ETV Bharat / offbeat

హిమానీనదాలు - 200 కోట్ల మంది భద్రతకు ముప్పు!

- హిమాలయాలపై నివేదిక ఇచ్చిన ICIMOD - గత 30 ఏళ్లలో ఏకంగా 12% తగ్గిన సరస్సుల వైశాల్యం

Himalayan glaciers
Himalayan glaciers (eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : September 2, 2026 at 5:07 PM IST

2 Min Read
Choose ETV Bharat

Himalayan glaciers : నేపాల్​లో హిమానీ నదాలు సృష్టించిన విధ్వంసం యావత్ ప్రపంచాన్నే షాక్​కు గురిచేసింది. ఈ నేపథ్యంలోనే హిమాలయాల ద్వారా భవిష్యత్తులో పొంచి ఉన్న ముప్పును నేపాల్లోని కాఠ్​మండూ కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెయిన్ డెవలప్మెంట్ (ICI MOD) నివేదిక వెల్లడిస్తోంది. కేవలం 2011 నుంచి 2020 మధ్య కాలంలోనే హిందూకుష్ హిమాలయాల పరిధిలోని హిమానీనదాలు.. గత దశాబ్దంతో పోలిస్తే ఏకంగా 65% వేగంగా కరిగిపోయాయని వెల్లడించింది. ఈ పరిస్థితి రాబోయే రోజుల్లో ఎంతటి ముప్పు ఉందో వెల్లడిస్తోందని నివేదిక పేర్కొంది.

హిందూకుష్ హిమాలయ పర్వతాల నడుమ దాదాపు 24 కోట్ల మంది నివసిస్తున్నారు. వీరి తాగునీటి అవసరాలను హిమానీనద సరస్సులే తీరుస్తున్నాయి. అంతేకాదు, హిమాలయాల దిగువన నివసిస్తున్న సుమారు 175 కోట్ల మంది తాగు, సాగునీటి అవసరాలను కూడా అవే తీరుస్తున్నాయి. వీటినే గ్లేసియర్ లేక్స్ అంటారు. గంగ, బ్రహ్మపుత్ర, సింధు వంటి 12 నదులు ప్రజలకు ఆహారభద్రతను అందిస్తున్నాయి. అలాంటి హిమానీనదాలు ఊహించిన దానికన్నా వేగంగా కరిగిపోతున్నాయి. దీంతో భవిష్యత్తు ఎలా ఉంటుందోననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

రోజురోజుకూ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, కర్బన ఉద్గారాలే ఈ పరిస్థితికి ప్రధాన కారకాలుగా నివేదిక స్పష్టం చేసింది. ఇదేవిధంగా కొనసాగితే ఈ శతాబ్దం చివరి నాటికే హిమాలయన్ మంచులో ఏకంగా 80 శాతం కరిగిపోయే ప్రమాదం ఉందని ఐసీఐ ఎంఓడీ హెచ్చరించింది. హిమాలయాలు ఏర్పడడానికి వేల సంవత్సరాలు పట్టింది. అన్నేళ్లనాటి హిమానీనదాలు ఒక్కసారిగా కరుగుతూ పోతే ఎంతటి విపత్తులు వస్తాయో చెప్పడానికి, నేపాల్ వరద బీభత్సమే నిదర్శనమని నివేదిక తేల్చి చెబుతోంది.

గడిచిన 30 ఏళ్లలో అంటే.. 1990 నుంచి 2020 మధ్య కాలంలో హిమానీనదాల వైశాల్యం దాదాపు 12 శాతం మేర తగ్గిపోయిందని నివేదిక వెల్లడించింది. కిలోమీటర్లలో చూస్తే ఇది ఏకంగా 7,300 చదరపు కిలోమీటర్లు. అంతేకాదు.. మంచు పరిమాణం, నీటి నిల్వలు కూడా 9 శాతం క్షీణించాయని ఈ నివేదిక పేర్కొంది.

మరికొన్ని కీలకమైన అంశాలు :

ఈ నివేదికలో మరికొన్ని కీలకమైన అంశాలను నివేదిక వెల్లడించింది. హిమాలయాల్లో అత్యంత ప్రమాదకరమైన సరస్సులు ఏకంగా 200 వరకు ఉన్నాయి. కానీ, వాటిలో కేవలం ఐదు సరస్సులకు మాత్రమే పర్మనెంట్ పర్యవేక్షణ కేంద్రాలు ఉన్నాయి.

ఈ సరస్సుల చుట్టూ కేవలం 10 కిలోమీటర్ల పరిధిలోనే ఏకంగా 10 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు.

హిమాలయాల్లో రాబోయే 2100 సంవత్సరం నాటికి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలు పెరిగాయంటే.. మంచు సగం మాత్రమే మిగులుతుందట. ఒకవేళ వేడి 3 డిగ్రీలకు పెరిగితే ఒక వంతు మంచు మాత్రమే మిగిలే అవకాశం ఉందట.

ప్రస్తుతం హిమానీనదాలు కరుగుతున్న తీరు చూస్తే రాబోయే 2050 వరకు ఈ ప్రవాహాలు వేగంగా ఉంటాయట. ఆ తర్వాత నీటి కొరత ఏర్పడుతూ ప్రవాహాలు తగ్గిపోతాయట. ఈ పరిస్థితి.. ఈ నదులపై ఆధారపడ్డ వారి జీవితాలను, ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేయనుంది.