వారెవ్వా అనిపించే గోదారోళ్ల స్వీట్ "పాకుండలు" - ఇలా ఈజీగా చేసుకోవచ్చు!
- ప్రతి పండక్కీ ఇంటింటా ఘుమఘుమలాడే మిఠాయి - తప్పకుండా ఒక్కసారైనా టేస్ట్ చేయాల్సిందే
Godavari Paka Undalu (ETV Bharat)

Published : March 1, 2026 at 9:52 AM IST
Godavari Paka Undalu : పిండి వంటల్లో గోదావరి జిల్లాలకు సెపరేట్ ట్రాక్ ఉంటుంది. వారి రెసిపీలు ఎంతో టేస్టీగా ఉంటాయి. పండగల సమయంలో ప్రతి ఇంట్లోనూ ఓ రేంజ్లో ఫలహారాలు రెడీ అవుతుంటాయి. అలాంటి వాటిల్లో ఓ స్పెషల్ స్వీట్ తయారీని ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. అవే "పాక ఉండలు". ఎంతో టేస్టీగా ఉండే వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. మరి, వీటిని ఎలా తయారు చేయాలి? ఇందుకోసం కావాల్సిన పదార్థాలేంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- కేజీ బియ్యం (కొత్తవి)
- పావు కేజీ బెల్లం వేసుకోవాలి
- రెండు టేబుల్ స్పూన్ల గసగసాలు
- కప్పు పచ్చి కొబ్బరి తురుము
- టీ స్పూన్ యాలకుల పొడి
- కాస్త నెయ్యి
తయారీ విధానం :
- ముందుగా బియ్యం కడిగి ఒక రోజు మొత్తం (24 గంటలు) నానబెట్టాలి. ఇవి కూడా కొత్త బియ్యం తీసుకోవాలి. ఎందుకంటే కొత్తవి జిగురుగా ఉంటాయి. విరిగే అవకాశం తక్కువగా ఉంటాయి.
- నానబెట్టిన తర్వాత నీటిని పూర్తిగా వంపేసి, జల్లెడలో ఉంచాలి. దీనివల్ల నీటి బొట్లు ఏవైనా ఉంటే అవి కూడా వెళ్లిపోతాయి.
- ఆ తర్వాత శుభ్రమైన క్లాత్ మీద పోసి మరో పది నిమిషాల పాటు నానబెట్టాలి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. తడి ఏ మాత్రం ఉండకూడదని!
- బియ్యం ఆరిపోయిన తర్వాత మెత్తని పిండి తయారు చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నా సరిపోతుంది. అవకాశం ఉన్నవారు పిండి గిర్నీలో పట్టిస్తే మంచిది
- ఆ తర్వాత పిండిని జల్లించుకోవాలి. అంటే ఎంత మెత్తగా ఉండాలో అర్థం చేసుకోవచ్చు
- ఇప్పుడు స్టౌ మీద కడాయి పెట్టి అందులో పావు కేజీ బెల్లం వేసుకోవాలి
- అందులో పావు కప్పు నీళ్లు పోసి జిగురు పాకం వచ్చే వరకు కుక్ చేసుకోవాలి
- ఈ పాకం ఎలా ఉండాలంటే నీళ్లలో వేస్తే కరిగిపోకూడదు. జారి పోకూడదు. ముద్దలా అయిపోవాలి. పాకం ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు స్టౌ ఆఫ్ చేసి దించుకోవాలి
- వేడి మీదనే రెండు టేబుల్ స్పూన్ల గసగసాలు, కప్పు పచ్చి కొబ్బరి తురుము పాకంలో వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి
- ఇప్పుడు జల్లించి పట్టుకున్న పిండిని నాలుగు కప్పులు తీసుకోవాలి. బెల్లం తీసుకున్న కప్పుతోనే ఈ పిండిని తీసుకోవాలి.
- అయితే ఒకేసారి నాలుగు కప్పుల పిండిని అందులో వేయకుండా ముందుగా ఒక కప్పు వేసి వేగంగా కలుపుకోవాలి. ఆ తర్వాత రెండో కప్పు వేసి కలుపుకోవాలి.
- ఇప్పుడు ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసి మిక్స్ చేసుకోవాలి
- ఆ తర్వాత మూడో కప్పు పిండి వేసి మిక్స్ చేసుకోవాలి
- అయినా పిండి కాస్త జారుగానే ఉంటే నాలుగో కప్పు వేసేయాలి. లేదంటే ఎంత అవసరమైతో అంత వేసుకొని కలుపుకోవాలి. మొత్తానికి కలుపుకున్న పిండి దగ్గరకు వచ్చేయాలి
- ఇప్పుడు 15 నిమిషాల పాటు చల్లారనిచ్చిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి రాయాలి. చేతికి కూడా నెయ్యి రాసుకొని నిమ్మకాయంత సైజులో ఉండలు తీసుకొని లడ్డూలు తయారు చేయాలి
- అన్నీ తయారు చేసిన తర్వాత స్టౌ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి
- స్టౌ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి, నిదానంగా ఉడకనివ్వాలి
- అన్నీ ఒకేసారి కుక్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఆయిల్లో నిండుగా వేయకూడదు. దీనివల్ల కొన్ని సరిగా ఉడకకపోవచ్చు
- ఉండలు ఉడుకుతున్నప్పుడు కనీసం 3 నిమిషాలపాటు అస్సలు కదపకూడదు. ఆ తర్వాత ఒక పుల్ల తీసుకొని కాస్త కదిలించాలి
- మరో మూడ్నాలుగు నిమిషాల తర్వాత అతుక్కున్న వాటిని వేరు చేయాలి. ముందుగానే విడదీస్తే పగిలిపోతాయి
- కనీసం పది నుంచి పన్నెండు నిమిషాల సమయంలో ముదురు గోధుమ రంగులోకి మారిపోయిన తర్వాత దింపుకుంటే సరిపోతుంది.

