ఘుమఘుమలాడే "ఫిష్ కుర్మా" - ఈ పద్ధతిలో చేస్తే జిందగీ ఖుష్ అయిపోద్ది!
మళ్లీమళ్లీ తినాలనిపించేంత రుచితో చేపల కూర - ఓసారి ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి!

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 22, 2026 at 10:24 AM IST
Fish Kurma Making in Telugu : సీఫుడ్స్‌లో చేపలకు ఉండే క్రేజ్ వేరు. వీటితో కర్రీ, ఫ్రై, పులుసు అంటూ వివిధ రకాల రెసిపీలు చేస్తుంటారు. మరి మీరెప్పుడైనా వీటితో కుర్మాను ట్రై చేశారా? లేదంటే మాత్రం ఓసారి ఇప్పుడు చెప్పబోయే పద్ధతిని పాటిస్తూ చేశారంటే ముద్దకో ముక్క తింటారు. బిగినర్స్ కూడా ఈ కొలతలతో చేస్తే రుచి అదుర్స్ అంతే. ఈ విధంగా ఇంట్లో చేసి పెడితే పిల్లలు, పెద్దలూ వావ్ అనాల్సిందే. మరి ఘుమఘుమలాడే చేపల కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
పాలకూరతో ఇలా ట్రై చేయండి - తక్కువ రైస్, ఎక్కువ కర్రీ తినేయొచ్చు!

కావాల్సిన పదార్థాలు :
- చేప ముక్కలు - అర కిలో (500 గ్రాములు)
- ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు
- పచ్చిమిర్చి - 3
- జీడిపప్పు పలుకులు - 15
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - 2 స్పూన్లు
- ధనియాల పొడి - ఒక స్పూన్
- గరం మసాలా - ఒక స్పూన్
- జీలకర్ర పొడి - ఒక స్పూన్
- పెరుగు - ఒక కప్పు
- ఉప్పు - రుచికి సరిపడా
- యాలకులు - 3
- దాల్చినచెక్క - 1
- బిర్యానీ ఆకులు - 2
- లవంగాలు - 4
- కొత్తిమీర - కొద్దిగా
- నూనె - 4 స్పూన్లు
- పసుపు - ఒక స్పూన్

తయారీ విధానం :
- ముందుగా మిక్సింగ్ బౌల్లో అర కిలో చేప ముక్కలను వేసి శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు, అర స్పూన్ పసుపు వేసి కలపాలి. అనంతరం మూతపెట్టి 10 నిమిషాల పాటు పక్కనుంచాలి.
- అలాగే ఓ గిన్నెలో 15 జీడిపప్పు పలుకులు, సరిపడా నీళ్లు పోసి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. పదిహేను నిమిషాల తర్వాత వీటిని మిక్సీజార్‌లో వేసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేయాలి. అదేవిధంగా కావాల్సిన పరిమాణంలో ఉల్లిపాయలను తరిగి ఉంచాలి.

- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో నాలుగు స్పూన్ల నూనె పోయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక దాల్చినచెక్క, రెండు బిర్యానీ ఆకులు, మూడు యాలకులు, నాలుగు లవంగాలు వేసి వేయించాలి.
- మసాలా దినుసులు వేగాక కట్ చేసి పెట్టుకున్న కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక రెండు స్పూన్ల అల్లంవెల్లుల్లి పేస్ట్, మూడు పచ్చిమిర్చి యాడ్ చేసి ఫ్రై చేయాలి.

- అనంతరం చేప ముక్కలు, పావు కప్పు వేడి వేడి నీళ్లు పోసి కలపాలి. ఆ తర్వాత మూతపెట్టి మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించాలి.
- ఈ మిశ్రమం ఉడికాక ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి వేయాలి. అదేవిధంగా ఒక స్పూన్ గరం మసాలా, అర స్పూన్ పసుపు, గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసి వేయించాలి.

- ఇందులోనే కప్పు పెరుగును కొద్దికొద్దిగా వేస్తూ ఆయిల్ పైకి తేలేంత వరకు వేగనివ్వాలి.
- ఆయిల్ సేపరెట్ అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- అంతే ఘుమఘుమలాడే ఫిష్ కుర్మా సిద్ధంగా ఉంటుంది!
- ఈ కర్రీ అన్నంలోకే కాకుండా చపాతీ, రోటీ, పరోటా, నాన్, పుల్కా, పులావ్ వాటిల్లోకి అద్దిరిపోతుంది.
బియ్యప్పిండితో "మైసూర్ బోండాలు" - ఇలా చేస్తే క్రంచీగా, గుల్లగా వస్తాయి!
నోరూరించే "క్యాప్సికం పచ్చడి" - వద్దన్న వారే ఇష్టంగా తింటారు!

