అమ్మమ్మల పద్ధతిలో "గోంగూర పులుసు" - చింతపండు లేకుండానే పుల్ల పుల్లగా అదుర్స్!
- గోంగూరతో ఎన్నడూ ట్రై చేయని కర్రీ - వేడి వేడి అన్నంలో తింటే అద్భుతమే!

Published : January 7, 2026 at 4:40 PM IST
Gongura Pulusu Kura Recipe in Telugu : ఆకుకూరల్లో గోంగూరకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆ పేరు వింటేనే చాలు చాలా మందికి నోట్లో నీళ్లూరుతాయి. ఇందులో ఐరన్, కాల్షియం, విటమిన్ Cతో పాటుగా శరీరానికి అవసరమైన మరెన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దాంతో నార్మల్‌గా అందరూ గోంగూరతో పచ్చడి, పప్పు వంటివి ఎక్కువగా తయారు చేసుకుంటుంటారు. అయితే, ఎప్పుడు అవే కాకుండా ఓసారి అమ్మమ్మల పద్ధతిలో ఇలా "గోంగూర పులుసు కర్రీ" చేసుకొని చూడండి.
చింతపండు లేకుండా చేసుకునే ఈ పాతకాలం కర్రీ పచ్చడి కంటే కూడా భలే రుచికరంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో తింటుంటే ఆ టేస్ట్ మరింత అద్భుతమని చెప్పుకోవచ్చు. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలాగే, ఈ కర్రీ తయారీకి ఎక్కువ పదార్థాలు అవసరం లేదు. మరి, పుల్ల పుల్లగా నోరూరించే ఈ గోంగూర పులుసు కూరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- గోంగూర ఆకులు - ఒక పెద్ద కప్పు
- ఆయిల్ - తగినంత
- పోపు దినుసులు - ఒక టేబుల్ స్పూన్
- టమాటాలు - రెండు
- ఉల్లిపాయలు - రెండు (మీడియం సైజ్‌వి)
- ఉప్పు - రుచికి తగినంత

కారం పొడి కోసం :
- ధనియాలు - ఒక చెంచా
- ఎండుమిర్చి - రుచికి తగినన్ని
- వెల్లుల్లి రెబ్బలు - ఆరేడు
ఎన్నడూ ట్రై చేయని కొత్తరకం "బెండకాయ పచ్చడి" - పెనంపై కాల్చి చేయడంలోనే టేస్ట్ సీక్రెట్!

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా తాజా గోంగూరను తీసుకుని కాడల నుంచి ఆకులను తుంచుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి.
- తర్వాత గోంగూర ఆకులను శుభ్రంగా కడిగి వాటర్ తొలగిపోయేలా కాసేపు జల్లిగిన్నెలో వేసి పక్కనుంచాలి.
- అలాగే, ఉల్లిపాయలు, టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఈ రెసిపీ రుచిని పెంచే ఒక ప్రత్యేకమైన కారం పొడిని రెడీ చేసుకోవాలి.

- ఇందుకోసం స్టవ్ మీద చిన్న కడాయిలో ధనియాలు, మీరు తినే కారాన్ని బట్టి తగినన్ని ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసుకుని లైట్‌గా వేయించుకోవాలి.
- అవి దోరగా వేగిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకుని పక్కనుంచాలి.
- అనంతరం కర్రీ తయారీకి స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత పోపు దినుసులు వేసి వేయించుకోవాలి.
- అవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి కలిపి మూతపెట్టి కాసేపు మగ్గించుకోవాలి.

- ఉల్లిపాయ, టమాటా ముక్కలు మంచిగా మగ్గిన తర్వాత అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులను వేసి కలిపి మూతపెట్టి లో టూ మీడియం ఫ్లేమ్‌లో మగ్గనివ్వాలి. ఇలా మగ్గించుకునే క్రమంలో మధ్యమధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి.
- గోంగూర సగం వరకు మగ్గిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకుని కలిపి మూతపెట్టి సన్నని సెగ మీద మరికొద్దిసేపు మగ్గనివ్వాలి.
- గోంగూర పూర్తిగా మగ్గిన తర్వాత అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ప్రత్యేకమైన కారం పొడిని మీ రుచిని బట్టి తగినంత వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

- ఆపై లో-ఫ్లేమ్‌లో ఒక నిమిషం మగ్గనిచ్చి తర్వాత చాలా కొద్దిగా వాటర్ వేసుకుని కలిపి మరో నిమిషం ఉడకనిచ్చి దింపేసుకుంటే చాలు.
- అంతే, అమ్మమ్మల పద్ధతిలో పుల్ల పుల్లగా నోరూరించే "గోంగూర పులుసు కూర" రెడీ అవుతుంది!
- మరి, నచ్చితే మీరూ గోంగూరతో రెగ్యులర్‌గా చేసుకునే పచ్చడి, పప్పు వంటివి కాకుండా ఓసారి ఇలా కర్రీ ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుంటూ కమ్మగా తింటారు.
- ఒకవేళ మీరు ఎక్కువ మొత్తంలో ఈ కర్రీని చేసుకోవాలనుకుంటే గోంగూరతో పాటు ఇతర పదార్థాలను అందుకు అనుగుణంగా పెంచి తీసుకుంటే సరిపోతుంది.
బ్రేక్‌ఫాస్ట్‌లోకి అద్దిరిపోయే "సేమియా పులిహోర" - పావుగంటలోనే రెడీ! - టేస్ట్ సూపర్!
కాల్చిన వంకాయతో కమ్మని "పెరుగు పచ్చడి" - సూపర్ టేస్టీగా ఉంటుంది - అన్నం, దోసెల్లోకి అదుర్స్!

