ETV Bharat / offbeat

ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారా? - ఈ ఆప్షన్ ఎంచుకుంటే బెర్త్ ఖాయం!

రిజర్వేషన్ వెయిటింగ్ జాబితాలో ఉన్నా - బెర్త్ గ్యారెంటీకి హామీ!

how_to_book_ticket_in_irctc
how_to_book_ticket_in_irctc (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 18, 2026 at 10:16 AM IST

3 Min Read
Choose ETV Bharat

How to Book Ticket in IRCTC : పండుగలు, సెలవు రోజుల్లో రైళ్లలో రద్దీ అధికంగా ఉంటుంది. దీంతో రైలు టికెట్ బుకింగ్ సమయంలో "వెయిటింగ్ లిస్ట్" లేదా "RAC" అనే పదాలను ఎక్కువగా వింటుంటాం. బెర్త్ కన్ఫర్మేషన్ కోసం రైలు బయల్దేరడానికి ముందుగా చార్ట్ వెల్లడించే వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు "బెర్త్‌ కన్ఫర్మేషన్‌" అవకాశాలు పెంచుకోవడానికి "వికల్ప్‌"ని వినియోగించుకోవాలని రైల్వే యంత్రాంగం సూచిస్తోంది. టికెట్ బుకింగ్ సమయంలో ఈ ఆప్షన్ ఎంచుకోవడం వల్ల ఒకే రూట్​లో వెళ్లే వేర్వేరు రైళ్లలో బెర్త్‌ లభించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఉదాహరణకు ఒకే గమ్యస్థానానికి బయల్దేరే వేర్వేరు రైళ్లు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, చర్లపల్లి స్టేషన్ల నుంచి నడుస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. ఇలా వేర్వేరు స్టేషన్ల నుంచి బయల్దేరే రైళ్లలోనూ బెర్త్‌ దొరికే అవకాశం మెరుగుపడుతుందని చెప్తున్నారు.

లంచ్​లోకి ఏం చేయాలో తోచనపుడు ఇలా ట్రై చేయండి - పిల్లలు, పెద్దలు టేస్టీగా తింటారు!

వికల్ప్ అంటే ఏమిటి?

రైలులో బెర్త్‌లు ఖాళీ లేనప్పుడు వెయిటింగ్‌ లిస్ట్‌ లేదంటే RAC అవకాశాలుంటాయి. మనకంటే ముందుగా రిజర్వ్ చేసుకున్న వారు తమ టికెట్ రద్దు చేసుకుంటే ఆ తర్వాత ఉన్న వారికి సీటు కేటాయిస్తారు. కానీ, చివరివరకూ టికెట్‌ కన్ఫర్మ్‌ అవకాశాలు లేని పరిస్థితుల్లో "వికల్ప్‌" ఉపయోగపడుతుంది. అదే మార్గంలో ప్రయాణిస్తున్న ఇతర రైళ్లలో ప్రయాణానికి అవకాశం కల్పిస్తారు. వాటిలో బెర్త్‌లు ఖాళీగా ఉంటే సీటు కేటాయించడమే దీని ఉద్దేశం.

"కన్ఫర్మ్‌ టికెట్‌" అవకాశం పెరుగుతుంది

హైదరాబాద్‌ నుంచి దిల్లీకి వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో మీరు టికెట్ బుక్ చేశారంటే వెయిటింగ్‌ లిస్ట్‌ ఉందనుకుందాం. బుకింగ్ టైంలో మీరు వికల్ప్ ఎంచుకుంటే అదే మార్గంలో వెళ్లే మరో రైలు "దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ లేదా రాజధాని"లో సీట్లు ఖాళీగా ఉంటే ఆటోమెటిక్‌గా సీటు కన్ఫామ్ అవుతుంది. ఇలా సికింద్రాబాద్‌ స్టేషన్‌ మాత్రమే కాకుండా సమీపంలోని నాంపల్లి, చర్లపల్లి, కాచిగూడ నుంచి వెళ్లే రైళ్లకు మీ టికెట్ మళ్లించే అవకాశం ఉంది. తత్కాల్‌లో వెయిటింగ్‌ వచ్చినా వికల్ప్ ఉపయోగపడుతుంది. కానీ, తత్కాల్‌ విషయంలో ఛార్జీ రీఫండ్‌ వర్తించదు.

ఇవి తెలుసుకోవాలి.

  • వికల్ప్‌ ఆప్షన్ ఎంచుకుంటే వేరే రైలులో బెర్త్‌ లభించే అవకాశాలు ఉంటాయి కానీ, తప్పనిసరిగా లభిస్తుందన్న గ్యారెంటీ ఉండదు.
  • IRCTC వెబ్‌సైట్, యాప్‌ ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకునే వారికి మాత్రమే ఈ అవకాశం. మీరు ఎంచుకున్న రైలు కాకుండా మరో రైలులో బెర్త్‌ కేటాయిస్తే రద్దు ఛార్జీలు ఆ రైలు, బెర్త్‌ స్థితిపై ఆధారపడి ఉంటాయని తెలుసుకోవాలి.
  • వికల్ప్‌ ద్వారా మరో రైలులో బెర్త్‌ కన్ఫర్మ్‌ అయితే ఒరిజినల్‌ రైలు నిరీక్షణ జాబితాలో వారి పేర్లు ఆటోమేటిక్ గా తొలగిపోతాయి.
  • వికల్ప్ ద్వారా ఇతర రైలులో బెర్త్‌ కేటాయించినా ప్రయాణించకపోతే రీఫండ్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండడం ప్రయాణికులకు కలిసొచ్చే అంశం.

8 గంటల ముందుగా ప్రత్యామ్నాయ మార్గాలు

హైదరాబాద్ - సికింద్రాబాద్ సహా సమీపంలోని రైల్వే స్టేషన్ల నుంచి నిత్యం సుమారు 2 లక్షల మంది ప్రయాణిస్తున్నారని, అందులో వికల్ప్‌ను చాలా తక్కువ మంది ఎంచుకుంటున్నారని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో శ్రీధర్ తెలిపారు. 2 నెలల ముందే అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకునే అవకాశం ఉండటంతో వికల్ప్ ఎంచుకుంటే బెర్త్ కన్ఫార్మ్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వివరించారు. పైగా ఎనిమిది గంటల ముందుగా చార్ట్‌ సిద్ధమవుతుండటంతో బెర్త్‌ లభించకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవచ్చని శ్రీధర్ తెలిపారు.

ఘుమఘుమలాడే "మష్రూమ్ కర్రీ" - కొత్త వాళ్ల కోసం సింపుల్ పద్ధతి!

నోటికి కొత్త రుచినిచ్చే "టమోటా మెంతి సోయా కర్రీ" - కొత్తవాళ్లైనా ఇలా సింపుల్​గా చేసేయొచ్చు!