హెలికాఫ్టర్‌తో వ్యవసాయం చేస్తున్నాడు! - ఏడాదికి రూ.75 కోట్ల ఆదాయం!
- బ్యాంకు మేనేజర్ ఉద్యోగం వదిలిపెట్టి.. పొలం మడిలోకి అడుగుపెట్టి - హైటెక్ అగ్రికల్చర్ తో అబ్బురపరుస్తున్న ఛత్తీస్ గఢ్ కిసాన్!

Published : June 3, 2026 at 3:01 PM IST
Helicopter farmer : పురాతన వ్యవసాయం అంటే.. ఎద్దులు నాగళ్లు. ఆ తర్వాత ట్రాక్టర్లు, యంత్రాలు. ఇప్పుడు డ్రోన్లు కూడా రంగప్రవేశం చేశాయి. కానీ, హెలికాఫ్టర్ తో వ్యవసాయం చేయడం మీకు తెలుసా? తెలియదు అంటే మాత్రం "రాజారామ్ త్రిపాఠీ" గురించి తెలుసుకోవాల్సిందే. హెలికాఫ్టర్ ద్వారా సాగుచేస్తున్న ఆయన.. ఏడాది సంపాదన ఎంతో తెలుసా? ఏకంగా రూ.75 కోట్లపైనే! మరి, హైటెక్ అగ్రికల్చర్ ను మించిన ఈ వ్యవసాయం ఎలా చేస్తున్నారో ఓసారి చూసివద్దామా?
ఒక వ్యక్తికి సొంతం హెలికాప్టర్ ఉందంటే అతను ఎవరై ఉంటారు? పెద్ద బిజినెస్ మేన్ లేదంటే పొలిటికల్ లీడర్ కాదంటే కోటానుకోట్ల సంపద ఉన్న సెలబ్రిటీ అనుకుంటాం. కానీ, ఒక రైతుకు చాపర్ ఉందంటే నమ్ముతారా? అదే ఆశ్చర్యం అంటే.. ఆయన అదే హెలికాప్టర్ వాడుతూ పొలంలో వ్యవసాయం చేస్తున్నారు!
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ఏరియాకు చెందిన రాజారామ్ నేపథ్యం కూడా ఆశ్చర్యకరంగా ఉంటుంది. స్కూల్ టీచర్ కొడుకైన ఆయన.. ఇంటర్నేషనల్ కార్పొరేట్ లాలో డిగ్రీ చేశారు. తర్వాత మరో 5 PGలు చదివారు. కొన్నాళ్లు కాలేజీ ప్రొఫెసర్‌గా, అనంతరం SBI మేనేజర్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే ఆయన దృక్పథం మారింది. బ్యాంక్ మేనేజర్‌గా పనిచేసే టైమ్‌లో అప్పులపాలైన అన్నదాతలు వేలంలో భూములను కోల్పోవడం చూశారు. తన తండ్రి కూడా ట్రాక్టర్ అప్పు తీర్చడానికి పడిన కష్టాలు చూశారు. ఇవన్నీ ఆయనను వ్యవసాయంలో ప్రయోగాల వైపు నడిపించాయి.
ఉద్యోగం చేస్తూనే :
బ్యాంకు జాబ్ చేస్తూనే పొలం మడిలో అడుగుపెట్టారు రాజారామ్. కొని తొలిప్రయత్నంలో టమాటా, క్యాబేజీ రూపంలో నష్టాలే వెల్కమ్ చెప్పాయి. దాన్నొక పాఠంలా తీసుకొని ముందుకు సాగారు. ఈ సారి రూట్ మార్చారు. రూ.22 లక్షల రుణం తీసుకొని వరల్డ్ వైడ్‌గా ఔషధాల తయారీలో ఉపయోగించే "వైట్‌ముస్లి" (తెల్ల నేలతాడి) మొక్కలను పండించారు. మలి ప్రయత్నం సక్సెస్ ఇచ్చింది. ఆ తర్వాత అశ్వగంధ వంటి ఔషధ మొక్కలను పండిస్తూ.. ఎకరానికి రూ.6 లక్షల రాబడి కళ్లజూశారు. ఆ లాభాలతో మరో 30 ఎకరాల భూమి కొన్నారు.
అలా విస్తరణ ప్రారంభించారు. "కాంట్రాక్ట్ ఫార్మింగ్" మొదలు పెట్టారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి ఎరువులు, విత్తనాలు, టెక్నాలజీ, ట్రైనింగ్ అన్నీ ఆయనే ఇస్తూవెళ్లారు. వాళ్లు పండించిన పంట సైతం ఆయనే కొనుగోలు చేయడం మొదలు పెట్టారు. అలా 1000 ఎకరాలను సమీకరించి, నేలతాడితోపాటు 22 రకాల ఔషధ మొక్కలను సాగు చేస్తున్నారు.
1000 ఎకరాల్లో వ్యవసాయం చేయడం మాటలు కాదు. చీడపీడలు అంటుకుంటే ఒకటీ రెండు రోజుల్లోనే పంటను గుల్ల చేస్తాయి. ఈ సమస్యలన్నింటికీ రాజారామ్ కనుగొన్న హైటెక్ సొల్యూషనే "హెలికాప్టర్ వ్యవసాయం"! ఇందుకోసం "రాబిన్సన్ ఆర్-44" చాపర్ కొన్నారు. పెస్టిసైడ్స్ స్ప్రే చేసే ట్యాంకర్లను అమర్చారు. మళ్లీ పైలట్ ను ఏర్పాటుచేయాలంటే లక్షలాది రూపాయల వేతనం ఇవ్వాలి. అందుకే ఆయనే ట్రైనింగ్ పొందారు. తన కుమారుడికి, సోదరుడికి కూడా శిక్షణ ఇప్పించారు. ఇలా హైటెక్ సాగు చేస్తూ.. తానే నేరుగా విదేశాలకు పంటను ఎగుమతి చేస్తూ ప్రతీఏటా ఏకంగా రూ. 75 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నారు. పంటలపై పరిశోధనలు చేస్తూ సైంటిస్టుగా కూడా గుర్తింపు పొందారు. నాలుగు సార్లు ఉత్తమరైతు అవార్డు అందుకున్నారు. అలా వ్యవసాయ నవీకరణతో దేశవ్యాప్తంగా గుర్తింపుపొందిన రాజారామ్‌ను అందరూ.. "హెలికాప్టర్ వాలే కిసాన్" అని పిలుస్తున్నారు! ప్రేమతో చేస్తే ఏ పనిలోనైనా అత్యున్నత శిఖరాలను అందుకోవచ్చని మరోసారి రాజారామ్ నిరూపించారు.

