రాయలసీమ స్టైల్ "పచ్చిమిర్చి పప్పు" - ఒక్కసారి తింటే మళ్లీమళ్లీ చేసుకుంటారు!
కుక్కర్లో నోరూరించే పప్పు రెసిపీ - అన్నం, చపాతీల్లోకి పర్ఫెక్ట్!

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 26, 2026 at 10:27 AM IST
Rayalaseema Style Pachi Mirchi Pappu : చాలా మంది పప్పును ఇష్టంగా తింటారు. అయితే దీన్ని వివిధ రకాలుగా చేస్తుంటారు. కానీ ఎప్పుడూ ఓకేలా తింటే ఏం బాగుంటుంది? అందుకే ఈసారి కొత్తగా రాయలసీమ స్టైల్ పచ్చిమిర్చి పప్పు ట్రై చేయండి. ఈ పద్ధతిని పాటిస్తూ చేశారంటే టేస్ట్ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసి తిన్నారంటే ఆ రుచి అద్భుతమని చెప్పొచ్చు. అంతేకాక చపాతీ, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. అలాగే దీని తయారీకి ఎక్కువ టైమ్ కూడా పట్టదు. కుక్కర్లో అప్పటికప్పుడు చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఘుమఘుమలాడే పచ్చిమిర్చి పప్పు ఎలా చేయాలో ఇప్పుడు ఓ లుక్కేయండి.
ఆంధ్రా, తమిళనాడు మిక్స్డ్ రెసిపీ - నోరూరించే "చంద్రముఖి చికెన్"

కావాల్సిన పదార్థాలు :
- కందిపప్పు - అర కప్పు
- పచ్చిమిర్చి - 12
- ఉల్లిపాయలు - 3
- టమోటాలు - 3
- ధనియాలు - 1 టీ స్పూన్
- జీలకర్ర - 2 టీ స్పూన్లు
- పసుపు - అర టీ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు
- శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
- మినపప్పు - 1 టీ స్పూన్
- ఆవాలు - 1 టీ స్పూన్
- ఎండుమిర్చి - 2
- ఇంగువ - పావు టీ స్పూన్
- కరివేపాకు - కొద్దిగా
- కొత్తిమీర - కొంచెం

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం గిన్నెలో అర కప్పు కందిపప్పు, సరిపడా నీళ్లు పోసి అర గంట పాటు నానబెట్టాలి. అలాగే మూడు ఉల్లిపాయలు, మూడు టమోటాలను కట్ చేసి పెట్టుకోవాలి.

- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నానబెట్టిన కందిపప్పు, 12 పచ్చిమిర్చి వేయాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లి, టమోటా ముక్కలు, ఒక టీ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ పసుపు, అర లీటర్ నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి మూతపెట్టాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
- మూడు విజిల్స్ వచ్చిన అనంతరం పప్పును పప్పు గుత్తితో మెత్తగా రుబ్బాలి.

- ఇంకోవైపు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నూనె పోయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టీ స్పూన్ మినపప్పు వేయాలి. అదేవిధంగా ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, రెండు ఎండుమిర్చి వేసి వేయించాలి.
- ఇందులోనే పావు టీ స్పూన్ ఇంగువ వేసి కలపాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి మగ్గించాలి. అదేవిధంగా కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఫ్రై చేయాలి.

- అనంతరం తాలింపును పప్పు మిశ్రమంలో వేసి కలపాలి.
- అంతే రాయలసీమ స్టైల్ పచ్చిమిర్చి పప్పు మీ ముందుంటుంది!
నోరూరించే "చిల్లీ పనీర్ 65" - ఇలా చేస్తే ఒక్క ముక్క మిగల్చరు!
'గంజి' కదా అని వదిలేస్తున్నారా? - ఉపవాసం టైంలో ఇలా చేశారంటే ఆరోగ్య ప్రయోజనాలు!

