ఘుమఘుమలాడే ఇన్స్టెంట్ "గుత్తి వంకాయ కర్రీ" - చూస్తేనే టేస్ట్ చేయాలనిపిస్తుంది!
నోరూరించే వంకాయ కర్రీ - కుక్కర్లో ఇలా చేస్తే అన్నం మిగల్చరు!
vankaya_masala_curry (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 4, 2026 at 5:10 PM IST
Vankaya Masala Curry : గుత్తి వంకాయ కర్రీ వాసన, రుచి ఘుమఘుమలాడుతుంది. చూడగానే తినేయాలన్నంతగా నోరూరిస్తుంది. ఇష్టం లేని వారికి కూడా ఈ గుత్తి వంకాయ కర్రీ చూస్తే ఒక్కసారైనా టేస్ట్ చేయాలనిపిస్తుంది. ఇక్కడ ఇచ్చిన పద్ధతిలో గుత్తి వంకాయ మసాలా కర్రీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ట్రై చేయండి.
పక్కా కొలతల్లో "చిక్కటి షోర్వా" - చపాతీ, బగారా రైస్‌లోకి అద్దిరిపోతుంది!

కావల్సిన పదార్థాలు :
- వంకాయలు - 300 గ్రాములు
- పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు
- ధనియాలు - 1 టేబుల్ స్పూన్
- దాల్చిన చెక్క - 2 ఇంచులు
- యాలకులు - 3
- లవంగాలు - 4
- జీలకర్ర - అర స్పూన్
- జీడిపప్పు - 6
- నువ్వులు - 1 టేబుల్ స్పూన్
- కొబ్బరి పొడి - 1 టేబుల్ స్పూన్
- కారం - 2 స్పూన్లు
- పసుపు - పావు టీ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- వెల్లుల్లి - 8
- అల్లం ముక్క - కొద్దిగా
- ఉల్లిపాయ - 1
- కొత్తిమీర - కొద్దిగా
- నూనె - 3 టేబుల్ స్పూన్లు
- జీలకర్ర - అర స్పూన్
- ఆవాలు - అర స్పూన్
- కరివేపాకు - 1 రెమ్మ
- ఎండుమిర్చి - 2
- పచ్చిమిర్చి - 3
- ఇంగువ - పావు స్పూన్
- గరం మసాలా - అర స్పూన్
- చింతపండు (ఆప్షనల్) - 2 రెబ్బలు
- కసూరి మేతి - కొద్దిగా

తయారీ విధానం :
- ముందుగా వంకాయ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకుని పల్లీలు దోరగా వేయించాలి. మూడు, నాలుగు నిమిషాల పాటు వేయించాక ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, జీడిపప్పు కూడా వేయించి నువ్వులు వేసుకోవాలి. నిమిషం పాటు వేయించాక కొబ్బరి పొడి కూడా వేసుకుని మరో నిమిషం వేయించి స్టవ్ ఆఫ్ చేస్తే చాలు.

- చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకుని కారం, పసుపు, ఉప్పు, వెల్లుల్లి, అల్లం ముక్క వేసి గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కొద్దిగా నీళ్లు పోసుకుని గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇపుడు వంకాయలు శుభ్రం చేసుకుని గుత్తి మాదిరిగా కట్ చేసుకుని ఉప్పు నీళ్లలో వేసుకోవాలి. ఇపుడు వంకాయల్లోకి మసాలా స్టఫ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. రెడీ చేసుకున్న మసాలాని వంకాయల్లోకి కూర్చుకోవాలి. మిగిలిన మసాలా పక్కన పెట్టుకోవాలి.

- ఇపుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ వేసుకుని కలపాలి. ఇపుడు పక్కన పెట్టుకున్న గుత్తి వంకాయలు వేసుకుని బాగా కలపాలి. ఆ తర్వాత మిగిలిన మసాలా కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇపుడు మంట తగ్గించి మరో మూడు నిమిషాలు ఉడికించిన తర్వాత గ్రేవీకి సరిపడా నీళ్లు, కొద్దిగా చింతపండు రసం పోసి, కాస్త గరం మసాలా వేసుకుని కలపాలి.

- ఇపుడు కుక్కర్ మూతపెట్టుకుని మంట మీడియం ఫ్లేమ్‌లోకి ఒక్క విజిల్ ఇస్తే చాలు. ప్రెజర్ తీసేసి మూత తీస్తే కిచెన్ మొత్తం ఘుమఘుమలాడిపోతుంది. ఇపుడు కసూరి మేతి చల్లుకుని బాగా కలిపి మూతపెట్టి 2 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే చాలు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఇలాంటి గుత్తి వంకాయ ట్రై చేయండి.
చిత్తూరు స్టైల్ "పప్పుచారు" - ఈ రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!
దాబా స్టైల్ "పాలక్, చనా మసాలా కర్రీ" - చపాతీ, బగారారైస్ లోకి మంచి కాంబినేషన్!

