అమ్మమ్మల పద్ధతిలో "వెల్లుల్లి రసం" - చల్లని వేళ వేడివేడి అన్నంలో అద్భుతమే!
- రెగ్యులర్ రసం రెసిపీలను మించిన టేస్ట్ - ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకోవడం పక్కా!

Published : October 30, 2025 at 11:02 AM IST
Garlic Rasam Recipe in Telugu : వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడి అన్నంలో ఏదైనా రసం పోసుకుని తింటుంటే ఆ టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే చాలా మంది త్వరగా అయిపోతుందని 'టమాటా రసం' చేసుకుంటుంటారు. అది మాత్రమే కాకుండా ఈ సీజన్లో తప్పకుండా ట్రై చేయాల్సిన మరో రెసిపీ ఉంది. అదే, అమ్మమ్మల పద్ధతిలో నోరూరించే "వెల్లుల్లి రసం".
దీన్ని చాలా తక్కువ టైమ్‌లో ఇన్‌స్టంట్‌గా రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే, ఇది ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా చలికాలంలో దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటి సమస్యలతో బాధపడేవారికి ఈ రసం మంచి రిలీఫ్‌ను కూడా అందిస్తుంది! మరి, ఈ టేస్టీ అండ్ హెల్దీ వెల్లుల్లి రసం తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- చింతపండు - 30 గ్రాములు
- టమాటాలు - రెండు
- పచ్చిమిర్చి - నాలుగైదు
- వెల్లుల్లి రెబ్బలు - 30 నుంచి 40
- నూనె - నాలుగు టేబుల్‌స్పూన్లు
- జీలకర్ర - ఒక టీస్పూన్
- ఆవాలు - ఒక టీస్పూన్
- ఎండుమిర్చి - నాలుగైదు
- ఇంగువ - అరటీస్పూన్
- కరివేపాకు - కొద్దిగా
- పసుపు - అరటీస్పూన్
- కారం - ఒక టీస్పూన్
- కొత్తిమీర తరుగు - రెండు పిడికెళ్లు
మసాలా పొడి కోసం :
- మెంతులు - అరటీస్పూన్
- జీలకర్ర - ఒక టీస్పూన్
- ధనియాలు - రెండు టీస్పూన్లు
- కందిపప్పు - నాలుగు టీస్పూన్లు
- మిరియాలు - ఒక టీస్పూన్
- తెల్ల నువ్వులు - రెండు టీస్పూన్లు
చింతపండు లేకుండానే కమ్మని "ఉసిరికాయ రసం" - అన్నం కడుపునిండా తినేస్తారు!

తయారీ విధానం :
- కమ్మ కమ్మగా నోరూరించే ఈ పాతకాలం రసం తయారీకి ముందుగా ఒక గిన్నెలో చింతపండును తీసుకుని శుభ్రంగా కడగాలి. ఆపై అందులో తగినన్ని నీళ్లు పోసి అరగంట పాటు నాననివ్వాలి.
- అది నానేలోపు రెసిపీలోకి కావాల్సిన టమాటాలను శుభ్రంగా కడిగి, నాలుగు ముక్కలుగా కట్ చేసి పక్కనుంచాలి. అలాగే, పచ్చిమిర్చిలను గ్యాస్‌పై కాల్చుకుని రెడీగా పెట్టుకోవాలి.
- ఇప్పుడు చింతపండు బాగా నానిందనుకున్నాక అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, కాల్చిన పచ్చిమిర్చిలను వేసి చేతితో బాగా ప్రెస్ చేస్తూ మాష్ చేయాలి.
- అన్నింటినీ బాగా మాష్ చేస్తూ రసం తీసుకున్నాక మిగిలిన పిప్పిని తీసేసి పక్కన పడేయాలి.

- ఒకవేళ మీకు టమాటా, పచ్చిమిర్చిలను మాష్ చేయడం ఇబ్బందిగా అనిపిస్తే ముందుగానే టమాటా, కాల్చిన మిరపకాయలను మిక్సీ జార్లో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
- తర్వాత ఆ పేస్ట్‌ను నానిన చింతపండు రసంలో వేసి బాగా కలిపి పిప్పిని వేరు చేసి రసాన్ని రెడీ చేసుకోవచ్చు.
- ఆ విధంగా చింతపండు టమాటా రసాన్ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- అనంతరం రసంలోకి కావాల్సిన ఒక ప్రత్యేకమైన మసాలా పొడిని సిద్ధం చేసుకోవాలి.

- ఇందుకోసం స్టవ్ మీద కడాయి పెట్టి మెంతులు, జీలకర్ర, ధనియాలు, కందిపప్పు, మిరియాలు వేసి అన్నింటినీ లో-ఫ్లేమ్‌లో దోరగా వేయించాలి.
- అవి వేగిన తర్వాత అందులో తెల్ల నువ్వులు వేసి చిటపటమనే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- అవన్నీ కాస్త చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- తర్వాత చిన్న రోలులో వెల్లుల్లి పాయలను వేసి కచ్చాపచ్చాగా దంచుకుని రెడీగా ఉంచుకోవాలి.
ఇంట్లో ఇడ్లీ, దోశ పిండి లేదా? - నిమిషాల్లో రవ్వతో "బన్ దోశలు" చేసుకోండి!

- అనంతరం వెల్లుల్లి రసం తయారీకి స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి.
- ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి తుంపలు, కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేంత వరకు కాసేపు వేయించాలి.
- ఆ తర్వాత అందులో ఇంగువ, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ మిశ్రమం మంచిగా ఫ్రై అయ్యాక పసుపు, కారం, రుచికి తగినంత ఉప్పు, గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని యాడ్ చేసుకుని లో-ఫ్లేమ్‌లో అన్నీ బాగా కలిసేలా కలుపుతూ ఒక నిమిషం పాటు వేయించాలి.

- అనంతరం అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా చింతపండు రసం యాడ్ చేసుకోవాలి.
- ఆపై మీరు తినే పులుపును బట్టి తగినన్ని నీళ్లు పోసి అంతా బాగా కలిసేలా కలిపి మీడియం ఫ్లేమ్‌లో మరగనివ్వాలి.
- ఆ మిశ్రమం వేడెక్కి బాగా మరుగుతున్నప్పుడు చివరగా కొత్తిమీర తరుగు వేసుకుని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. అంతే, అమ్మమ్మల పద్ధతిలో ఘుమఘుమలాడే "వెల్లుల్లి రసం" అప్పటికప్పుడు రెడీ అవుతుంది!
- మరి, నచ్చితే మీరూ ఈ చల్లని వేళ ఓసారి ఇలా రసం రెసిపీని ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ వేడి వేడి అన్నంలో కమ్మగా, కడుపునిండా తినేస్తారు!
- అలాగే, మీరు తక్కువ మొత్తంలో ఈ రసం చేసుకోవాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ని అందుకు తగ్గట్లుగా తగ్గించి తీసుకుంటే సరిపోతుంది.
మైదా లేకుండానే కరకరలాడే "పునుగులు" - చల్లని వేళ తక్కువ పదార్థాలతో అప్పటికప్పుడు రెడీ!

