ETV Bharat / offbeat

అబద్ధపు షాపింగ్.. బోలెడంత ఆనందం! - ట్రై చేస్తారా?

- అవసరం లేని షాపింగ్​తో పర్సు ఖాళీ చేసుకుంటున్న జనాలు - "ఫేక్ షాపింగ్"తో సొల్యూషన్ కనిపెట్టిన దక్షిణ కొరియా!

Fake Shopping Websites
Fake Shopping Websites (eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : July 8, 2026 at 11:56 AM IST

2 Min Read
Choose ETV Bharat

Fake Shopping Websites : కొందరికి స్లీపింగ్ డిజార్డర్ ఉంటుంది. మరి కొందరికి ఈటింగ్ డిజార్డర్ ఉంటుంది. ఇదేవిధంగా ఇంకొందరికి షాపింగ్ డిజార్డర్ కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అల్మారా నిండా దుస్తులు ఉంటాయి, అయినా సరే మరో కొత్త డ్రెస్ కావాలంటూ షాపింగ్​కు వెళ్లిపోతారు. ఇంటి నిండా కావాల్సిన వస్తువులన్నీ ఉంటాయి. అయినా సరే, "ఒకటి తక్కువైంది" అంటూ ఛలో షాపింగ్ అంటారు. తీరా నెలాఖరుకు వచ్చే సరికి డబ్బులు సరిపోవడం లేదని టెన్షన్ పడిపోతారు. ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ మిగలట్లేదని బాధపడుతుంటారు. ఈ పరిస్థితికి కారణం ఏంటా అని ఆరాతీస్తే, షాపింగే అని తేలుతుంది. కానీ, దాన్ని మానుకోలేకపోతుంటారు. తెలిసినా కూడా ఎందుకు మానుకోలేరు అంటే.. ఇదంతా డొపమైన్ చలవే!

అవును, డొపమైన్ అనేది హ్యాహీ హార్మోన్. కొన్ని పనులు చేసినప్పుడు బ్రెయిన్ లో ఇది రిలీజ్ అవుతుంది. ఇది ఎంత ఎక్కువగా రిలీజ్ అయితే మనిషి అంత సంతోషంగా ఉంటాడు. ఏ పని చేసినప్పుడు ఆనందం కలుగుతుందో మనసు రికార్డు చేసి పెట్టుకుంటుంది. అంతే, ఇక పదా మళ్లీ మళ్లీ అదే పని చెయ్ అంటూ పోరు పెడుతుంది. అందుకే మళ్లీ మళ్లీ అదే పని చేస్తుంటారు. చివరకు అదొక వ్యసనంగా మారుతుంది. గేమింగ్ అడిక్షన్, మొబైల్ అడిక్షన్ ఇలా.. ఇతరత్రా వ్యసనాలన్నీ ఈ కోవకే చెందుతాయి. ఇదేవిధంగా షాపింగ్ చేయడం కూడా చాలా మందికి తెలియకుండానే ఒక వ్యసనంలా మారిపోతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా సౌత్‌ కొరియా వాళ్లు ఒక పరిష్కారం కనిపెట్టారు.

డొపమైన్ సైట్లు, యాప్స్ :

ప్రస్తుతం ఈకామర్స్​ వెబ్​ సైట్లు, యాప్స్​లో ఎలాగైతే షాపింగ్ చేస్తున్నారో, వీటిల్లో కూడా అదేవిధంగా షాపింగ్ చేయొచ్చు. వీటిల్లోకి ఎంటరైన తర్వాత రియల్ యాప్స్​ మాదిరిగానే మీకు కావాల్సిన వస్తువులన్నీ కనిపిస్తాయి. తేడా ఏమీ ఉండదు. మొబైల్లో స్క్రోలింగ్ చేస్తూ, మీకు నచ్చిన వస్తువులను సెలక్ట్ చేసుకోవచ్చు. Add Cart ఆప్షన్​ నొక్కి ఆ వస్తువులు మీ బుట్టలో కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఆర్డర్​ కూడా ప్లేస్ చేయొచ్చు. కానీ.. మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు మాత్రం కట్ కావు. డబ్బులు కట్​ కాలేదు కాబట్టి ఆ వస్తువులు కూడా మీ ఇంటికి రావు!

ఉపయోగం ఏంటి?

ఇదేం తీరు? దీనివల్ల ఉపయోగం ఏంటి? అనే సందేహం చాలా మందికి వస్తుంది. ఇక్కడే ఈ యాప్స్ వల్ల కలిగే మేలు ఏంటో చెబుతున్నారు. మనం ముందుగా చెప్పుకున్నట్టు అవసరం లేకున్నా షాపింగ్ చేసే వారికి ఇది ఎంతో మేలు చేస్తుందట. షాపింగ్ చేస్తున్నప్పుడు డొపమైన్ రిలీజ్ అవుతుంది. దాంతో ఆనందంగా ఉంటారు. డబ్బులు ఖర్చయ్యే అవకాశం ఉండదు.

కొరియాలో ఈ కాన్సెప్ట్ బాగానే వర్కవుట్ అవుతోందట. షాపింగ్ వైపు మనసు లాగేవారు, మానసిక ఒత్తిడిలో ఉన్నవారు కూడా ఈ పద్ధతిని ట్రై చేస్తున్నారట. ఈ​ షాపింగ్‌ వల్ల ఎంత డబ్బు సేవ్​ చేశారో కూడా చెబుతూ.. కొన్ని యాప్స్ రివార్డు పాయింట్లు కూడా ప్రకటిస్తున్నాయట. దాంతోపాటు ఎన్ని అడిషనల్ కేలరీలు దేహంలోకి చేరకుండా కాపాడుకోగలిగారో కూడా వివరిస్తున్నాయట. మరి, ఈ పద్ధతి బాగుందని అనిపిస్తే, మీరు కూడా ట్రై చేస్తారా?