ఆహార, పానీయాలకు ఇకపై 'ఇజ్రాయిల్ తరహా ప్యాకింగ్' - క్వాలిటీ సూచిస్తూ హెచ్చరిక లేబుళ్లు!
'అధిక చక్కెర, కొవ్వు, ఉప్పుపై హెచ్చరిక' - సుప్రీం కోర్టుకు సమర్పించిన FSSAI

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 29, 2026 at 7:45 AM IST
Food Packaging : 'ఉప్పు, చక్కెర, కొవ్వు' అధికంగా ఉన్న ఆహార పదార్థాల ప్యాకింగ్‌పై ఇజ్రాయెల్ తరహా లేబులింగ్ వ్యవస్థను పరిశీలించాలన్న సుప్రీం సూచనలు త్వరలోనే అమలు కానున్నాయి. పానీయ ఉత్పత్తుల ముందు వైపు హెచ్చరిక లేబుళ్లను ప్రవేశపెట్టాలని భారతదేశ ఆహార భద్రతా నియంత్రణ సంస్థ ప్రతిపాదించింది. మూడింట్లో ఏవేని రెండు పోషకాలు అధికంగా ఉన్న ఉత్పత్తుల ప్యాకింగ్‌పై ఎరుపు రంగు షట్కోణ చిహ్నాన్ని ఉపయోగించాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) సూచించింది. ఈ ప్రతిపాదనను శుక్రవారం సుప్రీంకోర్టుకు సమర్పించింది.
చిరుతిళ్లు, ఆహార పానీయాల ప్యాకింగ్ వెనుక భాగంలో కనిపించీ కనిపించని విధంగా పోషకాల జాబితా ప్రింట్ చేస్తూ కార్పొరేట్ సంస్థలు అమ్మకాలు కొనసాగిస్తున్నాయి. కానీ, జాబితా పరిశీలించకుండానే అది ఆరోగ్యకరమా? లేక అనారోగ్యానికి దారితీస్తుందా? అనే విషయాన్ని స్పష్టం చేసేలా ప్యాకింగ్ ముందు భాగంలోనే గుర్తులు ముద్రిస్తోంది ఇజ్రాయిల్. సరిగ్గా ఇదే విధానాన్ని ఇండియాలోనూ అమలు చేయాలని గతంలోనే సుప్రీం కోర్టు సూచించింది. ఊబకాయులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా ఆహార పదార్థాల ప్యాకింగ్ పై స్పష్టమైన హెచ్చరికలు లేకపోవడంపై ఆరోగ్య నిపుణులు, కార్యకర్తల నుంచి పెరుగుతున్న విమర్శల నేపథ్యంలో గుర్తులు ముద్రించాలనే నిర్ణయానికి వచ్చారు.
'డీప్ ఫ్రిజ్' గడ్డకడితే మీరేం చేస్తారు? - టెక్నీషియన్లు సూచిస్తున్న సింపుల్ టిప్స్!
తాజా పరిణామం దేశ వ్యాప్తంగా 100 బిలియన్ డాలర్లకు పైగా వ్యాపారాన్ని కలిగిఉన్న ఆహార, పానీయ కంపెనీలపై ఒత్తిడి తీసుకురావచ్చు. కోకా-కోలా, నెస్లే, పెప్సికో వంటి ప్రధాన ప్రపంచ కంపెనీలు ప్యాక్ ముందు భాగంలో తప్పనిసరి హెచ్చరిక లేబుళ్లను గతంలో వ్యతిరేకించాయి. అటువంటి చిహ్నాలు వినియోగదారులను గందరగోళానికి గురిచేస్తాయని వాదించాయి. కానీ, ఊబకాయం, జీవనశైలి సంబంధిత ఆరోగ్య సమస్యలపై పెరుగుతున్న ఆందోళనలను ఎత్తి చూపుతూ ఆరోగ్య కార్యకర్తలు మరింత కఠినమైన హెచ్చరికల కోసం పదేపదే ఒత్తిడి చేస్తున్నారు.
హెచ్చరిక లేబుళ్లపై ఏమి కనిపిస్తుంది?
ప్రతిపాదిత విధానం ప్రకారం ఆహార పదార్థం లేదా పానీయాల్లో 'అధిక కొవ్వు', 'అధిక చక్కెర', 'అధిక ఉప్పు' వంటి హెచ్చరికలు ప్యాకింగ్ పై భాగంలోనే కనిపిస్తాయి. దీంతో వినియోగదారులు వెంటనే అప్రమత్తం అవుతారు.
ప్రస్తుతం ఆహార పదార్థాల తయారీదారులు పోషక సమాచారాన్ని ప్యాకేజీ వెనుక భాగంలో ముద్రిస్తున్నారు. కానీ, వాటిపై సరైన అవగాహన లేని కారణంగా పిల్లలు, గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా పట్టింపు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే తప్పనిసరి హెచ్చరిక లేబుళ్ల (గుర్తులు)ను కోరుతూ ఆరోగ్య కార్యకర్తలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తున్న తరుణంలో ఈ ప్రతిపాదన వెలుగులోకి వచ్చింది.
వ్యతిరేకిస్తున్న పారిశ్రామిక వర్గాలు
లేబుళ్ల అంశంపై మార్చిలో జరిగిన ఒక సమావేశంలో ఆహార పరిశ్రమలోని కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనట్లు 'రాయిటర్స్' నివేదిక వెల్లడించింది. హెచ్చరిక చిహ్నాలు ముద్రించినంత మాత్రాన వినియోగదారులకు ఒరిగేదేమీ లేదని, దానికి బదులుగా ఆహార పరిమాణాలపై ఎక్కువ అవగాహన కల్పించాలని పరిశ్రమల తరఫు ప్రతినిధులు వాదించినట్లు సమాచారం. పదార్థాల జాబితాను చదవని వినియోగదారులు కేవలం ప్యాకేజీపై హెచ్చరిక చిహ్నం కనిపించినంత మాత్రాన తమ ఆహారపు అలవాట్లను గణనీయంగా మార్చుకుంటారా అని కోకా-కోలా ఇండియా ఎగ్జిక్యూటివ్ మిలి భట్టాచార్య ప్రశ్నించినట్లు తెలిసింది. కేవలం హెచ్చరిక చిహ్నాలపై ఆధారపడకుండా, వినియోగదారులు తాము తినే ఆహార పరిమాణాన్ని నియంత్రించుకుని, సరైన నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించాలన్న వాదనలు పెరిగాయి.
2050 నాటికి సుమారు 45 కోట్ల మంది భారతీయులు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడవచ్చని 'ది లాన్సెట్' అధ్యయనం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ప్యాకింగ్ విషయంలో మార్పులు అత్యంత అవశ్యమని ఆరోగ్య కార్యకర్తలు కోరుతున్నారు.
కొత్త బియ్యం కంటే పాత బియ్యం ఎందుకు మంచివి? - రుచి, వాసనలో ఏవి బెస్ట్?
వనస్పతి, హైడ్రోజనేటెడ్ కొవ్వులతో 'కల్తీ నెయ్యి' తయారీ - ఇంట్లోనే ఈజీగా కనిపెట్టేయండి!

