అమ్మాయి 'పింక్ బాస్కెట్' పట్టుకుందంటే! - అబ్బాయిలకు పండగే!
సూపర్ మార్కెట్లకు వెళ్తున్నారా? - ట్రెండింగ్‌లో 'గ్రాసరీ షాప్ డేటింగ్'

By ETV Bharat Andhra Pradesh Team
Published : October 10, 2026 at 11:09 AM IST
|Updated : October 10, 2026 at 2:56 PM IST
PINK BASKET DATING : ఒంటరిగా ఉన్నాం! అని డేటింగ్స్ యాప్స్ ఫాలో అవుతున్నారు. అవతలి వ్యక్తి ఆడో, మగో తెలియకుండానే ప్రేమలో మునిగిపోతున్నారు. చివరకు విషయం తెలిసే సరికి ఆర్థికంగా, మానసికంగా కుంగిపోతున్నారు. చాలా మంది యువతకు ఎదురవుతున్న పరిస్థితి ఇది!
నిజానికి డేటింగ్ యాప్స్‌లో ఎంతమంది పరిచయమైనా, నిజ జీవితంలో ఓ వ్యక్తి ఎదురుపడితే ఆ ఫీలే వేరు. ఇక ఓ చిరు నవ్వుతో పలకరించి, మాట కలిపితే చాలు! 'గాల్లో తేలినట్టుందే.. గుండె పేలినట్టుందే' అంటూ మనసు బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ డ్యూయట్ మార్మోగుతుంది. అందుకే కాబోలు! ఇప్పుడు చాలా మంది యాప్‌లను పక్కన పెట్టి సూపర్ మార్కెట్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అలాగని అక్కడ సరుకులు కొనడానికి మాత్రం కాదు! ప్రేమను వెతుక్కుంటున్నారట. దీనికి 'గ్రాసరీ షాప్ డేటింగ్' అని ఓ పేరు తగిలించేశారు.
'గ్రాసరీ షాప్ డేటింగ్' అంటే?
షాపింగ్‌కి వచ్చిన ఓ అమ్మాయి చేతిలో పింక్ బాస్కెట్ పట్టుకుంటే చాలు! 'తాను సింగిల్' అని సంకేతం ఇచ్చినట్టేనట. 'నేను సింగిల్, నాతో మాట్లాడొచ్చు' అని సైలెంట్ సిగ్నల్ ఇచ్చినట్టంట! ఇంకేంటి మరి! వెళ్లి మనస్ఫూర్తిగా మాట్లాడితే చాలు! ఆ పరిచయం ప్రేమగా మారుతుందో లేదో తెలియదు కానీ, కనీసం ఒకరినొకరు నిజ జీవితంలో చూసి మాట్లాడుకునే అవకాశం దొరికినట్టే కదా!
లోదుస్తులే కదా! అని ఏడాదైనా మార్చకపోతే ఎలా? - 'ఒకరోజు కంటే ఎక్కువ సేపు ధరించొద్దు!'
చాలామంది యువత ఇప్పుడు ఇలాంటి పద్ధతులే ఇష్టపడుతున్నారు. డేటింగ్ యాప్స్‌లో వెతకడం, అందులో మనకు నచ్చినట్టుగా మనల్ని మనం చూపించుకునే అవకాశాలున్నా, సూపర్ మార్కెట్లో? ఎదురుగా సాక్షాత్కరిస్తే? సహజమైన అలవాట్లతోనే కనిపిస్తారు కదా!
చాలామంది 'ఏం కొనాలి? ఎంత కొనాలి?' అని అయోమయంలో ఉంటూనే ఒకటి సరిపోతుందా? ఇంకోటి కొనాలా? అని ప్రతి వస్తువు ముందు ఆగిపోతుంటారు. మరికొందరు ధరలు పోల్చి, బడ్జెట్ చూసుకుని అవసరమైనవే తీసుకుని, మరికొన్నింటిని వాయిదా వేస్తుంటారు. ఇంకొందరు కనిపించిన ప్రతీదీ కార్ట్‌లో వేసి బిల్లు దగ్గరికి వచ్చేసరికి షాకవుతుంటారు. ఈ నేపథ్యంలో సూపర్ మార్కెట్లో ఈ చిన్న అలవాట్లు లైఫ్‌స్టైల్, ఖర్చు చేసే విధానం, డబ్బును ఎలా మేనేజ్ చేస్తారనే దానిపై అంచనాలను కలిగిస్తాయి.
"ఈ మాత్రం హింట్ ఇస్తే చెలరేగిపోమా!" అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే! సూపర్‌మార్కెట్లో ఎవరైనా పింక్ బాస్కెట్ పట్టుకొని కనిపించగానే ప్రేమలో పడిపోవాల్సిన పనిలేదని గుర్తుంచుకోండి. ఇలాంటి సంకేతాలు కేవలం పరిచయానికి మాత్రమే. హద్దు మీరి ప్రవర్తించవద్దు. ఎదుటివారిని గౌరవించడం, అసలు మాట్లాడాలనుకుంటున్నారా లేదా గమనించడం తప్పనిసరి. అసౌకర్యంగా అనిపిస్తే అక్కడితో ఆగిపోవడం చాలా ముఖ్యం.
'సమస్యను పక్కవాళ్లకు చెప్పడం కాదు' - సరైన పరిష్కారం కోసం సూపర్ టిప్స్!
మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలా? - ఈ స్మార్ట్ అలవాట్లు ఫాలో అవ్వాల్సిందే!

