ETV Bharat / offbeat

మెరిసేదంతా బంగారం కాదండీ! - ఆభరణాలు కొనేటప్పుడు ఈ టిప్స్​ పాటిస్తే బెస్ట్​!

బంగారం కొనాలని అనుకుంటున్నారా? - అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి!

Gold Buying Tips
Gold Buying Tips (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 6, 2026 at 12:33 PM IST

3 Min Read
Choose ETV Bharat

Gold Buying Precautions : భారతీయులకు బంగారం అంటే ఎంతో మక్కువ. సాధారణంగా ఎంతో కొంత పసిడి ఆభరణాలు ధరించాలని ఆరాటపడుతుంటారు. ఇది ఒక సెంటిమెంట్​లాగా మారిందని చెప్పొచ్చు. అయితే గోల్డ్ కొనేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని లేకపోతే మోసాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే కొందరు వ్యాపారులు ప్రజల అమాయకత్వం, అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారని హెచ్చరిస్తున్నారు. స్వచ్ఛత ప్రమాణాలు పాటించకుండా నకిలీ, నాణ్యత లేని బంగారం అంటగడుతుంటారని వివరిస్తున్నారు. అందుకే గోల్డ్ కొనుగోలు విషయంలో కొన్ని మెలకువలు పాటించాలని సూచిస్తున్నారు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందామా?

హాల్​మార్క్ గుర్తు బంగారు నగల స్వచ్ఛతను తెలియజేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. మార్కెట్‌లో నకిలీ హాల్‌మార్క్‌లు విచ్చలవిడిగా చెలామణిలోకి రావడంతో నిజమైనది ఎలా ఉంటుందో తెలియక ప్రజలు మోసపోతున్నారని హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు పాత హాల్‌మార్క్‌లో బీఐఎస్​ లోగో, 916, హాల్‌మార్క్‌ వేసే సంస్థ కోడ్, నగ తయారీ సంస్థకు ఇచ్చిన కోడ్‌ ఉండేదని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత స్వచ్ఛతను నిర్ధారించే వ్యవస్థ లేకపోవడంతో నకిలీలు వచ్చేశాయని వివరిస్తున్నారు. తద్వారా వినియోగదారులు నష్టపోతున్నారని అంటున్నారు.

దీన్ని నివారించేందుకు బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండెర్డ్స్‌ (బీఐఎస్​) దృష్టి సారించిందని వివరిస్తున్నారు. ఇందులో భాగంగా వినియోగదారులకు స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు అందివ్వాలన్న లక్ష్యంతో బీఐఎస్,​ 2023 సంవత్సరం నుంచి 6 అక్షరాలతో కూడిన కొత్త హాల్‌మార్క్‌ తీసుకొచ్చిందని తెలియజేస్తున్నారు. 2023 ఏప్రిల్‌ తర్వాత నుంచి కొనుగోలు చేసిన నగలకు ఈ కొత్త హాల్‌మార్క్‌ తప్పనిసరి అని చెబుతున్నారు. ఇందులో భాగంగా నగపై బీఐఎస్​ గుర్తు, 22కే, 916, 6 అక్షరాలతో కూడిన కోడ్‌ ఉంటుందని ఈ కోడ్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని సూచిస్తున్నారు. అంతేకాక బీఐఎస్​ కేర్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారని పేర్కొంటున్నారు.

బీఐఎస్​ కేర్​ యాప్​ :

బంగారు నగ స్వచ్ఛత నిర్ధారణతో పాటు దానిపై ఉన్న హాల్‌మార్క్‌ వివరాలను బీఐఎస్​ కేర్​ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని చెబుతున్నారు. ఇందుకోసం ప్లే స్టోర్‌ నుంచి దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పేర్కొంటున్నారు. యాప్​లో వెరిఫై హెచ్‌యూఐడీని క్లిక్‌ చేసి, హెచ్‌యూఐడీ నంబరు (6 అక్షరాల కోడ్‌) నమోదు చేయాలని వివరిస్తున్నారు. వెంటనే నగ తయారీ నుంచి హాల్‌మార్క్‌ వేసిన వారి వివరాలు అన్నీ వచ్చేస్తాయని అలా రాలేదంటే అది నకిలీదని గుర్తించాలని సూచిస్తున్నారు.

నాణ్యతలోనే కాదు, తూకాల్లోనూ మోసాలు : కొందరు వ్యాపారులు నాణ్యతలోనే కాకుండా తూకాల్లోనూ మోసాలకు పాల్పడుతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. వాస్తవానికి బంగారాన్ని ఎలక్ట్రానిక్ పరికరాలతోనే తూకం వేయాల్సి ఉంటుందని, అలా కాకుండా ఎవరైనా సంప్రదాయ పద్ధతిలో తూకం వేస్తే అందులో మోసం ఉన్నట్లు గుర్తించాలని సూచిస్తున్నారు. అందుకే ఆభరణం కొనుగోలు చేసేప్పుడు బరువు తప్పక చూసుకోవాలని తెలియజేస్తున్నారు. ట్యాగ్‌పై ఎలక్ట్రానిక్ మిషన్‌లో వచ్చిన బరువు ఒక్కటేనా కాదా అని చెక్ చేసుకోవాలని నిపుణులు వివరిస్తున్నారు.

ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు :

  • విజయవాడకు చెందిన రజని అనే మహిళ హాల్‌మార్క్‌ గుర్తుతో ఆరు నెలల క్రితం ఉంగరం కొన్నారు. అత్యవసరమై దాన్ని అమ్మేందుకు గోల్డ్ షాప్​కి తీసుకెళ్లగా అది నిజమైన హాల్‌మార్క్‌ కాదని తేలింది. పైగా 14 క్యారెట్లు మాత్రమే ఉండడంతో కొనుగోలు చేసిన దుకాణానికి వెళ్లి వారిని ప్రశ్నిచారు.
  • అదేవిధంగా గవర్నర్‌పేటలోని ఓ గోల్డ్​ షాప్​లో ఇటీవల బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండెర్డ్స్‌ అధికారులు సోదాలు చేశారు. నకిలీ హాల్‌మార్క్‌ ఉన్న రెండు కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
  • ఒక నగకు హాల్‌మార్క్‌ వేయాలంటే కనీసం నాలుగు గంటల నుంచి ఆరు గంటల సమయం పడుతుంది. కానీ కొన్ని దుకాణాల్లో ఐదు నిమిషాల్లో వేసి ఇచ్చేస్తున్నారు. ఇందుకోసం రూ.50 తీసుకొని హాల్​మార్క్‌ అంటూ నకిలీ ముద్ర వేసేస్తున్నారు.

ఉక్కపోతతో అల్లాడుతున్నారా? - 'ఈ పెయింట్'​ వేస్తే మీ ఇల్లంతా చల్లగా!

"మీకు క్రెడిట్ కార్డు అవసరమా?" - లాభ, నష్టాలపై అపోహలు, వాస్తవాలివే!