మార్కెట్లోకి "కల్తీ పుచ్చకాయలు" - ఈ చిన్న టెస్ట్ చేసి తీసుకోవాలంటున్న FSSAI
- మీరు తీసుకునే వాటర్ మెలన్ కల్తీది కావొచ్చు! - ఇలా చేయకపోతే ఆరోగ్యానికి ప్రమాదమంటున్న నిపుణులు!

Published : March 6, 2026 at 3:19 PM IST
Identify Adulterated Watermelon : ఏప్రిల్ రాకముందే పగటిపూట ఉష్ణోగ్రతలు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు మజ్జిగ, కొబ్బరినీళ్లు, చెరుకు రసంతోపాటు ఒంటికి చలువ చేసే పండ్లు ఎక్కువగా తింటుంటారు మెజార్టీ పీపుల్. అలాంటి వాటిల్లో "పుచ్చకాయ" ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. నీటి శాతంతోపాటు పీచు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్లు ఎ, సి కూడా పుష్కలంగా ఉంటాయి. అందుకే, పుచ్చకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ పండును చాలా ఇష్టంగా తింటుంటారు. అయితే, ప్రస్తుతం కల్తీకి కాదేది అనర్హం అన్నట్లుగా కొందరు వ్యాపారులు తినే పండ్లను వదలట్లేదు.
సమ్మర్ స్పెషల్ ఫ్రూట్‌గా పిలుచుకునే పుచ్చకాయను త్వరగా పండటానికి, ఎర్రగా కనిపించడానికి ఇంజెక్షన్లు వేస్తూ కల్తీ చేస్తున్నారు. ఇలా కల్తీ చేసిన వాటిని తినడం వల్ల లేనిపోని ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకోవడమేనని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పుచ్చకాయను కొనేటప్పుడు మీరు కొనేది మంచిదా? కాదా? అని తెలుసుకోవడానికి 'ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI)' కొన్ని టిప్స్ సూచిస్తుంది. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
- మార్కెట్లోకి వస్తున్న కల్తీ పుచ్చకాయలను కనిపెట్టేందుకు వీలుగా FSSAI ఒక సింపుల్ని టెస్ట్‌ని సూచిస్తుంది. దాని ద్వారా ఎవరైనా చాలా సింపుల్‌గా ఏది మంచిది? ఏది కల్తీదో ఈజీగా గుర్తించవచ్చు. అందుకోసం పెద్దగా రిస్క్ తీసుకోవాల్సిన పని లేదు. వీడియోలో చూపిస్తున్న ఈ టెస్ట్ ద్వారా సులువుగా కనిపెట్టవచ్చు.
- మీరు ఎక్కడైనా పుచ్చకాయను కొంటున్నప్పుడు ముందుగా ఒక చిన్న పీస్‌ని కట్ చేసి ఇవ్వమనాలి. అప్పుడు ఒక చిన్న కాటన్ బాల్ లేదా టిష్యూ పేపర్ తీసుకుని కట్ చేసిన ఆ ముక్క లోపలి భాగాన్ని అక్కడక్కడా రబ్ చేయాలి.
- అలా కాటన్ బాల్ లేదా టిష్యూ పేపర్‌తో రబ్ చేసినప్పుడు దూది/టిష్యూ పేపర్ అనేది రెడ్ కలర్లోకి మారితే అది కల్తీ చేసిన పుచ్చకాయగా గుర్తించాలంటున్నారు FSSAI అధికారులు.
- ఇలా ఎరుపు రంగులోకి మారిన కల్తీ పుచ్చకాయలో "ఎరిథ్రోసిన్" అనే కెమికల్ కలిసిందని తెలుసుకోవాలి. ఎందుకంటే పుచ్చకాయకు ఎరుపు రంగు రావడానికి ఎరిథ్రోసిన్ అనే రసాయనాన్ని అందులోకి ఇంజెక్ట్ చేస్తారట. అలాంటి పుచ్చకాయలు తినడం శరీరానికి అనేక విధాలుగా హాని కలిగిస్తుందంటున్నారు.
- అదే, ఆ పుచ్చకాయ ముక్క రబ్ చేసినప్పుడు దూది లేదా టిష్యూ పేపర్ రంగు మారకుండా ఉంటే అది మంచిదని తెలుసుకోవాలంటున్నారు FSSAI అధికారులు.
మీరు తాగే "పాలు" కల్తీవి కావొచ్చు! - FSSAI టిప్స్‌తో క్షణాల్లో గుర్తించండిలా!
మరికొన్ని చిట్కాలు :
- మామిడిపండ్ల మాదిరిగానే పుచ్చకాయలు త్వరగా పండడానికి చాలా మంది పండ్ల వ్యాపారులు "కార్బైడ్" అనే కెమికల్‌ను ఉపయోగిస్తుంటారు.
- ఈ కెమికల్ చల్లిన పుచ్చకాయలపై అక్కడక్కడ పసుపు రంగులో మచ్చలు ఏర్పడతాయంటున్నారు నిపుణులు. ఇలాంటివి కూడా ఆరోగ్యానికి మంచికాదని గుర్తుంచుకోవాలంటున్నారు.
- ఒకవేళ మీరు తీసుకున్న పుచ్చకాయ పైన అక్కడక్కడా పసుపు మచ్చలు కనిపించినట్లయితే అలాంటి వాటిని ఉప్పు నీటితో బాగా కడిగి ఆపై తినడం బెటర్ అని సూచిస్తున్నారు.
- మీరు పుచ్చకాయ కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన టిప్ ఏంటంటే, ఆ కాయను ఒకటికి రెండుసార్లు బాగా పరిశీలించాలి. ఒకవేళ దానిపై ఎక్కడైనా చిన్న చిన్న రంధ్రాలు కనిపిస్తే మాత్రం దాన్ని కొనుగోలు చేయకండి. ఎందుకంటే అలాంటి పుచ్చకాయలు ఇంజెక్షన్ చేసి ఉండవచ్చంటున్నారు నిపుణులు.
కర్బూజతో "సేమియా పాయసం" - సూపర్ టేస్టీగా ఉంటుంది - స్పెషల్ అకేషన్స్‌కు బెస్ట్!
మార్కెట్లో "కల్తీ పనీర్" - ఇంట్లోనే 'పల్లీలతో' హెల్దీగా తయారు చేసుకోండి! - చాలా ఈజీ!

