సండే స్పెషల్: పుల్లగా, కారంగా "గోంగూర రొయ్యల కూర" - టేస్ట్ అద్దిరిపోతుంది!
-రొయ్యలను ఎప్పుడూ ఒకటే పద్ధతిలో చేస్తున్నారా? - ఇలా గోంగూర వేసి చేయండి!

Published : February 28, 2026 at 5:23 PM IST
|Updated : February 28, 2026 at 5:48 PM IST
Gongura Prawns Curry: సీ ఫుడ్స్‌లో ఫిష్ తర్వాత చాలా మంది ఇష్టంగా తినే వాటిలో ప్రాన్స్ ఒకటి. పచ్చి రొయ్యలతో చేసే రెసిపీలు టేస్టీగా ఉంటాయి. అయితే ఎన్నో వెరైటీలు ఉన్నా చాలా మంది ప్రాన్స్‌ను రెగ్యులర్ పద్ధతిలో ప్రిపేర్ చేసుకుని తింటుంటారు. కారణం టేస్ట్ గురించి ఆలోచిస్తుంటారు. అయితే మీకోసం అద్దిరిపోయే రెసిపీ ఒకటి తీసుకొచ్చాం. అదే గోంగూర రొయ్యల కూర. ఆంధ్ర స్టైల్లో పుల్లగా, కారంగా ఉండే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. తయారు చేసుకోవడం కూడా సులువే. మరి లేట్ చేయకుండా ఈ కర్రీ ఎలా చేయాలో చూసేయండి.
కావాల్సిన పదార్థాలు:
- పచ్చి రొయ్యలు - పావు కిలో
- నూనె - తగినంత
- లవంగాలు - 3
- దాల్చిన చెక్క - చిన్న ముక్క
- యాలకులు - 3
- బిర్యానీ ఆకు - 1
- జీలకర్ర - పావు టీస్పూన్
- కరివేపాకు - 2 రెమ్మలు
- పచ్చిమిర్చి - 3
- ఉల్లిపాయ - 1
- ఉప్పు - రుచికి సరిపడా
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
- టమాటా - 1
- పసుపు - అర టీస్పూన్
- కారం - తగినంత
- జీలకర్ర పొడి - అర టీస్పూన్
- ధనియాల పొడి - 1 టీస్పూన్
- గోంగూర ఆకులు - పావు కిలో
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
కావాల్సిన పదార్థాలు:
- ముందుగా పచ్చి రొయ్యలను శుభ్రంగా కడిగి జల్లి గిన్నెలోకి తీసుకుని కొద్దిసేపు పక్కన ఉంచాలి. ఈలోపు ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చిలను సన్నగా కట్ చేసుకోవాలి. అదే విధంగా గోంగూర ఆకులను కడిగి శుభ్రం చేసుకుని పక్కన ఉంచాలి.
- స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి పాన్ పెట్టి 1 టేబుల్‌స్పూన్ నూనె పోసి వేడి చేసుకోవాలి. కాగిన నూనెలో కడిగిన పచ్చి రొయ్యలు, చిటికెడు పసుపు, అర టీస్పూన్ ఉప్పు వేసి కలిపి వేయించుకోవాలి.
- రొయ్యల్లోని నీరు ఇంకి అవి చక్కగా ఫ్రై అయ్యాక తీసి ప్లేట్లోకి వేసుకోవాలి. అదే పాన్‌లోకి 7 టేబుల్స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి.
- నూనె కాగినాక దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి వేయించాలి.
- మసాలా దినుసులు వేగినాక కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించాలి. అనంతరం అందులోకి సన్నని ఉల్లిపాయ తరుగు వేసి కలర్ మారే వరకు ఫ్రై చేయాలి.
- ఆనియన్స్ లైట్‌గా కలర్ మారాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.
- అనంతరం టమాటా ముక్కలు వేసి మెత్తగా ఉడికించాలి. ఆ తర్వాత పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, 4 టేబుల్స్పూన్ల నీళ్లు పోసి ఫ్రై చేయాలి.
- మసాలాలు మగ్గి నూనె పైకి తేలినాక కడిగిన గోంగూర ఆకులు వేసి కలిపి మెత్తగా ఉడికించాలి.
- గోంగూర ఆకులు మంచిగా మగ్గి నూనె పైకి తేలినాక వేయించిన రొయ్యలు వేసి ఓ 5 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
- కాసేపు మగ్గించిన తర్వాత అర కప్పు వేడి నీటిని పోసి కలిపి మూత పెట్టి లో టూ మీడియం ఫ్లేమ్‌లో మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించాలి.
- సుమారు పావుగంట సేపు ఉడికించాలి. ఆ తర్వాత మూత తీసి చూస్తే రొయ్యలు మంచిగా మగ్గి నూనె పైకి తేలుతుంది.
- ఈ సమయంలో గరం మసాలా, కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రొయ్యల కర్రీ రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
రంజాన్ స్పెషల్ "సూప్" - ఇన్స్టంట్ ఎనర్జీ చాలా టేస్టీగా!
చల్లని వేళ నోరూరించే "చంద్రముఖి చికెన్ ఫ్రై" - తిన్నారంటే లక లక లక అనాల్సిందే!

