- బేకింగ్ సోడా: బేకింగ్ సోడాతో కూడా డోర్‌మ్యాట్స్‌ను క్లీన్ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం కొన్ని గోరువెచ్చని నీటిలో కొద్దిగా డిటర్జెంట్ పౌడర్, బేకింగ్ సోడా లేదా వెనిగర్ వేసి మిక్స్ చేయాలి. అనంతరం అందులో క్లీన్ చేయాలనుకుంటున్న డోర్ మ్యాట్స్ని వేసి గంటపాటు నానబెట్టుకోవాలి. అనంతరం వాటిని నార్మల్ వాటర్‌తో బాగా శుభ్రం చేసుకుని ఎండలో ఆరబెట్టి యూజ్ చేస్తే చాలంటున్నారు.
ఇల్లు శుభ్రం చేయాలని అనుకుంటున్నారా? - ఈ తప్పులు లేకుండా చూసుకోవాలంట!
స్నీకర్స్ వాడుతున్నారా? - ఇలా క్లీన్ చేస్తే కొత్తవాటిలా మెరిసిపోతాయి!

