అద్దిరిపోయే "చికెన్-గోంగూర బిర్యానీ" - ఇలా ప్రిపేర్ చేసుకోండి!
- వావ్ అనిపించే గోంగూర బిర్యానీ - స్పెషల్ అకేషన్స్లో సూపర్ ఛాయిస్ - చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు
Gongura Biryani (ETV Abhiruchi)

Published : April 25, 2026 at 12:29 PM IST
Gongura Biryani : బిర్యానీ అనగానే అందరికీ గుర్తొచ్చేది మసాలాల ఘుమఘుమలే. మెత్తని మటన్, చికెన్ పీసులు మనసును ఊరిస్తాయి. అయితే, ఈ సారి డిఫరెంట్గా పుల్లపుల్లగా, కారంకారంగా ఉండే సరికొత్త బిర్యానీ రెసిపీని ట్రై చేయండి. అదే గోంగూర బిర్యానీ. పులుపును ఇష్టపడే ఫుడ్ లవర్స్ కి ఇది సూపర్ ఆప్షన్. బాస్మతీ బియ్యం, గోంగూర మిశ్రమంతో కలిపి ప్రిపేర్ చేసే ఈ వంటకం విందు భోజనాన్ని తలపిస్తుందంటే నమ్ండి! మరి, ఈ రుచికరమైన బిర్యానీ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు :
- బాస్మతి బియ్యం - 2 కప్పులు
- గోంగూర ఆకులు - 2 కప్పులు
- చికెన్ - అరకేజీ
- ఉల్లిపాయలు - పెద్దవి 2
- పచ్చిమిర్చి - నాలుగైదు
- అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టేబుల్ స్పూన్
- లవంగాలు - ఐదారు
- యాలకులు - ఐదారు
- దాల్చినచెక్క - 3 ఇంచులు
- బిర్యానీ ఆకు - ఒకటి
- నెయ్యి - 2 స్పూన్లు
- కారం - తగినంత
- పసుపు - ఒక స్పూన్
- ఉప్పు - రుచికి తగినంత
- పుదీనా - ఒక కట్ట
- కొత్తిమీర - ఒక కట్ట
అసలైన "ఆవకాయ బిర్యానీ" - ఘుమఘుమలకే నోట్లో నీళ్లు ఊరిపోతాయ్!
తయారీ విధానం :
- ముందుగా బాస్మతి రైస్ శుభ్రం చేసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి
- ఆ తర్వాత ఉల్లిపాయలను నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి
- ముందుగా ఒక బాణాలిలో కొద్దిగా నూనె వేసి, పచ్చిమిర్చి, గోంగూర ఆకులను ఫ్రై చేయాలి.
- ఆకులు మగ్గిన తర్వాత వాటిని చల్లార్చి, మెత్తని పేస్టులా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు మరో గిన్నెలో రైస్ కోసం ఎసరు సిద్ధం చేయాలి. తగినన్ని నీళ్లు పోసి బిర్యానీ దినుసులు, కొద్దిగా ఉప్పు వేసి మరిగించాలి.
- మరిగిన తర్వాత అందులో నానబెట్టిన బియ్యం వేసి 70 % వరకు ఉడికించుకోవాలి.
- రైస్ ఉడికేలోగా చికెన్ ప్రిపేర్ చేసుకోవాలి. మరో స్టౌ మీద అడుగు మందంగా ఉన్న పాత్రలో నూనె, నెయ్యి వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి.
- ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి
- ఇప్పుడు చికెన్ వేసి, ఐదారు నిమిషాలు మగ్గించుకోవాలి.
- తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. మరికాసేపు ఉడికించుకోవాలి.
- ముక్కలు సగం ఉడికిన తర్వాత, పక్కన పెట్టుకున్న గోంగూర పేస్ట్ వేసి బాగా కలపాలి.
- నూనె పైకి తేలేంత వరకు ఉడికించాలి. దీనివల్ల గోంగూర పులుపు చికెన్ ముక్కలకు బాగా పడుతుంది.
- ఈ లోగా అన్నం 70 శాతం ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమం పైన ఉడికించిన అన్నం ఒక పొర మాదిరిగా వేసుకోవాలి
- పైన కొత్తిమీర, పుదీనా, ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు , కొద్దిగా నెయ్యి చల్లుకోవాలి
- తర్వాత మూత పెట్టి ఆవిరి బయటకు పోకుండా 10 నుంచి 15 నిమిషాల పాటు చిన్న మంట మీద దమ్ చేయాలి.
- అంతే, అద్దిరిపోయే గోంగూర బిర్యానీ సిద్ధమైపోతుంది. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి
- చిట్కాలు:
- గోంగూర మరీ పుల్లగా ఉంటే, కాస్త తగ్గడానికి కొద్దిగా ధనియాల పొడి చల్లుకోవచ్చు. లేదంటే గరం మసాలా మోతాదు పెంచండి.
- బిర్యానీకి ఎర్ర గోంగూర వాడితే మరింత రుచికరంగా ఉంటుంది
- ఈ గోంగూర బిర్యానీని ఉల్లిపాయ పెరుగు పచ్చడితో తిన్నారంటే అదుర్స్ అనిపిస్తుంది.

