ETV Bharat / offbeat

హిమాలయాల్లో దర్శనమిచ్చిన "కాస్పియన్ కోబ్రా" - ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము!

నాగుపామును మించిన విషం - మధ్య ఆసియాకు చెందిన అరుదైన పాము ఇండియాలో ప్రత్యక్షం

caspian_cobra
caspian_cobra (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 2, 2026 at 5:18 PM IST

2 Min Read
Choose ETV Bharat

Caspian Cobra : వన్యప్రాణుల ప్రపంచంలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లా ఎగువ ప్రాంతంలో ఒక అరుదైన కాస్పియన్ నాగుపాము అటవీ అధికారుల కంటపడింది. ఇది ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన నాగుపాముల సమూహాలలో ఒకటి. పరిమాణం, ప్రవర్తన రెండింటిలోనూ సాధారణ భారతీయ నాగుపాములకు భిన్నంగా ఉంటుంది. పెద్ద తల, విలక్షణమైన రూపం కలిగిన ఈ విషపూరిత సర్పం హిమాలయాల్లోనే కాదు! ఇండియాలోనే ఇప్పటివరకు కనిపించలేదు. తాజాగా హిమాచల్ అడవులలో కనిపించడం జీవవైవిధ్య పరిణామంలో కీలకంగా భావిస్తున్నారు. ఫారెస్ట్ గార్డ్ గజేంద్ర వర్మ ఈ అరుదైన పాము వీడియోను చిత్రీకరించగా, ఈ విషయాన్ని అటవీ శాఖ ధ్రువీకరించింది.

కాస్పియన్ కోబ్రా (నాజా ఆక్సియానా) దాని పెద్ద తల, భారీకాయం, దూకుడు స్వభావానికి ప్రసిద్ధి చెందింది. హిమాలయ ప్రాంతంలో ఈ జాతి పాము కనిపించడం అత్యంత అరుదు. ఇది వన్యప్రాణుల సంరక్షణకు, జీవవైవిధ్యానికి చాలా ముఖ్యమైనదని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

"గాంధీజీ" శాలువాలో దాగిన రహస్యం - రూ.500 నోట్లలో ఈ సీక్రెట్ మీరు గమనించారా?

caspian_cobra
caspian_cobra (ETV Bharat)

చంబా జీవవైవిధ్యంపై దాదాపు 20 ఏళ్లుగా పనిచేస్తున్న ఫారెస్ట్ రేంజర్ గజేంద్ర వర్మ అడవుల్లోని వన్యప్రాణులను నిత్యం పర్యవేక్షిస్తుంటారు. రోజువారీ విధుల్లో భాగంగా కొన్ని రోజుల కిందట ఆయన ఇంతకు ముందెన్నడూ చూడని ఒక విలక్షణమైన పామును గమనించారు. ఆ పాము పెద్ద తల, బుసలు కొట్టే తీరు ఆయనకు ప్రత్యేకంగా అనిపించాయి. ఆయన వెంటనే దాని వీడియోను రికార్డ్ చేశారు. ఆ తర్వాత, నిపుణులు జరిపిన సమగ్ర విశ్లేషణ అనంతరం అది ప్రపంచంలోనే అత్యంత అరుదైన జాతులలో ఒకటైన 'కాస్పియన్ కోబ్రా' అని అటవీ శాఖ నిర్ధారించింది.

కాస్పియన్ నాగుపాము ప్రత్యేకత ఏమిటి?

కాస్పియన్ నాగుపాము ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన నాగుపాము జాతులలో ఒకటి. ఇది సాధారణ భారతీయ నాగుపాము కంటే పరిమాణంలో, ప్రవర్తనలో భిన్నంగా ఉంటుంది. దాని పెద్ద తల, దృఢమైన శరీరాకృతి ద్వారా గుర్తించవచ్చు. ఈ జాతి సాధారణంగా మధ్య ఆసియా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, తుర్క్‌మెనిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, పాకిస్తాన్​లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. హిమాలయ ప్రాంతంలో దీని ఉనికి అత్యంత అరుదు. కాస్పియన్ కోబ్రా 'అంతరించిపోయే ప్రమాదానికి దగ్గరగా ఉన్న జాతి'గా జాబితాలో ఉంది.

ఇక్కడికి ఎలా వచ్చింది?

చంబాలో కాస్పియన్ జాతి నాగుపాము కనిపించడం అనేక కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోందని అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇక్కడికి ఎలా వచ్చింది? దానికి ఈ ప్రాంతంలో శాశ్వత నివాసం ఉందా? లేక ప్రత్యేక పరిస్థితుల కారణంగా వచ్చిందా? అనే విషయాలను నిర్ధారించడానికి నిపుణులు ప్రయత్నిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి రాబోయే రోజుల్లో శాస్త్రీయ అధ్యయనాలు, క్షేత్ర సర్వేలు నిర్వహించే అవకాశం ఉంది.

EPFO కొత్త రూల్ - 20 రోజుల్లో క్లెయిమ్‌ సెటిల్‌ చేయకుంటే 12శాతం జరిమానా!

"అరుణాచలం వీక్లీ ఎక్స్‌ప్రెస్" రెగ్యులర్ - స్టేషన్లు, సమయాలు ఇవే!