మీరు తాగే "పాలు" కల్తీవి కావొచ్చు! - FSSAI టిప్స్‌తో క్షణాల్లో గుర్తించండిలా!
- "కల్తీ పాలు" తాగుతున్నారేమో ఓసారి చెక్ చేసుకోండి - లేదంటే ప్రాణాలకే ప్రమాదం!

Published : March 1, 2026 at 11:53 AM IST
Easy Tips to Find Adulterated Milk : తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో చోటుచేసుకున్న "కల్తీ పాల ఘటన" ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అందరికీ తాము తాగే పాలు స్వచ్ఛమైనవేనా? లేదా కల్తీవా? అనే సందేహాం కలుగక మానదు. ఎందుకంటే, ప్రస్తుత రోజుల్లో కొంతమంది అడ్డదారుల్లో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చివరకు పాలను కూడా ఇష్టారీతిన కల్తీ చేసి అమ్ముతున్నారు.
పాలు చిక్కగా, ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని.. నీళ్లు, యూరియా, గంజి, డిటర్జెంట్, ఫర్మాలిన్, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటివి కలుపుతూ పాలను కల్తీ చేస్తున్నారు. ఇలాంటి కల్తీ పాలు తాగడం వల్ల గ్యాస్ ట్రబుల్, అజీర్తి, వాంతులు, డయేరియాతో పాటు దీర్ఘకాలంలో అవయవాలు దెబ్బతింటాయని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే, రోగనిరోధక శక్తి తగ్గడంతో పాటు చర్మ సమస్యలూ వచ్చే ఛాన్స్ ఉంటుందంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) ఇంట్లోనే కల్తీ పాలను ఈజీగా గుర్తించేలా కొన్ని టిప్స్ సూచిస్తోంది. మరి, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కల్తీ పాలను ఎలా గుర్తించాలి : పాలు స్వచ్ఛమైనవా? లేదంటే కల్తీ జరిగినవా? అని తెలుసుకునేందుకు కొన్ని టిప్స్ సూచిస్తుంది ఎఫ్ఎస్ఎస్ఏఐ. ఈ వీడియోల్లోని కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వడం ద్వారా కల్తీ పాలను ఈజీగా కనిపెట్టవచ్చంటున్నారు FSSAI అధికారులు.
నీళ్లు కలిసిన పాలు కనిపెట్టండిలా..
ఇందుకోసం నున్నగా ఉన్న నాపరాయి లేదా గ్లాసు ప్లేట్ మీద చిన్న పాల చుక్కను వేసి గమనించాలి. అప్పుడు అవి నీళ్లు కలపని పాలు అయితే రాయి మీద మరకని వదులుతూ నెమ్మదిగా కదులుతాయి. అలాకాకుండా కల్తీవైతే మరకలు లేకుండా వేగంగా జారతాయంటున్నారు FSSAI అధికారులు.
మార్కెట్లో "కల్తీ పనీర్" - ఇంట్లోనే 'పల్లీలతో' హెల్దీగా తయారు చేసుకోండి! - చాలా ఈజీ!
యూరియా కలిపిన పాలు గుర్తించండిలా..
- ముందుగా ఒక చిన్న టెస్ట్ ట్యూబ్‌లో ఒక టీస్పూన్ పాలు తీసుకోవాలి. ఆపై అందులో అరటీస్పూన్ సోయాబీన్ పొడి లేదా కందిపప్పు పొడి వేసి అంతా బాగా కలిసేలా మిక్స్ చేయాలి.
- తర్వాత దాన్ని ఐదు నిమిషాలు పక్కనుంచి ఆపై అందులో ఎరుపు లిట్మస్ పేపర్‌ను అరనిమిషం పాటు ఉంచాలి.
- అనంతరం ఆ పేపర్‌ను బయటకు తీసి చూస్తే అవి స్వచ్ఛమైన పాలు అయితే రెడ్ లిట్మస్ పేపర్ కలర్ మారకుండా అదే రంగులో ఉంటుంది.
- అదే, రెడ్ లిట్మస్ పేపర్ నీలం(బ్లూ) రంగులోకి మారినట్లయితే ఆ పాలు కల్తీ అయినట్లు గుర్తించాలంటున్నారు. యూరియా కలిపినవిగా అర్థం చేసుకోవాలంటున్నారు.
డిటర్జెంట్ కలిపిన పాలు ఇలా ఉంటాయి!
ఇందుకోసం ఒక బాటిల్లో సమానంగా పాలు, నీళ్లను తీసుకుని బాగా షేక్ చేయాలి. అప్పుడు అవి స్వచ్ఛమైన పాలైతే పైన వెన్నతో పాటు పల్చటి లేయర్ ఏర్పడడాన్ని గమనించవచ్చు. అదే, డిటర్జెంట్ కలిపిన పాలు అయితే మందంగా నురుగ పేరుకుంటుందని సూచిస్తున్నారు.
గంజి, పిండి పదార్థాలు కలిపినవయితే..
ఒక చిన్న గిన్నెలో కొద్దిగా పాలను వేడి చేసి తీసుకోవాలి. అవి చల్లారాక అందులో రెండు చుక్కల అయోడిన్ సొల్యూషన్ని వేయాలి. ప్యూర్ మిల్క్ అయితే రంగు మారవు లేదా లేత పసుపు రంగులోకి ఛేంజ్ అవుతాయి. అలాకాకుడా గంజి, పిండి పదార్థాలు కలిపిన పాలు అయితే నీలి రంగులోకి మారతాయని గమనించాలంటున్నారు నిపుణులు.
పైన చెప్పిన టిప్స్ మాత్రమే కాకుండా పాల కల్తీని గుర్తించేందుకు మార్కెట్లో "మిల్క్ అడల్ట్రేషన్ టెస్టింగ్" కిట్లు అందుబాటులో ఉంటున్నాయి. ఆన్లైన్లో కూడా ఇవి లభిస్తున్నాయి. వీటి ద్వారానూ ఇంట్లోనే కల్తీ పాలను సింపుల్‌గా కనిపెట్టొచ్చంటున్నారు నిపుణులు.
మార్కెట్లో కల్తీ మరమరాలు - FSSAI టిప్స్‌తో ఈజీగా గుర్తించొచ్చు! - ట్రై చేయండిలా!
రసాయనాలతో "చిలగడదుంపల కల్తీ" - FSSAI చిట్కాతో ఈజీగా గుర్తించండిలా!

