మీ ఫోన్లో ఈ 'యాప్' ఉంటే చాలు - కల్తీ ఫుడ్‌పై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం చాలా ఈజీ!
కల్తీ ఆహారానికి చెక్ పెట్టే కేంద్ర ప్రభుత్వ సూపర్ యాప్ - దీన్ని ఎలా వాడాలో తెలుసా?

By ETV Bharat Andhra Pradesh Team
Published : October 11, 2026 at 11:34 AM IST
Food Adulteration Complaint App : హోటల్లో ఆర్డర్ చేసిన కర్రీలో పురుగు వచ్చిందా? ప్యాకెట్ ఫుడ్‌లో కల్తీ జరిగిందా? టీ కొట్టు నుంచి పెద్ద హోటళ్లు, రెస్టారెంట్ల వరకూ మనం రోజూ ఇలాంటి ఎన్నో ఆహార ఉల్లంఘనలను చూస్తూనే ఉంటాం. కానీ, కొందరు ఎవరికి చెప్పాలో తెలియక లైట్ తీసుకుంటారు. అయితే, ఇకపై అలా ఊరుకోవాల్సిన పని లేదు. కేంద్ర ప్రభుత్వం వీటిపై వినియోగదారులే ప్రభుత్వానికి నేరుగా ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఒక సూపర్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే, 'ఫుడ్ సేఫ్టీ కనెక్ట్ యాప్'. దీని ద్వారా సామాన్యులు కూడా చాలా సింపుల్‌గా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయొచ్చు. మరి, ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలి? వేటిపై ఫిర్యాదులు చేయొచ్చు? వంటి పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నేటి రోజుల్లో పెరిగిన ఆహార పదార్థాల కల్తీకి చెక్ పెట్టేందుకు కేంద్రప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే వినియోగదారులు ఆహార కల్తీపై ప్రభుత్వానికి నేరుగా ఫిర్యాదు చేసేందుకు వీలుగా 'ఫుడ్ సేఫ్టీ కనెక్ట్ యాప్'ను తీసుకొచ్చింది. దీని ద్వారా ఎవరైనా ఈజీగా ఫిర్యాదు చేసే వీలు కల్పిస్తోంది. ఈ యాప్‌ను 'ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా'(FSSAI) నిర్వహిస్తోంది.
ఎలా ఉపయోగించాలంటే?
- ముందుగా మీ మొబైల్లో ఫుడ్ సేఫ్టీ కనెక్ట్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. గూగుల్ సహా అన్ని యాప్ స్టోర్ల నుంచి ఉచితంగా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- తర్వాత దాన్ని ఓపెన్ చేసి అందులో మీ మొబైల్ నంబర్/ఈ మెయిల్ ఐడీని నమోదు చేసి ఓటీపీ ఆధారంగా యాప్‌లో అకౌంట్ ఓపెన్ చేయాలి.
- నెక్ట్స్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వొచ్చు.
సూపర్ మార్కెట్లకు వెళ్తున్నారా? - 'ఫుడ్ లేబుల్స్'తో పదార్థాల క్వాలిటీ తెలుసుకోండిలా!
వేటిపై ఫిర్యాదులు చేయవచ్చంటే?
- పాడైపోయిన మాంసం, ఆహార పదార్థాలను నిల్వ ఉంచడం, వడ్డించడం వంటి వాటిపై ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.
- ఆహార పదార్థాల(పాల ఉత్పత్తులు, నూనెలు, ఐస్ క్రీములు, బేకరీ ఉత్పత్తులు తదితరాలు) ప్యాకింగ్‌లో లోపాలు.
- అత్యంత అపరిశుభ్రమైన పరిసరాలు, వంటగదులు
- నిషేధిత, కాలం చెల్లిన, కల్తీ, నాణ్యత లేని పదార్థాల వాడటం, విక్రయాలు
- మోసపూరిత ప్రకటనలు, లేబులింగ్లు
- లైసెన్సులు లేకుండా నిర్వహణ సహా వివిధ ఉల్లంఘనలపై కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ఫుడ్ సేఫ్టీ కనెక్ట్ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
ఆన్లైన్ ఆహార సరఫరా సంస్థల మీదా :
- ఆహార తయారీ, వడ్డన కేంద్రాలతో పాటు ఆన్లైన్ క్విక్ కామర్స్ సంస్థలు, ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, సీ పోర్టుల్లోని ఆహార విక్రయ కేంద్రాల్లో జరిగే ఉల్లంఘనలపైనా యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
- ఇందులో మన ఫిర్యాదుతో పాటు సంబంధిత డాక్యుమెంట్లు, కంపెనీ, అవుట్లెట్, బ్రాండ్, ఉత్పత్తి పేరు, చిరునామా, ఫిర్యాదుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలి.
- FSSAI లైసెన్సు నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ తెలిస్తే ఇవ్వొచ్చు. సంబంధిత భోజనశాల, అవుట్లెట్ ఫొటోను అప్లోడ్ చేయాలి.
- అన్ని వివరాలు నమోదు చేశాక మనకు టికెట్ నంబర్ వస్తుంది. దీని ఆధారంగా ఫిర్యాదు ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు.
లైసెన్స్ తీసుకోవచ్చు :
- ఏడాదికి రూ.12 లక్షల లోపు టర్నోవర్ ఉన్న చిన్న వ్యాపారులు, హోటళ్ల యజమానులు, తోపుడు బండ్లు, దుకాణదారులు ఈ యాప్ ద్వారానే నేరుగా FSSAI రిజిస్ట్రేషన్(ప్రాథమిక లైసెన్స్) పొందవచ్చు.
- మనం వెళ్లిన ఆహార సంస్థ లైసెన్సు నంబర్ ఇందులో నమోదు చేయడం ద్వారా అది రెన్యువల్ అయినది లేనిది, ప్రస్తుత స్థితి తెలుసుకోవచ్చంటున్నారు FSSAI అధికారులు.
మీరు కొనే 'వస్తువు' అసలైనదేనా? - ఈ ప్రభుత్వ గుర్తులతో ఈజీగా కనిపెట్టండిలా!
మంటను బట్టే 'స్టవ్' సరిగా పనిచేస్తుందో లేదో చెప్పేయొచ్చు! - ఏ రంగు దేనికి సూచికంటే?

